Hyderabad News: చందానగర్‌లో దారుణం, ఇంట్లో నుంచి 7 రోజులుగా దుర్వాసన - తలుపు తెరిచి విస్తుపోయిన స్థానికులు!
Hyderabad News: వారం రోజులుగా తలుపులు తీయడం లేదు. అందులోనూ దుర్గంధం రావడంతో స్థానికులంతా ఓ ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా.. ఆ కుటుంబం మొత్తం చనిపోయి కనిపించింది. అసలేం జరిగిందంటే?
Hyderabad News: హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేరుకున్నారు. వారం రోజులుగా తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
చందానగర్ రాజీవ్ గృహ కల్పలో ఉంటున్న నాగరాజు, సుజాత దంపతులకు ఇధ్దరు పిల్లలు. కూతురు రమ్య శ్రీ, కుమారుడు టిల్లుతో కిలిసి ఇక్కడే ఏడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా పిల్లలు తాగించి ఆ తర్వాత దంపతులు కూడా తాగారు. ఇంట్లోనే మృతి చెందారు. గత శుక్రవారం నుంచి కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాకపోడంతో.. వారంతా ఊరెళ్లారేమోనని స్థానికులు భావించారు.
అయితే ఈరోజు ఎక్కువగా దుర్గంధం వస్తుండటంతో ఎక్కడి నుంచి వస్తుందా అని కాలనీ వాసులంతా కలియ తిరిగారు. చివరగా నాగరాజు, సుజాతల ఇంట్లోంచి వస్తున్నట్లు గుర్తించారు. చాలా సేపు తలుపు కొట్టినా ఎవరూ తీయకపోవడంతో.. తలుపులు పగులగొట్టారు. లోపల నలుగురు చనిపోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారంతా ఎందుకు చనిపోయి ఉంటారని స్థానికులతో కాసేపు మాట్లాడారు. కుటుంబ కలహాలే కారణం అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కోడలు జీతాన్ని పుట్టింటికి పంపుతోందని అత్త ఆత్మహత్య..
హైదరాబాద్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ ముస్తఫా ప్లాజాలో ఉండే మెరాజ్ సుల్తానా(48) భర్త మఖ్దూం అహ్మద్ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె ఫర్హానా నాజ్, కుమారుడు ముజఫర్ ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. కుమార్తెకు అమెరికా సంబధం చూసి పెళ్లి చేసి పంపించింది. అయితే మూడు నెలల క్రితం కుమారుడు ముజఫర్.. కాలాపత్తర్ కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తల్లికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. అందులోనూ కట్నకానుకలు ఏమీ తీసుకురాకపోవడంతో కుమారుడితో వాదించింది.
దీంతో కొడుకు ముజఫర్.. ఆమె కట్నకానుకలు ఏం తీస్కురాకపోయినా.. ఆమె ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. నెలనెలా వచ్చే జీతమంతా నీకే ఇస్తుందని చెప్పాడు. దీంతో ఆమె కాస్త చల్లబడింది. అయితే కోడలు మాత్రం నెలనెలా తనకు వచ్చే జీతాన్ని అత్తగారికి కాకుండా.. తన పుట్టింటికి అంటే తల్లిదండ్రులకు పంపిస్తోంది. విషయం తెలుసుకున్న సుల్తానా కుమారుడు, కోడల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. విషయం తెలుసుకున్న ఫర్హానా అమెరికా నుంచి కొత్త దంపతులకు ఫోన్ చేసి సర్ది చెప్పింది. వారం రోజుల పాటు మీ పుట్టింట్లోనే ఉండమని.. తాను అమ్మకు నచ్చజెబుతానని వివరించింది. ఇదే విషయమై తల్లికి ఈనెల 11వ తేదీన అమెరికా నుంచి ఫర్హానా ఫోన్ చేసింది.
అయితే తల్లి ఎంతకూ ఫోన్ లేపకపోవడంతో తమ్ముడికి ఫోన్ చేసి తల్లి వద్దకు వెళ్లాలని చెప్పింది. అదేరోజు రాత్రి ఏడున్నరకు బంధువులతో కలిసి ఇంటికెల్లి తలుపు తట్టాడు. అయినా తల్లి తలుపు తీయకపోవడంతో వెనక నుంచి వెళ్లి వంట గదిలో చూడగా.. కాలిన గాయాలతో తల్లి మృతి చెంది ఉంది. వెంటనే విషయాన్ని అమెరికాలో ఉన్న అక్కతో పాటు పోలీసులకు కూడా తెలియజేశాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆమె కావాలనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.