Fake Maoist Arrest: కాంట్రాక్టర్లు, ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మావోయిస్టుల అరెస్టు
Fake Maoist Arrest: మావోయిస్టు పార్టీ నిధుల సేకరణ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.
Fake Maoist Arrest: మావోయిస్టు పార్టీ నిధుల సమీకరణ పేరుతో కాంట్రాక్టర్లు, సామాన్య ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మావోయిస్టుల ముఠాను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ మావోయిస్టులుగా తిరుగుతూ రోడ్డు, వంతెన కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారిపై ఐపీసీ 387, 419, 120(బి) సెక్షన్లతో పాటు సెక్షన్ 25 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ వెల్లడించారు.
గత నెల 30వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో అలగం వంతెన, అలగాం గ్రామం, జి. మాడుగుల మండలం లువ్వసింగి పంచాయతీలకు చెందిన గెమ్మెలి సత్తిబాబు, ములజంగి చిన్నారావు, కిల్లో ఎప్రాలను పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలగం వంతెన కాంట్రాక్టర్ ను నిందితులు బెదిరించి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 21వ తేదీన అలగం బ్రిడ్జి వద్దకు వెళ్లి నెలాఖరుగాలో డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించకుంటే చంపేస్తామని కాంట్రాక్టర్ ను బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అతని యంత్ర సామగ్రిని తగులబెట్టారు.
మరో నిందితుడు గెమ్మెలి సత్తిబాబు 2015లో జి. మాడుగుల గుధాలం వీధి ఆశ్రమంపై జరిగిన దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. గత మార్చి 20వ తేదీన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి కోరుకొండ సమీపంలోని యర్రగొప్ప గ్రామంలో డీజిల్ పోసి జేసీబీని దగ్ధం చేసినట్లు గుర్తించారు. ములజంగి చిన్నారావు 2013 నుండి 2015 మధ్య కాలంలో కిల్లంకొట ప్రాంతంలో మిలీషియాగా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలోనే బచ్చలి బాలకృష్ణ హత్య ఘటనలో పాల్గొన్నట్లు వెల్లడించారు. అలాగే 2015లో జరిగిన గుధాలం వీధి ఆశ్రమం దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నట్లు తేల్చారు.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి మూడు మ్యాన్ ప్యాక్‌లు, రెండు ఎయిర్ పిస్టల్స్, మూడు ఎస్బీబీఎల్ గన్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, 45 వేల రూపాయల నగదు, రెండ్ పల్సర్ 150 సీసీ బైకులు, మూడు ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు సహా ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన పలు దోపిడీ ఘటనల వల్ల మాజీ మిలిషీయా సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. మావోయిస్టుల వేషధారణతో అభివృద్ధి పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పౌరుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వారందరూ నిజమైన మావోయిస్టులు కారని గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, భయపడి డబ్బు ఇవ్వకూడదని చెబుతున్నారు.
మావోయిస్టు పార్టీ పేరు చెప్పుకుని ఇలా నకిలీ ముఠాలు దోపిడీలకు పాల్పడటం ఇదేం కొత్త కాదు. అయితే ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా నకిలీ ముఠాలను గుర్తించి అరెస్టు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు అధికారులు చెబుతున్నారు.