(Source: ECI/ABP News/ABP Majha)
East Godavari Crime : భూమి కోసం ఊరికొస్తే, సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టారు-కాకినాడ జిల్లాలో దారుణం!
East Godavari Crime : స్వగ్రామంలోని పోడు భూమి కోసం గ్రామపెద్దలను కలిసొస్తానని చెప్పి వెళ్లిన భర్త మూడు నెలలైన తిరిగిరాలేదు. అనుమానం గ్రామానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులకు అతడి అస్థిపంజరం దొరికింది.
East Godavari Crime : సొంత గ్రామంలో ఉన్న పోడు భూమి విషయంలో స్థానిక పెద్దలను వద్దకు వెళ్లి వస్తానని చెప్పి భర్త ఎన్నిరోజులకూ తిరిగి రాకపోవడంతో మహిళ తన భర్త ఆచూకీ కోసం వస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. సమస్యల్లో ఉన్న పోడు భూమి గురించి మూడు నెలల కిందట భార్య భర్తలు వచ్చారు. గ్రామ పెద్దలను కలిశారు. మళ్లీ వెళ్లి ఒకసారి గ్రామపెద్దలను కలిసొస్తానని రావడమే అతను చేసిన తప్పిదమా? మూడు నెలల తరువాత వెలుగు చూసిన దారుణ ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్పై రఘునాథ రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సెప్టిక్ ట్యాంకులో మృతదేహం
జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన కుంచే అప్పన్న (48) ఏడాది కాలంగా కుటుంబంతో కలిసి విజయవాడలో ఉంటున్నాడు. అక్కడే చిన్న పనిచేసుకుని జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలో కొండపోడు భూమి విషయంలో సమస్య ఉండడంతో జూన్ 5న స్వగ్రామానికి భార్య సత్యవతితో కలిసి వచ్చాడు. ఇక్కడ స్థానిక పెద్దలను కలిసి తన భూమి సమస్య పరిష్కరించాలని కోరారు. ఆ తరువాత మళ్లీ మూడు రోజుల తరువాత పెద్దలను కలిసి వస్తానని భార్యకు చెప్పి స్వగ్రామమైన మల్లిసాలకు వచ్చాడు. అయితే భర్త నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఎదురుచూసి ఇటీవలే తోటి కోడలికి ఫోన్ చేసి తన భర్త గురించి సమాచారం అడిగింది. అప్పన్న ఇక్కడికి రాలేదని తోటి కోడలు సమాచారం ఇవ్వడంతో ఈ నెల 7వ తేదీన ఆమె మల్లిసాలకు వచ్చింది. అప్పన్న ఆచూకీ కోసం బంధువులను, గ్రామస్తులను అడుగుతున్న క్రమంలో వారి ఇంటి వెనుకనున్న సెప్టిక్ ట్యాంకు నుంచి దుర్వాసన రావడాన్ని గమనించారు. అక్కడకు వెళ్లి సెప్టిక్ ట్యాంకు మూత తీయించి చూస్తే అప్పన్న చొక్కా కనిపించింది. అది కొంచెం కదిపితే అప్పన్న దుస్తులతో ఉన్న అస్తిపంజరం కనిపించింది. ఈ సంఘటనపై వెంటనే జగ్గంపేట పోలీసులకు సమాచారం అందించింది అప్పన్న భార్య.
హత్య కేసు నమోదు
స్వగ్రామంలో కొండ పోడు భూమి విషయంలో అప్పన్నకు కుటుంబంలోని కొందరికి సమస్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని గురించే తరచూ పెద్దలను కలిసి మాట్లాడుతుండేవాడని, ఈనేపథ్యంలోనే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే అప్పన్న భార్య ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానితులను విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు వాస్తవాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. భూమి కోసం వస్తే ప్రాణం తీశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. భూమి కోసం ఇంత కిరాతంగా హత్య చేయడం సంచలనమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read : Hyderabad Crime : హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ విషాదాంతం,పెళ్లికి నిరాకరించిందని ప్రియుడే ఘాతుకం
Also Read : Loan Apps Threats : నగ్న చిత్రాలు ఆన్ లైన్ లో పెడతాం, లోన్ యాప్ వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్య