(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad News: బ్యాగుల్లో చాక్లెట్, స్వీట్ ప్యాకెట్స్ - అనుమానంతో తనిఖీ చేసిన పోలీసులకు షాక్
Drugs Seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు వ్యక్తుల నుంచి డీఆర్ఐ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని తెలిపారు.
Drugs Seized In Shamshabad Airport: ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లో (Hyderabad) కూల్‌గా చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్స్‌తో ఫ్లైట్ దిగారు. అనుమానం వచ్చిన అధికారులు వారి బ్యాగులు తనిఖీ చేయగా ఒక్కసారిగా షాకయ్యారు. వాటిల్లో రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను చూసి వారిని పట్టుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. ఎన్ని శిక్షలు పడుతున్నా.. స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు భారతీయులను లగేజీలో ఏదో అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వారిని ఆపి తనిఖీలు చేపట్టారు.
చాక్లెట్ ప్యాకెట్స్‌లో..
తనిఖీల్లో భాగంగా కెల్లాగ్స్ చాకోస్ 13 ప్యాకెట్లలో హైడ్రోఫోలిక్ గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 7.096 కిలో డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. వీరిపై 1985 ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ హైడ్రో ఫోలిక్ గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. డ్రగ్స్ కంటే విలువైన, ఖరీదైన గంజాయిగా చెబుతుంటారు. ఇది కొన్ని దేశాల్లో మాత్రమే తయారవుతుందని పేర్కొంటున్నారు.
మరోవైపు, బాలానగర్‌లో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సుమన్, లాలు, విజయ్ కుమార్‌ల నుంచి 2.6 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని తెలిపారు.