Chittoor: స్కూలుకు వెళ్లొస్తున్న బాలికపై అత్యాచారం - రహస్యంగా ఉంచిన బాలిక, చివరికి
Chittoor Rape Case: చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు మైనర్ బాలికను భయపెట్టి గర్భవతిని చేసిన ఘటన సంచలనం రేపుతుంది.
ఏపీలో రోజురోజుకూ ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు భయపెట్టో, మాయ మాటలు చెప్పో మైనర్ బాలికను లొంగ దీసుకుని కోరిక తీర్చుకుంటున్నారు కొందరు మృగాలు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పట్టడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు మైనర్ బాలికను భయపెట్టి గర్భవతిని చేసిన ఘటన సంచలనం రేపుతుంది. కడుపు నొప్పి అని చెప్పడంతో మైనర్ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో బాలిక నిండు గర్భవతిగా వైద్యులు గుర్తించారు. మైనర్ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి పదో తరగతి చదివే బాలిక ఉంది. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో ఎంతో గారాబంగా పెంచేవాడు. ఎంతో చలాకీగా ఉండే బాలిక గ్రామానికి పక్కనే ఉన్న గ్రామంలో స్కూల్ కి వెళ్తూ వచ్చేది. అయితే ఆ బాలిక తన పెద్దమ్మ ఇంటికి వెళ్తూ వస్తుండేది. ఈ క్రమంలో బాలికపై కన్నేశాడు అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు. బాలిక ఒంటరిగా వెళ్తూ, రావడానికి గమనించిన రాజేష్ ఎలాగైనా బాలికతో తన కోరికను తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలోనే బాలిక తన పెద్దమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చేవాడు. ఇలా బాలికతో పరిచయం పెంచుకునేందుకు రాజేష్ అనేక రకాలు ప్రయత్నించాడు.
అయితే, ఓ రోజు గ్రామంలోని స్కూల్ నుండి వస్తున్న బాలికను గమనించిన రాజేష్ వెంటపడి మాయ మాటలతో లొంగ దీసుకునేందుకు ప్రయత్నించాడు. రాజేష్ మాయమాటలకు లొంగని బాలిక రాజేష్ నుండి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అటు తరువాత బాలిక కోసం దారిలో కాపుకాసిన రాజేష్ బాలికను బలవంతం చేయబోయాడు. ఇంతలో దారిలో గ్రామస్తులను చూసి రాజేష్ పరార్ అయ్యాడు. మైనర్ బాలిక తల్లిదండ్రులకు భయపడి రాజేష్ వేధింపులను ఇంటిలో చెప్పలేక పోయింది. అయితే రోజూ యథావిధిగా బాలిక స్కూల్ కి వెళ్తూ వస్తున్న క్రమంలో ఒంటరిగా వస్తున్న బాలికను రాజేష్ అడ్డగించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో బాలిక నోరు మూసివేసిన రాజేష్ దారికి పక్కనే ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బాలికను బెదిరించాడు. కేకలు వేస్తే చంపేస్తానని భయాందోళనకు గురి చేసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
రాజేష్ క్రూరత్వం తట్టుకోలేని బాలిక గట్టిగా కేకలు వేసినా పట్టించుకోకుండా ఓ మృగంలా తన కోరిక తీర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళిన బాలిక తనపై జరిగిన లైంగిక దాడిని తల్లిదండ్రులకు వివరించలేక పోయింది. కనీస అవగాహన కూడా లేని బాలిక యథావిధిగా స్కూల్ కి వెళ్తూ వచ్చేది. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతూ వస్తోంది. బాలికకు కడుపు నొప్పి తగ్గేందుకు మందులు వాడినా ఫలితం కనిపించక పోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. మైనర్ బాలికను పరిక్షించిన వైద్యులు నిండు గర్బిణిగా గుర్తించారు. ఇదే విషయాన్ని మైనర్ బాలిక తల్లిదండ్రులకు వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. నిండు గర్భణిగా ఉన్న బాలికకు వైద్యం అందించడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలికను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చిన బాలిక తల్లిదండ్రులు.. రొంపిచర్ల పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.