Chittoor Crime: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లిన వృద్ధుడు, ఆపై దారుణం ! తల్లి రాగానే అక్కడినుంచి పరార్
ఎవరూ లేని సమయం చూసి వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తామని, బొమ్మలు కొనిస్తామని తీసుకెళ్లి లైంగిక దాడులు చేస్తున్నారు కొందరు మానవ మృగాలు.
అభం శుభం తెలియని చిన్నారులపై రోజు రోజుకి లైంగిక దాడులు అధికం అవుతున్నాయి. ఎవరూ లేని సమయం చూసి వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తామని, బొమ్మలు కొనిస్తామని తీసుకెళ్లి లైంగిక దాడులు చేస్తున్నారు కొందరు మానవ మృగాలు. చిన్నారుల నుండి వయసు దాటిన వారిని సైతం కామాంధులు వదలడం లేదు. ముఖ్యంగా మహిళల రక్షణకు దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల వెన్నులో మాత్రం వణుకు పుట్టడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కేంద్రంలో ఎనిమిదేళ్ళ చిన్నారిని బలవంతంగా నిర్మాణంలో ఉన్న ఓ సచివాలయంకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా తవణంపల్లె గ్రామానికి చెందిన ఉమాపతి(70) ఏళ్ల వృద్దుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే భార్య మృతి చెందడంతో ఉమాపతి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఎనిమిదేళ్ల బాలికపై ఉమాపతి కన్ను పడింది. గత కొద్ది రోజులుగా ఉమాపతి బాలికను, బాలిక కుటుంబ సభ్యులను గమనిస్తూ ఉండేవాడు.
నిన్న సాయంత్రం బాలిక ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం వద్ద ఇసుక కుప్పలో ఆడుకుంటూ ఉంది. అదే సమయానికి ఉమాపతి అక్కడి వచ్చి కొంత సేపు బాలికకు మాయమాటలు చెప్పాడు. చాక్లెట్స్, బాస్కెట్లు ఇప్పిస్తానని ఆశ చూపాడు. కానీ బాలిక వృద్దుడి మాటలను వినకుండా ఆడుకుంటూ ఉండగా, ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా నిర్మాణంలో ఉన్న సచివాలయం లోనికి తీసుకెళ్లాడు. ఆ తరువాత బాలికను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాలిక వృద్దుడుని నెట్టి బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నం చేయడంతో బాలిక నోటిని అదిమిపట్టి సచివాలయం లోనికి బలవంతంగా లాక్కెళ్లి ఆ తరువాత బాలికపై అత్యాచారం చేశాడు. వృద్దుడి చేష్టలకు తట్టుకోలేని బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో బాలిక తల్లి పరుగులు తీస్తూ సచివాలయం వద్దకు చేరుకుంది. ఆమె రావడంతో బాలికను అక్కడే వదిలి ఉమాపతి పరార్ అయ్యాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరిక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడు ఉమాపతి కోసం గాలిస్తున్నారు. బాలికకు వైద్యం అందించి వైద్యులు ఎటువంటి అపాయం లేదని చెప్పడంతో చిన్నారి తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని పోలీసులు సూచించారు.