Bengaluru Crime: బెంగళూరులో భారీ ఉగ్ర దాడులకు ప్లాన్, కుట్రను ఛేదించిన పోలీసులు - ఐదుగురు అరెస్ట్
Bengaluru Crime: బెంగళూరులో భారీ దాడులకు ప్లాన్ చేసిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Terrorists Arrested:
బెంగళూరులో ఉగ్రకుట్రని భగ్నం చేశారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పేలుడు పదార్థాలు, తుపాకులు సీజ్ చేశారు. కనకనగర్లో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్న సమయంలోనే పోలీసులు మెరుపుదాడి చేసి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
"బెంగళూరు నగరంలో భారీ దాడులకు కుట్ర పన్నిన ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పట్టుకుంది. వారి నుంచి ఏడు తుపాకులు, బులెట్లు, వాకీటాకీ సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. వీళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు"
- దయానంద, బెంగళూరు పోలీస్ కమిషనర్
4 walkie-talkies, 7 country-made pistols, 42 live bullets, 2 daggers, 2 satellite phones and 4 grenades recovered from the 5 suspected terrorists arrested by Central Crime Branch (CCB), Karnataka. https://t.co/qqDJb06lOw pic.twitter.com/HTOMHXmkof
— ANI (@ANI) July 19, 2023
ఈ ఉగ్రవాదుల్ని సుహైల్, ఒమర్, జాహీద్, ముదసిర్, ఫైజల్గా గుర్తించారు పోలీసులు. అందరూ బెంగళూరుకి చెందిన వాళ్లేనని వెల్లడించారు. వీరిలో ఓ పాతికేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడని వివరించారు. 2017లో ఓ మర్డర్ కేసులో వీళ్లు అరెస్ట్ అయ్యారు. దాదాపు 18 నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. 2019లో విడుదలయ్యారు. అప్పటి నుంచి మళ్లీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నారు. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నజీర్ అనే వ్యక్తితో తమకు కాంటాక్ట్ ఉందని విచారణలో వెల్లడించారు ఉగ్రవాదులు. వీళ్లందరినీ ఉగ్రవాదం వైపు ఉసిగొల్పింది నజీర్ అని పోలీసులు స్పష్టం చేశారు.