Anantapur Crime: ఉపాధ్యాయురాలు మర్డర్ మిస్టరీ, పోలీసులకు దండుపాళ్యం సినిమా చూపించిన స్థానిక దొంగ
అనంతపురం జిల్లాలో మహిళా టీచర్ మర్డర్ మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ హత్యను పార్థీ గ్యాంగ్, మధ్యప్రదేశ్ గ్యాంగ్ పనిగా భావించిన పోలీసులకు స్థానిక దొంగ షాక్ ఇచ్చాడు.
అనంతపురం జిల్లా పోలీసులకు ఓ దొంగ(thief) సినిమా చూపించాడు. అలాంటి ఇలాంటి సినిమా కాదు ఉత్తర భారతదేశం(North India)లోని ఐదు రాష్ట్రాల్లో వేలమందిని విచారించేలా చేశాడు. లక్షల కొద్దీ ఫోన్ కాల్స్ ను వినేలా చేశాడు. వేల సీసీ టీవీ పుటేజీ(CC TV Footage)ని పరిశీలించేలా చేశాడు. మూడు నెలల క్రితం అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్జీవో కాలనీలో ఒక మహిళా టీచర్(Teacher) హత్య, దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ దోపిడీ వెనుక పార్థీ గ్యాంగ్(Parthy Gang), మధ్యప్రదేశ్ గ్యాంగ్(Madhya Pradesh Gang) ఉన్నాయనే అనుమానాలు వచ్చాయి. ఈ హత్యపై పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అనంతపురం పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు.
90 రోజుల దర్యాప్తు
ఈ కేసును తొంబై రోజులు పాటు ఒక అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో ముప్ఫై మంది అధికారులతో కలిపి తొంభై మంది సిబ్బంది విచారణ చేపట్టారు. నిందితుల కోసం ఐదు రాష్ట్రాల్లో తిరుగుతూ లక్షలాది ఫోన్ కాల్స్(Phone Calls) ను విశ్లేషిస్తూ ఐదు వేల మంది అనుమానితులను విచారించారు. అయితే ఇంత విచారణ చేసిన పోలీసులకు చివర్లో నిందితుడు ఎవరో తెలిసి షాక్ కు గురయ్యారు. అసలు ఎక్కడైతే హత్య జరిగిందో అదే పట్టణానికి చెందిన పాత నేరస్థుడే నిందితుడని పోలీసులు(Police) గుర్తించారు. నిందితుడుని అరెస్టు చేసి అతని నుంచి 58 తులాల బంగారం(Gold), రూ.97 వేల డబ్బును స్వాధీనం చేసుకొన్నారు.
కదిరికి చెందిన పాతనేరస్థుడి పనే
ఈ కేసు దర్యాప్తులో వివిధ రాష్ట్రాలు తిరిగిన పోలీసులు స్థానిక పాత నేరస్థులపై నిఘా పెట్టారు. స్టేట్ క్రైం రికార్డ్ బ్యూరో(State Crime Record Bureau)లో నేర వివరాలను పరిశీలించిన పోలీసులు అసలు విషయం తెలిసింది. సంఘటన స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్(Finger Prints) ఆధారంగా నిందితుడు కదిరికి చెందిన షేక్ షపీవుల్లా(35)గా గుర్తిచారు. పెట్రోల్ దొంగతనం(Theft) నుంచి ఇళ్లలో దొంగతనాలు చేయడంలో షపీవుల్లా దిట్ట. నిందితుడిపై ఇప్పటివరకూ పలు కేసులున్నాయి. కర్ణాటక(Karnataka)లో కూడా నిందితుడిపై ఏడు కేసులున్నాయని ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఉపాధ్యాయురాలు ఉషారాణిని హత్య చేసి దొంగతనం చేయడమే కాకుండా సమీపంలోని టీ స్టాల్ రమణ భార్య శివమ్మపై కూడా దాడి చేశాడు నిందితుడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ విషయంలో కీలకంగా వ్యవహరించిని అధికారులను ప్రశంసించాడు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప. ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు చెందిన పార్థీ గ్యాంగ్, మరే ఇతర గ్యాంగుల పనికాదని తేల్చినట్లు ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు.