Crime News: తూ.గో జిల్లాలో దారుణం - భార్యపై అనుమానంతో కత్తెరతో పొడిచి చంపేశాడు
Andhrapradesh News: ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే అనుమానంతో కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Husband Killed His Wife In Nidadavole: తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కిరాతకంగా కత్తెరతో పొడిచి ఆమెను హతమార్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా నిడదవోలు (Nidadavole) మండలం శెట్టిపేట (Settipeta) గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ మేస్త్రీగా పని చేస్తూ భార్య నవ్యతో జీవనం సాగిస్తున్నాడు. పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో 11 ఏళ్ల క్రితం చిరంజీవికి వివాహమైంది. వీరికి ముగ్గురు అమ్మాయిలు. అయితే, కొంతకాలంగా భార్యపై చిరంజీవి అనుమానం పెంచుకున్నాడు. వేరే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఆమెతో తరచూ గొడవ పడేవాడు.
కత్తెరతో పొడిచి..
ఇదే విషయమై దంపతుల మధ్య శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఆమెను హతమార్చాడు. తమ కుమార్తెను చిరంజీవి కత్తెరతో గొంతులో పొడిచి హతమార్చాడని నవ్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
తెలంగాణలోనూ దారుణం
అటు, తెలంగాణలోనూ దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, 10 నెలల చిన్నారిని దారుణంగా చంపేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ అనే వ్యక్తి తన భార్య స్వప్నపై అనుమానంతో ఆమెతో పాటు తన 10 నెలల పాపను గొంతు నులిమి చంపేశాడు. అంతకు ముందు నిందితుడు తాను తన భార్య, పిల్లల్ని చంపినట్లుగా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే రైలు పట్టాలపై శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన గణేష్ నాలుగు నెలల క్రితం బోయిన్పల్లికు వచ్చి నివాసం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వీరి సంతానం మరో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.