(Source: ECI/ABP News/ABP Majha)
PUBG Effect: పబ్‌జీ గేమ్‌కు బానిసైన బాలుడు.. మందలించారని తల్లి, అక్కాచెల్లెల్ని కాల్చి చంపాడు
గేమ్ ఆడొద్దు అని మందలించినందుకు దాడులకు తెగబడిన ఘటనలు చూశాం. పబ్‌జి ఆడొద్దు అని మందలించినందుకు ఓ బాలుడు కుటుంబసభ్యులపై కాల్పులు జరపగా ముగ్గురు చనిపోయారు.
PUBG Effect: ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దని పెద్దలు చెబుతున్నా పిల్లలు పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాలలో లక్షల రూపాయలు ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు స్వాహా చేసిన చిన్నారుల ఘటనలు వెలుగుచూశాయి. గేమ్ ఆడొద్దు అని మందలించినందుకు దాడులకు తెగబడిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. పబ్‌జి ఆడొద్దు అని మందలించినందుకు ఓ బాలుడు కుటుంబసభ్యులపై కాల్పులు జరపగా ముగ్గురు చనిపోయారు.
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లాహోర్ ఖన్నా ఏరియాలో నహిద్ ముబారక్ (45) ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తోంది. ఈమె 14 ఏళ్ల కుమారుడు గత కొంతకాలం నుంచి చదవడం లేదు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లో పబ్‌జీ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. శుక్రవారం నాడు దీనిపై ఇంట్లో గొడవ జరిగింది. పబ్‌జీ ఆడొద్దని బాలుడ్ని తల్లి మందలించింది. తన ఇష్టం ఇని కుమారుడు సమాధానం చెప్పడంతో పదే పదే వారించారు. తనను ఆన్‌లైమ్ ఆడుకోనిస్తలేరని బాలుడు విసుగుచెందాడు.
పబ్‌జీ గేమ్ మత్తులో పడిపోయిన బాలుడు తుపాకీ తీసుకొచ్చి తల్లి, సోదరీమణులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు మైనర్ బాలికలు చనిపోయారు.17, 11 ఏళ్ల వయసున్న మైనర్లు చనిపోయారని పీటీఐ రిపోర్ట్ చేసింది. బాలికలు నిద్రపోతుండగా వారిపై సైతం కాల్పులు జరిపినట్లు సమాచారం. తమ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను పై అంతస్తులో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంటికి వచ్చి కాల్పులు జరిపి తల్లిని, సోదరిమణులను హత్య చేశాడని ఆరోపించాడు.
స్థానికులు మాత్రం బాలుడిపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాలుడ్ని పదే పదే ప్రశ్నించగా తానే కుటుంబసభ్యులను హత్య చేసినట్లు అంగీకరించాడు. తనను పబ్‌జీ గేమ్ ఆడనివ్వకుండా అడ్డుకుంటున్నారని, దాంతో తాను ఇంట్లో ఉన్న తుపాకీతో కాల్పులు జరిపినట్లు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
2020 నుంచి నాలుగో ఘటన
పాకిస్తాన్‌లో తొలిసారి 2020లో ఇలాంటి ఘటన జరగగా.. తాజాగా జరిగినది నాలుగో కేసు అని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలై చిన్నారులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల బాగోగులు చూసుకోవాలని సూచించారు. ఇలాంటి కారణాలతో కొన్ని దేశాల్లో పబ్‌జీ ఆన్ లైన్ గేమ్‌తో పాటు మరికొన్ని గేమ్స్‌ను నిషేధించారు.