Zomato: బ్లింకిట్‌పై ఫోకస్ పెంచిన జొమాటో - రూ.వందల కోట్లు పంపింగ్
Zomato - Blinkit: జొమాటో, తన అనుబంధ సంస్థ జొమాటో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (Zomato Entertainment Ltd) కూడా దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది.
Zomato To Invest Rs 300 Crores In Blinkit: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, తన అనుబంధంగా పని చేస్తున్న క్విక్ కామర్స్ (Quick Commerce) కంపెనీ బ్లింకిట్‌లో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. బ్లింకిట్‌ను 2022 ఆగస్ట్‌లో జొమాటో కొనుగోలు చేసింది. కొత్త పెట్టుబడితో కలిపి, బ్లింకిట్‌లో జోమాటో ఇన్వెస్ట్‌మెంట్ రూ.2300 కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం బ్లింకిట్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆ బిజినెస్‌ను మరింత విస్తరించేందుకు తన పెట్టుబడిని పెంచాలని జొమాటో నిర్ణయించింది. కొత్త పెట్టుబడి గురించి, మంగళవారం (11 జూన్ 2024) నాడు, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ వెల్లడించింది.
జొమాటో దాదాపు రూ. 4,477 కోట్లు వెచ్చించి బ్లింకిట్‌ను కొనుగోలు చేసింది. బ్లింకిట్‌ను గతంలో గ్రోఫర్స్ (Grofers) అని పిలిచేవాళ్లు, తర్వాత పేరు మార్చారు. బ్లింకిట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు జొమాటో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటివరకు, బ్లింకిట్‌కి జొమాటో సుమారు రూ. 2000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు మరో రూ. 300 కోట్లు చొప్పించాలని నిర్ణయం తీసుకుంది.
వినోదం కోసం కూడా రూ.100 కోట్లు పెట్టుబడి
మార్కెట్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి చూస్తే, జొమాటో తన అనుబంధ సంస్థ జొమాటో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (Zomato Entertainment Ltd) కూడా దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ఎంటర్‌టైన్‌మెంట్ లైవ్ ఈవెంట్, టికెటింగ్ వ్యాపారంలో ఉంది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో నుంచి బ్లింకిట్‌కు గట్టి పోటీ
క్విక్ కామర్స్ రంగంలో బూమ్‌తో పాటు పోటీ కూడా వేగంగా పెరుగుతోంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart), జెప్టో (Zepto) నుంచి బ్లింకిట్‌కు బలమైన పోటీ ఎదురవుతోంది. జెప్టోకి నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ (Nexus Venture Partners) మద్దతు ఉంది. ఫుడ్ డెలివరీ & డైన్ ఔట్ విభాగంలో జొమాటోకు స్విగ్గీ ప్రధాన పోటీదారు. స్విగ్గీ, రూ. 10,414 కోట్ల రూపాయల ఐపీవోను ప్రారంభించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి (SEBI) ముసాయిదా పత్రాలు కూడా సమర్పించింది. మరోవైపు, జెప్టో కూడా 300 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కూడా త్వరలో క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగు పెట్టబోతోంది.
ఇటీవల, బ్లింకిట్ డార్క్ స్టోర్‌లను విస్తరిస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి బ్లింకిట్ డార్క్ స్టోర్ల సంఖ్య 562 నుంచి 1000కి పెరిగింది. అంతేకాదు, బ్లింకిట్‌లో ప్రొడక్ట్స్ కేటగిరీ కూడా పెరుగుతోంది. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) లభించే వస్తువులు బ్లింకిట్ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపారం కంటే బ్లింకిట్ వ్యాపారమే పెద్దదిగా మారింది.
గత నెల రోజుల్లో జొమాటో షేర్ ధర 5% పైగా తగ్గింది. గత ఆరు నెలల్లో 55% పైగా ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 48% జంప్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: '5 ట్రిలియన్ డాలర్ల' బాధ్యత నిర్మలమ్మదే - వరుసగా ఏడోసారీ మేడమే!