Year Ender 2022: మాటలతో, చేతలతో 2022లో అత్యంత వివాదాస్పదమైన CEOలు వీళ్లే!
యువకులు రోజుకు 18 గంటలు పని చేయమంటూ సలహా ఇచ్చిన ఒక CEO, సంస్థ నిధులను సొంత విలాసాల కోసం వాడుకుని మరో CEO వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
Year Ender 2022: 2022 సంవత్సరం కొన్ని కంపెనీల & మరికొందరు CEO పరువును బజాన పడేసింది. ట్విట్టర్ ఓనర్‌షిప్ ఎలోన్ మస్క్‌కు బదిలీ అయింది. ఒకప్పుడు విశ్వసనీయమైన క్రిప్టో కంపెనీ అయిన FTX, సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ నాయకత్వంలో కుప్పకూలింది. భారతదేశంలో యువకులు రోజుకు 18 గంటలు పని చేయమంటూ సలహా ఇచ్చిన ఒక CEO, సంస్థ నిధులను సొంత విలాసాల కోసం వాడుకుని మరో CEO వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
2022లో అత్యంత వివాదాస్పదన CEOలు:
1) అత్యంత వివాదాస్పదుడు ఎలాన్ మస్క్ (Elon Musk)
2022లో, అత్యంత వివాదాస్పద CEOల లిస్ట్‌లో నిస్సందేహంగా ఎలాన్ మస్క్‌కే అగ్ర స్థానం ఇవ్వవచ్చు. ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ఈ ఏడాది (2022) ఏప్రిల్‌లో బిడ్ ప్రకటించిన టెస్లా CEO, ఆపై ఆ ఒప్పందం నుంచి వైదొలగడానికి ప్రయత్నించి వార్తల్లోకి ఎక్కారు. ఆ కంపెనీ కోర్టుకు ఎక్కడంతో, ఒప్పందాన్ని గౌరవించడం తప్ప మస్క్‌కు మరో దారి లేకపోయింది.
ట్విట్టర్‌ను కొన్న వెంటనే, ఆ సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. ఉద్యోగులను సామూహికంగా తీసేశారు. ఈ సోషల్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న 7,500 మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మందికి ఉద్వాసన పలికారు. గొడ్డు చాకిరీకి సిద్ధంగా ఉండాలని మిగిలిన వాళ్లకు హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత మస్క్ తీసుకొచ్చిన పాలసీ మార్పులు కూడా వివాదాస్పదంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ సహా కొన్ని ఖాతాలను పునరుద్ధరించాలని మస్క్ తీసుకున్న నిర్ణయం కూడా విమర్శలకు గురైంది.
2) కుప్పకూలిన సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ (Sam Bankman-Fried) క్రిప్టో సామ్రాజ్యం
క్రిఫ్టో మేధావి సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్ క్రిప్టో అదృష్టం ఈ సంవత్సరం తిరగబడింది. రిస్కీ బెట్స్ వేయడంలో పేరుగాంచిన తన తోటి సంస్థ అల్మెడ రీసెర్చ్‌కు (Alameda Research) బిలియన్ల డాలర్ల విలువైన కస్టమర్ ఫండ్స్‌ను FTX మళ్లించింది. బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్, అతని సన్నిహత కార్యనిర్వహణ వర్గం నడుపుతున్న ఈ కంపెనీలో పారదర్శకత లేకపోవడం గురించి విమర్శిస్తూ చాలా రిపోర్ట్ బయటకు వచ్చాయి. FTX కుప్పకూలింది. 99 శాతం పతమైంది. బిలియన్ల కొద్దీ డాలర్లు ఆవిరై, ఇన్వెస్టర్లు బజారున పడ్డారు. క్రిమినల్ ఛార్జెస్ కింద శామ్ బ్యాంక్ మ్యాన్ ఫ్రైడ్‌ను బహమాస్‌లో అరెస్ట్ చేశారు. ఈ సంక్షోభం సమయంలో CEO పదవి నుండి ఫ్రైడ్ వైదొలిగాడు, జాన్ J. రే ఆ బాధ్యతలు చేపట్టారు. ఇంతటి వైఫల్యం, నమ్మక ద్రోహాన్ని తన కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదని ఆయన కూడా వ్యాఖ్యానించారు. బ్యాంక్‌మ్యాన్ ఫ్రైడ్‌ను కొన్ని రోజులుగా విచారణ చేస్తున్నా, పోయిన డబ్బు తిరిగి వస్తుందన్న ఆశలు మాత్రం కలగడం లేదు.
3) ఎలిజబెత్ హోమ్స్‌కు 11 సంవత్సరాల జైలు శిక్ష
అమెరికన్ బయోటెక్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎలిజబెత్ హోమ్స్‌కు (Elizabeth Holmes) థెరానోస్ మోసం కేసులో గత నెలలో (నవంబర్ 2022) 11 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కేవలం కొన్ని రక్తపు చుక్కల ఆధారంగా కొన్ని సెల్ఫ్ సర్వీస్ మెషీన్లు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించగలవని హోమ్స్ చేసిన వాగ్దానం ఈ కేసులో ప్రధానాంశం. అయితే, ఎలిజబెత్ హోమ్స్ చెప్పినట్లుగా ఆ యంత్రాలు పని చేయలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పరిశోధనలో వెల్లడైంది. ప్రస్తుతం హోమ్స్ గర్భవతి. ఈ కారణం చూపి శిక్ష మీద అప్పీల్‌కు వెళ్లాలని ఆమె భావిస్తున్నారు.
4) శంతను దేశ్‌పాండే (Shantanu Deshpande)
పర్సనల్ కేర్ బ్రాండ్ బాంబే షేవింగ్ కంపెనీ (Bombay Shaving Company) CEO అయిన శంతను దేశ్‌పాండే, తాను చెప్పిన ఒక్క మాటతో వార్తల్లోకి ఎక్కారు. యువత వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం ప్రయత్నించే బదులు రోజుకు 18 గంటలు పని చేయాలని చెప్పి భారీ వివాదాన్ని రేపారు. కరోనా తర్వాత శారీరక, మానసిక ఆరోగ్యాలకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో శంతను దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యల మీద విమర్శల వాన కురిసింది. దీంతో, తన మాటలను దేశ్‌పాండే వెనక్కు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరాన్ని తాను గుర్తించానని చెప్పారు. అందర్నీ క్షమాపణలు కోరారు.
5) అష్నీర్ గ్రోవర్ (Ashneer Grover)
ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల కారణంగా అష్నీర్ గ్రోవర్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్‌పే (BharatPe) నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించారు. అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబ విలాసవంతమైన జీవనం కోసం కంపెనీ నిధులను అక్రమంగా వినియోగించుకుని మోసం చేశారంటూ, భారత్‌పే బోర్డు మీద షార్క్ ట్యాంక్ ఇండియా (Shark Tank India) బహిరంగంగా విరుచుకుపడింది. మరో స్టార్టప్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రోవర్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది (2022) జూన్‌లో, తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ గురించి గ్రోవర్ కొన్ని హింట్స్ ఇచ్చారు.