Most Expensive Fruit: పండ్ల ప్రపంచంలో ఐఫోన్! ఈ పుచ్చకాయను కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
World Most Expensive Melon | ఈ జపాన్ వాటర్ మిలన్ తీపికి మాత్రమే కాదు, ధరతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. జపాన్ లో పండే ఈ పుచ్చకాయ ధర ఆశ్చర్యం కలిగిస్తుంది.

World Most Expensive Fruit | పండ్లు అందరూ ఇష్టంగా కొనుక్కుని తింటారు, కానీ కారు కంటే ఎక్కువ ధర ఉన్న పుచ్చకాయను ఎప్పుడైనా చూశారా? ఇది జోక్ కాదు అక్షరాలా నిజం. జపాన్‌లో పండించే Yūbari King Melon (యుబారి కింగ్ పుచ్చకాయ) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయగా భావిస్తారు. ఈ పండు దాని తీపి, సువాసనకు మాత్రమే కాకుండా, దాని ధరతో కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరిచింది. జపాన్‌లోని హోక్కైడో (Hokkaido) ప్రావిన్స్‌లోని చిన్న పట్టణమైన యుబారిలో పండించే ఈ పుచ్చకాయ జత ధర 5 మిలియన్ యెన్ (సుమారు 29 లక్షల రూపాయలు).
ఎందుకు అంత ప్రత్యేకమైనది, ఖరీదైనది?
ఒక సాధారణ పండుకు ఇంత ధర ఎందుకు ఉంటుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు? వాస్తవానికి, Yūbari King Melon ఒక సాధారణ పండు కాదు, ఇది ఒక లగ్జరీ వస్తువు లాంటిదే. దీనిని చాలా ప్రత్యేకమైన పద్ధతిలో సాగు చేస్తారు. ప్రతి మొక్కకు ఒకే ఒక్క పుచ్చకాయను వదిలివేస్తారు. తద్వారా దాని తీపి, పరిమాణం, రుచిలో ఎలాంటి లోపం ఉండదు. సాగు పూర్తిగా గ్రీన్‌హౌస్ కంట్రోల్ సిస్టమ్‌లో జరుగుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత, తేమ, కాంతి తగినంత ఖచ్చితంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. అందుకే ప్రతి పండు ఆకారం ఖచ్చితంగా గుండ్రంగా ఉంటుంది. దాని తొక్కపై ఒక వల వంటి సహజమైన డిజైన్ ఏర్పడుతుంది, ఇది మిగిలిన పుచ్చకాయల నుంచి దీన్ని వేరు చేస్తుంది.
జపాన్‌లో గౌరవానికి చిహ్నంగా పరిగణించే పండు
యుబారి కింగ్ పుచ్చకాయను జపాన్‌లో రాయల్ బహుమతిలా ఇస్తారు. జపాన్‌లో ఒక వ్యక్తి ఎవరినైనా గౌరవించాలని అనుకుంటే లేదా ప్రత్యేక బహుమతి పంపించాలనుకున్నప్పుడు, వారు ఈ పుచ్చకాయ జతను బహుమతిగా ఇస్తారు. అక్కడ ప్రజలు దీనిని "గౌరవానికి చిహ్నం"గా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ ఖరీదైన పుచ్చకాయలను వేలం వేస్తారు. ధనవంతులు, సెలబ్రిటీలు దీనిని కొనడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు.
పండ్ల ప్రపంచంలో ఇది ఐఫోన్ లాంటిది
ఈ ఖరీదైన పుచ్చకాయ తినడానికి మాత్రమే కాదు, ఇది ఒక లగ్జరీ ఎక్స్‌పీరియన్స్. గౌరవ సూచకంగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సాధారణ పుచ్చకాయను కొన్ని రూపాయలకు కొనుగోలు చేసి తింటారు. కానీ జపాన్‌లోని Yūbari King Melon జత ధర విని ప్రతి ఒక్కరూ "వావ్, ఇది పుచ్చకాయ కాదు, బంగారం" అని అంటారు. సామాన్యులకు ఈ పండు తినాలనే కోరిక జీవితంలో నెరవేరదు. ఎందుకంటే అందుకోసం ఆస్తులు అమ్ముకున్నా కొనలేని పరిస్థితి వాళ్లది.
సోషల్ మీడియా వినియోగదారులు జపాన్ ఖరీదైన పుచ్చకాయపై తమకు తోచినట్లు స్పందిస్తున్నారు. కొందరు దీనిని పండ్లలో ఇది ఐఫోన్ అని పిలుస్తున్నారు. మరికొందరు ఈ పుచ్చకాయ ధరతో మేం అదిరిపోయే SUVని కొనుగోలు చేస్తామని అంటున్నారు. కారు ధరతో సమానంగా ఉన్న దీన్ని కొనకపోవడమే మంచిదని, ఈ ధరకు ఏకంగా కొన్ని షాపులు కూడా ఓపెన్ చేయవచ్చు అని నెటిజన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు.






















