(Source: ECI/ABP News/ABP Majha)
Prices End With 9: చాలా వస్తువుల రేట్లు 9 అంకెతో ఎందుకు ముగుస్తాయి, లాజిక్ ఏంటి?
Bata Pricing: ఒక సంఖ్యలోని ఎడమ వైపు అంకెను చూసి నిర్ణయం తీసుకోవడాన్ని లెఫ్ట్ డిజిట్ బయాస్ (left-digit bias) అని కూడా పిలుస్తారు. చాలా వస్తువుల ధరలు 9 అంకెతో ముగుస్తున్నాయి.
Logic Behind Prices End With 9: మన దేశంలో కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ కొన్ని కోట్ల వస్తువులు/ ఉత్పత్తులు కొంటుంటారు. వాటిలో చాలా వస్తువుల ధరలు 9 లేదా 99 లేదా 999... ఇలా 9 అంకెతో ముగుస్తాయి. ఆ వస్తువుల రేట్లను ఇలాగే ఎందుకు నిర్ణయించారో మీరెప్పుడైనా ఆలోచించారా?. వాస్తవానికి ఇదొక బిజినెస్ ట్రిక్. కొనుగోలుదార్లతో వ్యాపారస్తులు ఆడే మైండ్ గేమ్.
మీరు బాటా చెప్పుల రేట్లను గమనించారా?. 299.99 లేదా 399.99 లేదా 159 ఇలా 9 అంకెతో ముగిసేలా రేట్లు ఉంటాయి. 9 నంబర్ ఫార్ములాను మొదట బాటా కంపెనీయే అవలంబించింది. అందుకే దీనిని బాటా ప్రైసింగ్ (Bata Pricing) అని కూడా పిలుస్తారు.
బాటా ప్రైసింగ్ వెనుకున్న లాజిక్ ఇదే!
ఇప్పుడొక ఉదాహరణ చూద్దాం. ఒక వస్తువు ధర రూ. 199 అనుకుందాం. ఈ రేటు, రూ. 200కు మధ్య తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే. కానీ, రూ.199ని చూడగానే మన మైండ్ అది రూ.200 కంటే అది చాలా తక్కువగా ఉందని భ్రమపడుతుందట. UC బర్కిలీ అధ్యయనం ప్రకారం... అదే వస్తువును రూ. 200కు అమ్మినప్పుడు కంటే, రూ. 199కి అమ్మినప్పుడు 3 నుంచి 5 శాతం ఎక్కువ యూనిట్లు అమ్ముడుపోతాయట. రూ. 200 కంటే రూ. 199 అంకె బాగా తక్కువ అని మన మెదడు భావించడమే దీనికి ప్రధాన కారణమని బర్కిలీ వెల్లడించింది.
ఇలా, ఒక సంఖ్యలోని ఎడమ వైపు అంకెను చూసి నిర్ణయం తీసుకోవడాన్ని లెఫ్ట్ డిజిట్ బయాస్ (left-digit bias) అని కూడా పిలుస్తారు. లెఫ్ట్ డిజిట్ బయాస్ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారస్తులకు లాభాలు సంపాదించి పెడుతోంది.
ఒక కిరాణా షాపును చూస్తే... అక్కడ రౌండ్ నంబర్‌లో (100, 200, 1000...) ధరలు ఉన్న వస్తువుల కంటే 99, 199, 999 లాంటి రేట్లు ఉన్న వస్తువులే ఎక్కువగా అమ్ముడుపోతుంటాయని, ఆ వ్యాపారి లాభాలు 4 నుంచి 5 శాతం వరకు పెరుగుతాయని పరిశోధకులు అంచనా వేశారు. అయితే.. 9 నంబర్ కంటే తక్కువకు అమ్మాల్సిన వస్తువుకు మాత్రం ఈ సూత్రం వర్తించదట. ఉదాహణకు రూ.95 ధర ఉన్న వస్తువుకు రూ.99 ధరను నిర్ణయించకూడదు.
ఇక్కడ, ఒక కార్‌ను కూడా ఉదాహరణగా తీసుకుందాం. 80,000 కిలోమీటర్లు తిరిగిన కార్ కంటే 79,999 కిలోమీటర్లు తిరిగిన కారు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతోందని టొరంటో విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి 10,000 కిలోమీటర్ల మార్క్ దగ్గర ఇదే వర్తిస్తుందని ఆ అధ్యయనం తేల్చింది. ఒకవేళ మీరు కూడా మీ కార్‌ను అమ్మేయాలని భావిస్తుంటే, స్పీడోమీటర్‌లో చివరి నంబర్ 9 ఉండేలా చూసుకుని అమ్మండి, మీకు ఇంకాస్త ఎక్కువ డబ్బు రావొచ్చు.
ఏదైనా ఉత్పత్తిని ఆన్‌లైన్‌లో అమ్మాలని భావిస్తే, దానికి కూడా 9 సూత్రం వర్తిస్తుంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. మీరు అమ్మబోయే వస్తువు ధర రూ. 2,000 అనుకుందాం. దానికి రూ. 1,999 ధరను మీరు నిర్ణయిస్తే, రూ. 2,000 లోపు ఉత్పత్తుల కోసం జరిపే ఆన్‌లైన్ సెర్చ్‌ల్లో మీ వస్తువు కనిపిస్తుంది. రూ. 2,000 కంటే రూ. 1,999 చాలా తక్కువ అన్న భ్రమను కొనుగోలుదార్లలో కలిగిస్తుంది. ఇదీ, బాటా ప్రైసింగ్ కథ.
మరో ఆసక్తికర కథనం: లాభాల్లో ముగిసిన స్పెషల్ సెషన్ - సత్తా చాటిన డిఫెన్స్ స్టాక్స్