Vijay Mallya:విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు పడే శిక్షలేంటీ?భారత్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Vijay Mallya:విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆర్థిక నేరగాళ్లు అంటే ఎవరు? ఎవరు ప్రకటిస్తారు? వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి?

Vijay Mallya: విజయ్ మాల్యా ఒకప్పుడు "కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్"గా పేరొందిన వ్యాపారవేత్త. నేడు విదేశాలకు పారిపోయిన ఆర్థికనేరగాడు. అయితే, తాను దాక్కున్నాను తప్ప దొంగను కాదు అంటూ రాజ్ షామాని అనే పాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్యా అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, అసలు విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? అసలు ఆర్థిక నేరగాళ్లు అంటే ఎవరు? ఆర్థిక నేరగాళ్లు అని ఎవరు ప్రకటిస్తారు? వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న విషయాలను తెలుసుకుందాం.
పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై భారత చట్టం: ఒక సమగ్ర విశ్లేషణ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు సవాల్ విసురుతున్న వాటిల్లో ఆర్థిక నేరాలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. చాలా దేశాలు ఇలాంటి ఆర్థిక నేరాల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాయి. వేల కోట్లు ఒక దేశంలో కొల్లగొట్టి మరో దేశానికి పారిపోతున్నారు. ఇలాంటి వారినే పారిపోతున్న ఆర్థిక నేరగాళ్లుగా గుర్తిస్తున్నారు. ఇలాంటి ఆర్థిక నేరాలను అరికట్టడానికి, ఒకవేళ వారు ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి భారత దేశం పటిష్టమైన చట్టాన్ని రూపకల్పన చేసింది. అదే "ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018" (Fugitive Economic Offenders Act, 2018 - FEOA). ఈ చట్టం ఆర్థిక నేరాలు చేసి తప్పించుకుని తిరిగే వారికి "పారిపోయిన ఆర్థిక నేరగాడు" (Fugitive Economic Offender - FEO) అనే పదాన్ని ఆపాదిస్తుంది, అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ఎప్పుడు ప్రకటిస్తారు?
ఆర్థిక నేరం చేశారని భావిస్తున్న వ్యక్తిని "పారిపోయిన ఆర్థిక నేరగాడు"గా ప్రకటించడానికి కొన్ని చట్టబద్ధమైన పరిమితులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం:
- ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యక్తి కనీసం ₹100 కోట్లు (వంద కోట్ల రూపాయలు) లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడి ఉండాలి.ఈ నేరాలలో ప్రధానంగా మోసం, మనీ లాండరింగ్, నకిలీ పత్రాల సృష్టి, బ్యాంకింగ్ మోసాలు వంటి అంశాలు ఇమిడి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తిని ఆర్థిక నేరగాడిగా, నేరం చేసి పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించేందుకు వీలుంటుంది.
- ఆర్థిక నేరం చేశారని భావిస్తున్న ఆ వ్యక్తిపై అరెస్టు వారెంట్ జారీ చేసి ఉండాలి. ఇది నేర విచారణ ప్రారంభానికి నిదర్శనంగా భావించి అతన్ని చట్టపరంగా పారిపోయిన ఆర్థిక నేరగాడిగా భావిస్తారు.
ఆర్థిక నేరం చేసిన వ్యక్తిపై అరెస్టు వారెంట్ జారీ అయిన తర్వాత, నేరం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత ఆ ఆర్థిక నేరానికి పాల్పడిన వ్యక్తి దేశం విడిచి వెళ్లి తిరిగి రాకపోవడం జరిగితే లేదా భారతదేశంలో నివసించకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఉంటే, లేదా అరెస్టును తప్పించుకోవడానికి, నేర విచారణ ఎదుర్కోకుండా ఉండేందుకు దేశం విడిచి వెళితే అతన్ని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించవచ్చు.
పారిపోయిన ఆర్థిక నేరగాడు అని ఎవరు ప్రకటిస్తారు?
ఒక వ్యక్తి ఆర్థిక నేరం చేసి, దేశం విడిచి వెళ్లి తిరిగి రాకుండా, నేర విచారణను ఎదుర్కోకుండా దాక్కుంటే, అతన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act - PMLA) ద్వారా ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానానికి (Special Court) ఆ అధికారం ఉంటుంది. అయితే, ఈ ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లేదా ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలు ఆ ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేస్తాయి. ఈ దర్యాప్తు సంస్థలు అందించిన సాక్ష్యాలను కోర్టు పరిశీలించి, ఆ తర్వాత చట్ట ప్రకారం ఆ ఆర్థిక నేరగాడిని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తుంది.
ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తే ఎదుర్కోవాల్సిన పర్యవసానాలు
ఆర్థిక నేరం చేసి పారిపోతే అతన్ని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాత న్యాయపరమైన, ఆర్థికపరమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- ఆస్తుల జప్తు, స్వాధీనం: పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ఓ వ్యక్తిని ప్రకటిస్తే, దేశంలో ఉన్న అతని ఆస్తులను తక్షణం జప్తు చేయవచ్చు. విదేశాల్లో ఆస్తులు ఉంటే అంతర్జాతీయ సహకార ఒప్పందాలను బట్టి ఆ దేశాల్లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. బినామీ ఆస్తులని తేలినా సరే వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. నేర విచారణ ముగిసే వరకు లేదా అతనికి చట్టపరమైన శిక్ష విధించే వరకు ప్రభుత్వం ఈ ఆస్తుల జప్తు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన వెంటనే ఈ చర్యకు ప్రభుత్వం ఉపక్రమించే అధికారం చట్ట ప్రకారం సంక్రమించింది.
- సివిల్ దావాలు దాఖలు చేసే హక్కు కోల్పోవడం:ఓ వ్యక్తి చట్టపరంగా "పారిపోయిన ఆర్థిక నేరగాడు" (Fugitive Economic Offender - FEO) గా తేలిన వ్యక్తి లేదా అతని తరఫున ఎవరైనా ఏ భారతీయ కోర్టులోనూ సివిల్ దావాలు దాఖలు చేయడానికి వీలు లేదని చట్టాలు చెబుతున్నాయి. కోర్టుల్లో తన వాదనలు వినిపించే హక్కును కోల్పోతారు. ఇలా ఆర్థిక నేరం చేసి పారిపోవడం ద్వారా వారు తమ చట్టపరమైన హక్కులను కోల్పోతారు.
- విదేశాలల్లో ఉన్నా ఆ దేశాల నుంచి అప్పగింతకు వీలు: ఒక వ్యక్తిని పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాత అతను ఏ దేశంలో తలదాచుకున్నా, అంతర్జాతీయ ఒప్పందాలను బట్టి అతన్ని మన దేశానికి అప్పగించడం వీలవుతుంది. అంతర్జాతీయంగా అతన్ని మన దేశం నేరస్థుడిగా ప్రకటించినట్లు చట్టపరంగా లెక్క. అయితే కొన్నిసార్లు ఆయా దేశాల్లోని చట్టాలు, మన దేశంతో ఒప్పందాలను బట్టి అలాంటి ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు తేవడం కష్టమైన పనే. ఇందుకు ఉదాహరణ విజయ్ మాల్యా. అతను బ్రిటన్ కోర్టుల్లో అప్పీలు దాఖలు చేస్తూ సంవత్సరాలుగా అక్కడే ఉండటం ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.
- ఆర్థిక లావాదేవీలను స్తంభింపజేయడం: ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తిగా చట్టపరంగా ప్రకటిస్తే ఇక వారి బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేస్తారు. వారి బ్యాంకు ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలు, హోల్డింగ్స్ వంటి వాటిని వారు వాడుకోలేరు. వారి ఆస్తులను ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటుంది.
పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు భారతీయ చట్టాల ప్రకారం శిక్షలు
'పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టానికి' (FEOA) ఆర్థిక నేరాలు పాల్పడిన వ్యక్తులను నేరుగా శిక్షలు విధించే అధికారం లేదు. కాకపోతే వారు చట్టపరంగా సివిల్ కేసు దాఖలు చేసే అధికారం లేకుండా చేసేందుకు, వారి ఆస్తులను జప్తు చేయడానికి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. అయితే ఆ నేరస్థులు మన దేశానికి వచ్చిన తర్వాత వారి నేరాల ప్రకారం చట్టాలకు అనుగుణంగా శిక్షలు వేయడం జరుగుతుంది. ఇలాంటి వారికి సాధారణంగా మోసం చేసినందుకు IPC సెక్షన్ 420 ప్రకారం ఈ నేరం రుజువైతే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుంది. ఇక మనీలాండరింగ్ నేరం రుజువైతే PMLA సెక్షన్ 4 ప్రకారం నేరం రుజువైతే కనీసం మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదనంగా భారీ జరిమానా కూడా ఉంటుంది. మనీ లాండరింగ్ ద్వారా సంపాదించినట్లు తేలితే ఆస్తులను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చు.
పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల (Fugitive Economic Offender - FEO) కోసం రూపొందించిన "ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018" (Fugitive Economic Offenders Act, 2018 - FEOA) ప్రకారం జైలు శిక్షలు వేయకపోయినా, ఆర్థిక నేరాలకు భారతీయ చట్టాల ప్రకారం శిక్ష వేసేందుకు సహకరిస్తుంది. పారిపోయిన నేరస్థుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కల్పిస్తుంది. విజయ్ మాల్యా వంటి హై-ప్రొఫైల్ కేసుల‌్లో ఈ చట్టం కీలక పాత్ర పోషించింది; ఆయనను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాతనే ఆయన ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ వేగవంతమైంది.






















