Budget 2024: కేంద్ర బడ్జెట్ నుంచి ఏం ఆశించొచ్చు, ఫలితాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది?
Nirmala Sitharaman Budget 2024: మిత్రపక్షాల పొత్తు ప్రభావం బడ్జెట్‌పైనా ఉంటుంది. కాబట్టి, పూర్తిస్థాయి బడ్జెట్ కాస్త ప్రజారంజకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Union Budget 2024: కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందున్న మొదటి సవాలు 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఒక నెలలో ప్రవేశపెట్టడం. కొత్త ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖను నిర్వహించే బాధ్యతను నిర్మల సీతారామన్‌కే మోదీ అప్పగించారు. భారతదేశాన్ని '5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ'గా మార్చడానికి, 2047 నాటికి 'అభివృద్ధి చెందిన దేశం'గా నిలబెట్టడానికి అవసరమైన సంస్కరణలను వేగవంతం చేసే బాధ్యత ఇప్పుడు మేడమ్ భుజాలపై ఉంది. కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక శాఖ కసరత్తు కూడా ప్రారంభమైంది.
మధ్యంతర బడ్జెట్‌లో భారీ ప్రకటనలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో... పీఎం ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్లు నిర్మించామని, వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. లఖపతి దీదీ లక్ష్యాన్ని రూ.3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి గతి శక్తి యోజన కింద 3 కొత్త కారిడార్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. రాబోయే 10 సంవత్సరాల్లో విమానాశ్రయాల సంఖ్యను 149కు పెంచడం, వందే భారత్ రైళ్లలో 40,000 బోగీలను అప్‌గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి.
పూర్తి స్థాయి బడ్జెట్ నుంచి ఏం ఆశించొచ్చు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో BJPకి సొంతంగా మెజారిటీ రాలేదు, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే.. కేంద్రంలో ఇప్పుడు ఉన్నది పూర్తి స్థాయి "సంకీర్ణ ప్రభుత్వం". మిత్రపక్షాల పొత్తు ప్రభావం బడ్జెట్‌పైనా ఉంటుంది. కాబట్టి, పూర్తిస్థాయి బడ్జెట్ కాస్త ప్రజారంజకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి ఆర్థిక పద్దులో ఆదాయ పన్నుపై ఉపశమనం లభించొచ్చు. రైతుల కోసం ప్రత్యేక ప్రకటనలు ఉండొచ్చు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వంటి కొత్త పథకాలను కూడా ప్రకటించవచ్చు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ, మూడోసారి అధికారంలోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కాబట్టి, ఆర్థిక వ్యవస్థ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థలో వేగాన్ని కొనసాగించడానికి మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టిని ప్రభుత్వం కొనసాగిస్తుంది.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు బడ్జెట్‌లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఆహార ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది, ఎన్నికల సమయంలో ఇది చర్చకు వచ్చింది. కాబట్టి... ఆహార పదార్థాలు, ఇంధనం ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో చర్యలు తీసుకోవచ్చు.
దేశంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడం, మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం. విద్యా బడ్జెట్ పెంచి మంచి విద్యను అందించడం, డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి కొత్త పథకాలు కూడా ప్రారంభించొచ్చు. తద్వారా, గ్రామీణ & మారుమూల ప్రాంతాల పిల్లలకు కూడా ఆన్‌లైన్ విద్య అందుబాటులోకి వస్తుంది.
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. దీనికోసం, పూర్తి బడ్జెట్‌లో రోడ్లు, వంతెనలు, రైలు నెట్‌వర్క్‌ల నిర్మాణానికి కేటాయింపులు పెంచొచ్చు. ఈ నిర్ణయం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి.
పూర్తి స్థాయి బడ్జెట్‌లో స్థిరాస్తి రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టార్ మన ఆర్థిక వ్యవస్థలో పెద్ద పాత్ర పోషిస్తోంది, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
మన దేశంలో పన్నుల ఆదాయం పెరిగినప్పటికీ, పన్నుయేతర ఆదాయం పెద్ద సవాల్‌గా మారింది. ప్రజలు వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టకపోవడమే దీనికి ఒక కారణం. పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడానికి మోదీ 3.0 సర్కారు చర్యలు తీసుకోవచ్చు.
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కాబట్టి, ఈ బడ్జెట్‌లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పెద్ద నిర్ణయాలు వెలువడతాయన్న ఆశ కూడా ఉంది.
మరో ఆసక్తికర కథనం: పేపర్లు లేకపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ - కంపెనీలు ఇకపై 'నో చెప్పవు'