(Source: ECI/ABP News/ABP Majha)
LPG Subsidy: వంట గ్యాస్ సబ్సిడీలో భారీ కోత, ఏకంగా 99 శాతం - కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
LPG Cylinder News: 2019-20లో దీని కింద రూ.24,172 కోట్లు విడుదల చేయగా, 2021-22 నాటికి ఏకంగా రూ.242 కోట్లకు తగ్గించారు. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సోమవారం రాజ్యసభలో ఈ సమాధానం ఇచ్చారు.
LPG Cylinder News: ఎల్పీజీ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. 2019-20లో దీని కింద రూ.24,172 కోట్లు విడుదల చేయగా, 2021-22 నాటికి ఏకంగా రూ.242 కోట్లకు తగ్గించారు. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సోమవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. 2019 ఏప్రిల్ 1న ఎల్పీజీ సిలిండర్ ధర రూ.706.50 ఉండగా, ఆదివారం నాటికి రూ.1,053కి (49 శాతం పెరిగినట్లు) చేరింది. సిలిండర్ ధరలకు ఆధారమైన ‘సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్’ ఇదే సమయంలో టన్నుకు 508 డాలర్ల నుంచి 750 డాలర్లకు (47 శాతం) పెరిగింది.
మూడు వారాల క్రితమే వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ ధర తాజాగా రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.1,003 ఉండగా, తాజా పెంపుతో రూ.1,053 అయింది.
మెట్రో సిటీల్లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధర ఇలా ఉంది.
Hyderabad - Rs.1105
Delhi - Rs.1,053
Mumbai - Rs 1,052.50
Kolkata - Rs 1,079
Chennai - Rs 1068.50
ఏపీలో సిలిండర్ ధరలు ఇలా
Vijayawada - Rs.1077
Guntur - Rs.1092
Visakhapatnam - Rs.1061
Anantapuram - Rs.1119.50
Chittor - Rs.1089
Kadapa - Rs.1103
East Godavari - Rs.1081.50
సబ్సిడీ వారికి మాత్రమే
ఎల్పీజీ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించారు. ఈ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కొన్ని నెలల క్రితమే కేంద్రం ప్రకటించింది. కొవిడ్ ప్రారంభం నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మాత్రమే ఇకపై కేంద్రం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.
ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీ
పీఎమ్ ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ కేంద్రం అందిస్తుంది. అయితే ఆ సబ్సిడీని కేంద్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ ఇస్తుంది. అయితే ఇకపై గృహ వినియోగదారులు మార్కెట్ ధర ఎంత ఉంటే అంతకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల పథకం కింద వినియోగదారులు ఉన్నారు. మిగిలిన 21 కోట్ల మందికి ఇకపై సబ్సిడీ రాదు. 2010లో పెట్రోల్‌పై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 2014 నవంబర్‌లో డీజిల్‌పై ఉన్న సబ్సిడీని కూడా తొలగించింది. అంతకు ముందు కిరోసిన్‌పై ఉన్న సబ్సిడీని నిలిపివేసింది. గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీని తాజాగా కేంద్రం నిలిపివేసింది. ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం గ్యాస్ సబ్సిడీ తొలగించి భారం మోపింది.