Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్ హల్వా లేదండోయ్! మారుతున్న సంప్రదాయాలు!!
నిర్మలా సీతారామన్ త్వరలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పెద్ద పద్దును సభలో పెట్టే ముందు కొన్ని సంప్రదాయాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కాలం మారే కొద్దీ కొన్ని మారుతున్నాయి. అవేంటంటే..!
Budget 2022 Telugu, Union Budget 2022, Budget 2022 Traditions: ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పెద్ద పద్దును సభలో పెట్టే ముందు కొన్ని సంప్రదాయాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కాలం మారే కొద్దీ కొన్ని మారుతున్నాయి. అవేంటంటే..!
మొదట్లో బడ్జెట్ పత్రాలు రాష్ట్రపతి భవన్‌లోనే ముద్రించడం ఆనవాయితీగా వస్తోంది. 1950లో కొన్ని పత్రాలు లీకవ్వడంతో ప్రింటింగ్‌ను మింటో రోడ్‌కు మార్చారు. 1980లో నార్త్‌బ్లాక్‌లోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. అప్పట్నుంచి అక్కడే ముద్రిస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ముందు లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసగించడం ఒక సంప్రదాయం. ఇక ప్రతి బడ్జెట్‌కు ముందురోజు రైల్వే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. 2017లో దీనిని మార్చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే పద్దును ప్రధాన బడ్జెట్‌లో కలిపేసింది.
ఒకప్పుడు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు బ్రిటన్‌లో ఉదయం అవుతున్నప్పుడు చదివేవారు. 1999లో ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ దీనిని భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మార్చేశారు. 2017 ముందు వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ఆఖరి రోజున ప్రవేశపెట్టేవారు. వలసవాద పద్ధతినే అప్పటికీ అనుసరించారు. దివంగత అరుణ్‌జైట్లీ దీనిని మార్చారు. ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు.
సాధారణంగా ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేసుల్లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు. 2020లో నిర్మలా సీతారామన్ దానిని మార్చేశారు. మూడు సింహాలు, అశోక చక్రం ముద్రించిన ఎర్ర సంచీలో తీసుకొచ్చారు. ఫ్రెంచ్ భాషలోని బజెట్టీ నుంచి బడ్జెట్ పదం వచ్చింది. దానర్థం తోలు బ్రీఫ్‌కేస్.
బడ్జెట్ పత్రాలను ముద్రించి సభలోని సభ్యులదరికీ అందించేవారు. కరోనా నేపథ్యంలో 2020లో నిర్మలా సీతారామన్ కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. టాబ్లెట్‌లో చూస్తూ ప్రసంగించారు. ఇదే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్, అస్సాం 2019లోనే ఆరంభించాయి. ఈ ఏడాదీ కాగిత రహిత బడ్జెట్‌నే కొనసాగిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏటా బడ్జెట్ తయారీకి ముందు అధికారులను ఒక భవనానికి పంపిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఇంటికి పంపించరు. అయితే బడ్జెట్ ముద్రణకు ముందు హల్వా వేడుక చేయడం ఆనవాయితీ. కరోనా కారణంగా ఈ సారి దానిని ఆపేశారు. సభ్యులందరికీ ప్రత్యేకంగా మిఠాయిలు పంచుతున్నారు.
Also Read: MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!
Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ