MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!
MSMEs కరోనా వల్ల మూడేళ్లుగా చితికి పోతున్నాయి. కొన్ని ఉద్దీపన పథకాలు ప్రకటించినా చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. తాజా బడ్జెట్‌లో తమ కోరికలు తీర్చాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కంపెనీలు కోరుతున్నాయి.
Budget 2022 Telugu MSME Sector Expectations: కరోనా వైరస్ ఎందరి జీవితాలనో నాశనం చేసింది. ఎన్నో వ్యాపారాలను మూతపడేసింది. ఈ మహమ్మారిని నియంత్రించేందు విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్లలో ఎక్కువ నష్టపోయింది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే! వాస్తవంగా దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నవి ఎంఎస్‌ఎంఈలే అనడంలో అతిశయోక్తి లేదు.
కోట్లాది మందికి అన్నం పెట్టిన ఆ చిన్న సంస్థలు మూడేళ్లుగా చితికి పోతున్నాయి. కొన్ని ఉద్దీపన పథకాలు ప్రకటించినా చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తమ కోరికలు తీర్చాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంఎస్‌ఎంఈలు కోరుతున్నాయి.
సులభంగా తమ వ్యాపారాలు కొనసాగేలా చూడాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోరుకుంటున్నాయి. ఎక్కువ రుణ లభ్యత, పన్నుల భారం తగ్గించాలని వినతి చేస్తున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు ఉద్దీపన పథకాలు ప్రకటించింది. అయితే ఎక్కువ కంపెనీలకు ఈ పథకాలు అందడం లేదు. ఇప్పటి వరకు అసలు బ్యాంకు రుణాలు తీసుకోని వారికి ఈ పథకాలతో లాభం జరగలేదు. ఇలాంటి కంపెనీలకు టాక్స్ రిబేట్ ఇవ్వాలని విశ్లేషకులు కోరుతున్నారు.
ఎంఎస్‌ఎంఈలకు రుణ లభ్యత పెరగాలంటే వ్యక్తులు, సూక్ష్మ వ్యాపారాలకు ఇచ్చే రుణాలను పెద్ద పెద్ద కార్పొరేట్ రుణాలతో పోలిస్తే వేర్వేరుగా చూడాలని అంటున్నారు. లిక్విడిటీ పెరగాలంటే మెరుగైన రీఫైనాన్స్ మెకానిజం ఉండాలి. ఎంఎస్‌ఎంఈలను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక రంగానికి ఊతమివ్వాలని విశ్లేషకులు కోరుతున్నారు.
తయారీ పరిశ్రమ, పరిసరాల మధ్య సమతూకం సృష్టించేందుకు ఎంఎస్‌ఎంఈలకు సాయం చేయాలి. ఉత్పత్తుల తయారీలో తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే కంపెనీకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ కంపెనీలకు సులభంగా ఆర్థిక ప్రోత్సహాకాలు అందించడం ప్రభుత్వానికి ప్రాధాన్యంగా ఉండాలి. ఇక సేవల రంగంలోని ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా నిలవాలి.
ఇప్పటికే రెండు కొవిడ్ వేవ్స్‌లో చిన్న సంస్థలు కుదేలయ్యాయి. అందుకే ఎంఎస్‌ఎంఈలు రెండు కీలక ఉపశమనాలు కల్పించాలని కోరుతున్నాయి. జీఎస్‌టీ హేతుబద్ధీకరణ, తప్పక అమలు చేయాల్సిన భారాన్ని తగ్గించాలని అడుగుతున్నాయి. ప్రైవేటు ఈక్విటీపై దీర్ఘకాల మూలధన రాబడి పన్ను తగ్గించాలి. ఎందుకంటే స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులపై 10 శాతం పన్నుంటే ఆంత్రప్రిన్యూర్లు మాత్రం 27-28 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. కోవిడ్ వల్ల ఎంఎస్‌ఎంఈ రంగంలో నగదు ప్రవాహానికి ఇబ్బందులు కలిగాయి. అందుకే పన్ను రిబేట్లు ఇవ్వాలని కోరుతున్నారు. స్పెషల్ క్రెడిట్ లింకుడ్ క్యాపిటల్ సబ్సిడీ పథకాన్ని రూ.5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ చేస్తున్న సంస్థలకు విస్తరించాలి.
Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ