TATA Motors: EV బిజినెస్‌పైనే టాటా గ్రూప్ ఫోకస్ - దూకుడు పెంచేందుకు కీలక నిర్ణయం
EVల కోసం ఉపయోగించే, సనంద్‌లోని తన లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Thomas Flack - TATA Motors: దేశంలో అతి పెద్ద EV ప్లేయర్‌గా పునాదులు పటిష్టం చేసుకోవడానికి, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది టాటా మోటార్స్. సంప్రదాయ వాహన రంగం క్రమంగా ఎలక్ట్రిక్ విభాగం వైపు మారుతుండడంతో, స్వయంగా టాటా సన్స్ (Tata Sons) ఈ విభాగం మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. EVల కోసం ఉపయోగించే, సనంద్‌లోని తన లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
టాటా మోటార్స్ ప్రెసిడెంట్ & చీఫ్ పర్చేజ్ ఆఫీసర్ (CPO) థామస్ ఫ్లాక్‌ను (Thomas Flack), ఇప్పుడు, లిథియం-అయాన్ బ్యాటరీ కంపెనీకి CEOగా టాటా సన్స్ నియమించింది. ఈ కంపెనీ నుంచి అతి త్వరలోనే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఆ కంపెనీకి CEOగా థామస్ ఫ్లాక్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 54 ఏళ్ల ఫ్లాక్‌కు, కాంపోనెంట్ సోర్సింగ్ & సప్లయ్ చైన్‌లో అపారమైన అనుభవం ఉంది.
స్వయంగా టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక ఇది
మరో విశేషం ఏంటంటే... టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్వయంగా థామస్ ఫ్లాక్‌ను ఈ అత్యున్నత పదివి కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
బ్యాటరీ వ్యాపారంలోకి ₹4,000 కోట్లకు పైగా టాటా సన్స్ పంప్ చేస్తోంది. ప్రస్తుతం, 'అపోలో' (Apollo) అనే కోడ్-నేమ్‌తో బ్యాటరీ వ్యాపారం చేపడుతోంది. టాటా గ్రూప్‌ను నడిపించే భవిష్యత్ వృద్ధి కారకాల్లో ఇది ఒకటని టాటా సన్స్ నమ్ముతోంది.
ఎవరీ థామస్ ఫ్లాక్, అర్హతలేంటి?
థామస్ ఫ్లాక్, 2017లో టాటా మోటార్స్‌లో చేరారు. అప్పటి MD అయిన గుంటెర్ బుట్‌స్చెక్‌కి రిపోర్టింగ్ చేశారు. అంతకుముందు 14 సంవత్సరాల పాటు ఫోర్డ్ మోటార్ కంపెనీలో పని చేశారు. ముడి వస్తువులు, స్టాంపింగ్ విభాగాల్లో గ్లోబల్ పర్చేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
టాటా మోటార్స్ కోసం అడ్వాన్స్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ లేదా AMPని ఫ్లాక్ పరిచయం చేశారు. ఫలితంగా, ప్యాసింజర్ & కమర్షియల్ వెహికల్ విభాగాల్లో వెండార్ బేస్ తగ్గిపోయింది.
బ్యాటరీ తయారీని పరుగులు పెట్టించే బాధ్యతతో పాటు... టాటా మోటార్స్ & దాని వివిధ ఉత్పత్తుల విభాగాల్లో ప్రొక్యూర్‌మెంట్ టీమ్‌లకు ఫ్లాక్ మార్గనిర్దేశం కొనసాగుతుంది. అంటే, బ్యాటరీల వ్యాపారంతో పాటు టాటా మోటార్స్‌కు కూడా ఆయన అనుభవం ఉపయోగపడుతూనే ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనం, 5G, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ వ్యాపారాలు సహా ప్రస్తుతం కొనసాగుతున్న & రాబోయే కొత్త వ్యాపారాల్లోకి 90 బిలియన్ డాలర్ల (₹7.42 లక్షల కోట్లు) పెట్టుబడి పెడుతోంది. వచ్చే ఐదేళ్ల పాటు ఈ పెట్టుబడి కొనసాగుతుంది.
భవిష్యత్ EVలదే!
ప్రస్తుత గ్రీన్ వేవ్ & 2030 నాటికి 30% ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై నడవాలన్న ప్రభుత్వ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని... రాబోయే 12 నుంచి 18 నెలల్లో లక్ష యూనిట్ల EVలను ఉత్పత్తి చేయాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నెల ప్రారంభంలో, జమ్ము&కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో 5.9 మిలియన్ టన్నుల లిథియం వనరులను కనుగొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లిథియం-అయాన్ బ్యాటరీ వ్యాపారానికి ఇది గుడ్ న్యూస్.
లిథియం-అయాన్ సెల్ టెక్నాలజీ, కనీసం మరో 5-10 సంవత్సరాల వరకు EV సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుందని అంచనా. మొత్తం EV ఉత్పత్తి ఖర్చులో బ్యాటరీ వాటానే 45-50% వరకు ఉంటుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.