Richest MPs: లోక్‌సభలో టాప్-10 సంపన్న ఎంపీలు వీళ్లే - సగం మంది తెలుగు వాళ్లే
Richest MPs Of Lok Sabha: 18వ లోక్‌సభలోని తొలి 10 మంది సంపన్న ఎంపీల్లో ఐదుగురు తెలుగు వాళ్లే. వీరిలో నలుగురు ఏపీ నుంచి, ఒకరు తెలంగాణ నుంచి గెలిచారు. టాప్-5లో నలుగురు తెలుగు వాళ్లు ఉన్నారు.

Top 10 Richest Lok Sabha MPs: దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) పూర్తయిన తర్వాత, నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 503 మంది కోటీశ్వరులే. వీళ్లందరి దగ్గర తక్కువలో తక్కువ కోటి రూపాయలైనా ఆస్తి ఉంది. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీ సంపద విలువ వేల కోట్ల రూపాయలు.
లోక్‌సభలో టాప్-10 సంపన్న ఎంపీలు
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Dr Pemmasani Chandra Sekhar)
తెలుగుదేశం పార్టీ (TDP) టిక్కెట్‌పై గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించారు. మోదీ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల అఫిడవిట్‌లో నివేదించిన ప్రకారం, ఈ ఎంపీ నికర విలువ (Net Worth) రూ.5705 కోట్లు. ఈ పార్లమెంట్‌లో అత్యంత ధనవంతుడైన ఎంపీ ఈయనే.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy)
కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలోని చేల్లెళ్ల స్థానం నుంచి BJP టికెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి BRS టిక్కెట్‌పై (గతంలో TRS) గెలుపొందారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో, తన నికర విలువ రూ.4,568 కోట్లుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. దేశంలోని అత్యంత సంపన్న ఎంపీల్లో ఆయనది సెకండ్ ప్లేస్.
నవీన్ జిందాల్ (Naveen Jindal)
భారత్‌లోని అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్, కురుక్షేత్ర స్థానం నుండి BJP టిక్కెట్‌పై ఎన్నికయ్యారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ అయిన నవీన్ జిందాల్ నికర సంపద విలువ రూ.1,241 కోట్లు. సంపన్న ఎంపీల్లో థర్డ్ ర్యాంక్ ఈయనది. గతంలోనూ రెండు సార్లు ఎంపీగా పని చేశారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy)
వీపీఆర్ మైనింగ్ ఇన్ ఫ్రా వ్యవస్థాపకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన మొత్తం ఆస్తిపాస్తుల విలువ రూ.716 కోట్లు. నెల్లూరు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై గెలుపొందారు. 18వ లోక్‌సభలో అత్యంత సంపన్న ఎంపీల్లో నాలుగో స్థానంలో నిలిచారు.
సీఎం రమేష్ (CM Ramesh)
బీజేపీ నాయకుడు సీఎం రమేష్ గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పని చేశారు. ఈసారి అనకాపల్లి స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగి విజయం సాధించారు. గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నారు. సీఎం రమేష్ నికర విలువ రూ.497 కోట్లు.
జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)
భారత రాజకీయాల్లో సుపరిచితమైన పేరు జ్యోతిరాదిత్య సింధియా. జ్యోతిరాదిత్య సింధియా చాలా కాలం కాంగ్రెస్‌తో కలిసి ఉన్నారు. ఆయన నికర విలువ రూ.424 కోట్లు. మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి విజయం సాధించారు. మోదీ 2.0 ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన జ్యోతిరాదిత్య సింధియా, ఈసారి టెలికాం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఛత్రపతి షాహూ మహారాజ్ (Chhatrapati Shahu Maharaj)
ఛత్రపతి షాహూజీ మహారాజ్ కొల్హాపూర్ రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన సంపద రూ.342 కోట్లు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని కొల్హాపూర్ స్థానం నుంచి విజయం సాధించారు.
మతుకుమిల్లి శ్రీభరత్ (Mathukumilli Sribharat)
తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖపట్నం స్థానం నుంచి శ్రీభరత్ విజయం సాధించారు. ఆయన నికర విలువ రూ.298 కోట్లు. ఈయన 'గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్' ప్రెసిడెంట్ కూడా.
హేమమాలిని (Hema Malini)
బాలీవుడ్ నటి హేమమాలిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర స్థానం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ టికెట్‌పై విజయం సాధించారు. ఆమె సంపద విలువ రూ.278 కోట్లు.
డాక్టర్ ప్రభా మల్లికార్జున్ (Dr Prabha Mallikarjun)
డాక్టర్ ప్రభా మల్లికార్జున్ కాంగ్రెస్ నాయకురాలు. కర్ణాటకలోని దేవణగెరె స్థానం నుంచి ఆమె గెలుపొందారు. డెంటిస్ట్ కూడా అయిన ప్రభా మల్లికార్జున్, కర్ణాటక మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్‌కు భార్య. ఆమె నెట్‌వర్త్ రూ.241 కోట్లు.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులకు వారంలోనే షాక్ ఇచ్చిన కేంద్రం - వడ్డీ రేట్ల విషయంలో తీవ్ర నిరాశ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

