Sunflower Oil: ఆయిల్ వాడకం తగ్గించండీ- ఆరోగ్యమే కాదు ఆదాయం కూడా పెరుగుతుంది- సన్‌ఫ్లవర్ నూనె రేటు చూస్తే ఇదే చెబుతారు
Sunflower Oil Prices: U.S. డాలర్‌తో పోలిస్తే ఉక్రెయిన్ కరెన్సీ బలహీనపడటం, స్టాకిస్ట్‌ల దగ్గర నిల్వలు తగ్గిపోవడం కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంలో కీలకంగా మారింది.
Sunflower Oil Prices Rise: ఉక్రెయిన్-రష్యా యుద్ధ మంటలకు భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ మరుగుతోంది. అక్కడెక్కడో ప్రపంచంలో ఓ మూలన రెండు దేశాలు కొట్లాడుకుంటుంటే, ఇక్కడ భారతీయుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. కొన్నాళ్ల క్రితం దిగి వచ్చిన పొద్దు తిరుగుడు నూనెల ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావమే దీనికి ప్రధాన కారణం.
సప్లైలో చాలా వ్యత్యాసం
ప్రపంచంలో, మొత్తం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ వాటానే 80 శాతం ఉంది. అంటే, ప్రపంచ మార్కెట్లలో పొద్దు తిరుగుడు నూనెల ధరలను అతి చిన్న దేశమైన ఉక్రెయిన్ ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం వల్ల, అక్కడి నుంచి భారత్‌కు వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై ప్రభావం పడింది. ముఖ్యంగా, దక్షిణ భారతదేశంలోకి వచ్చే 65 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుంచే రావాలి. యుద్ధం వల్ల మన మార్కెట్‌లోకి ఉక్రెయిన్ నూనె దిగుమతి బాగా తగ్గింది. రష్యా నుంచి దిగుమతి పెరిగింది. అయినప్పటికీ, సప్లైలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభించాయి.
U.S. డాలర్‌తో పోలిస్తే ఉక్రెయిన్ కరెన్సీ బలహీనపడటం, స్టాకిస్ట్‌ల దగ్గర నిల్వలు తగ్గిపోవడం కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంలో కీలకంగా మారింది.
సెప్టెంబర్ వరకు ధరల ర్యాలీ
ప్రస్తుతం, భారతదేశ మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ 110 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఉంది. యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు లేవు కాబట్టి, ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల ర్యాలీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే సామాన్యుడి ఇంటి బడ్జెట్‌పై పెను భారం పడుతుంది. పైగా, ఈ ఏడాది ఆగస్టు నుంచి మంచి ముహూర్తాలు మొదవుతాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు ఉంటాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు పెరిగితే ఫంక్షన్ బడ్జెట్ కూడా పెరుగుతుంది.
ఇటీవలి నెలల్లో, పామాయిల్ ధరకు దాదాపు సమానంగా పొద్దు తిరుగుడు నూనె ధర తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించి కామన్ మ్యాన్‌కు షాక్ ఇస్తోంది. దీంతో, జనం మళ్లీ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను వదిలేసి పామాయిల్ వైపు మళ్లడం ప్రారంభించారు.
వంట నూనెల కోసం భారత్ విదేశాలపై ఆధారపడటమే ప్రస్తుత సమస్యకు కారణమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరతను అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీంతోపాటు... సోయా ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ సహా దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
చిగురిస్తున్న ఆశలు
సన్‌ఫ్లవర్ ఆయిల్ రేట్లు పెరగడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ఉత్పత్తి పరంగా ఆశలు చిగురించాయి. ఈ సీజన్‌లో 5 మిలియన్ హెక్టార్లకు పైగా సన్‌ఫ్లవర్ సాగు కోసం ఉక్రెయిన్ ప్లాన్ చేసింది. ఇప్పటికే దాదాపు 4.6 మిలియన్ హెక్టార్లలో విత్తనాలు నాటింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ విస్తీర్ణం. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా మారాయి కాబట్టి, పంట దిగుబడి పెరుగుతుందని, మళ్లీ రేట్లు తగ్గుతాయని కూడా మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: పెద్ద భారం తగ్గించిన EPFO - కేవైసీ పూర్తయితే క్లెయిమ్ చేయడం ఇప్పుడు ఈజీ