Sun Pharma Q3 Results: సన్ ఫార్మా Q3 లాభం రూ.2166 కోట్లు, ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 7.50 మధ్యంతర డివిడెండ్‌ను కూడా సన్ ఫార్మా లిమిటెడ్ ప్రకటించింది.
Sun Pharma Q3 Results: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (2022 అక్టోబర్-డిసెంబర్ కాలం) ఆర్థిక ఫలితాలను సన్ ఫార్మా ప్రకటించింది. మార్కెట్ అంచనాలను సన్ ఫార్మా అందుకున్నా, పెద్దగా ప్రగతి ఉండదు అన్న అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి.
2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సన్ ఫార్మా రూ. 2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది, అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 5% పెరిగింది. 2021 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 2,058 కోట్ల లాభాన్ని ఈ ఫార్మా కంపెనీ ఆర్జించింది.
2022 డిసెంబర్ త్రైమాసికంలో సన్ ఫార్మా రూ. 2,077 కోట్ల నికర లాభాన్ని గడిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ అంచనా కంటే కాస్త ఎక్కువ మొత్తాన్ని ఈ ఔషధాల కంపెనీ సంపాదించింది.
డిసెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (Revenue from operations) రూ. 11,240 కోట్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ. 9,863 కోట్లతో పోలిస్తే ఈసారి 14% పెరిగింది.
ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 7.50 మధ్యంతర డివిడెండ్‌ను కూడా సన్ ఫార్మా లిమిటెడ్ ప్రకటించింది.
షేర్ హోల్డర్లు ఈ మధ్యంతర డివిడెండ్ పొందడానికి 2023 ఫిబ్రవరి 8వ తేదీని రికార్డ్ డేట్‌గా (record date) నిర్ణయించింది. అదే నెలలో డివిడెండ్ చెల్లింపు ఉంటుంది.
రికార్డ్ డేట్ అంటే..
రికార్డ్ డేట్ అంటే, డివిడెండ్ వంటి కార్పొరేట్ చర్యల కోసం షేర్‌హోల్డింగ్ రికార్డులను సంబంధిత కంపెనీ పరిశీలించే తేదీ. ఇక్కడ, రికార్డ్ డేట్‌తో పాటు ఎక్స్ డేట్ (ex-date) గురించి కూడా తెలుసుకోవాలి. ఫిబ్రవరి 08ని రికార్డ్ డేట్‌గా ఈ కంపెనీ ప్రకటించింది కాబట్టి, దీని ముందు తేదీ అయిన ఫిబ్రవరి 07 ఎక్స్ డేట్ అవుతుంది. ఎక్స్ డేట్ అంటే ఎగ్జిక్యూషన్ డేట్. ఎక్స్ డేట్ నాటికి షేర్లు డీమ్యాట్ ఖాతాలో ఉన్నవాళ్లు మాత్రమే కంపెనీ ప్రకటించిన డివిడెండ్ పొందడానికి అర్హులు. ఇప్పటికే మీ దగ్గర ఈ కంపెనీల షేర్లు ఉండి, ఎక్స్ డేట్ ముంగిపు వరకు వాటిని కొనసాగిస్తే, డివిడెండ్ పొందడానికి మీరు అర్హులు అవుతారు. మీకు డివిడెండ్ కావాలంటే, ఇప్పటి వరకు మీ చేతిలో ఈ కంపెనీ షేర్లు లేకపోతే, ఎక్స్ డేట్ నాటికి కనీసం ఒక రోజు ముందే షేర్లను కొనాలి. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్‌లో T+1 సెటిల్‌మెంట్ పద్ధతి అమలవుతోంది. అంటే, కనీసం ఒక రోజు ముందు షేర్లు కొంటేనే, ఎక్స్ డేట్ నాటికి అవి మీ డీమ్యాట్ ఖాతాలోకి వచ్చి చేరతాయి. రికార్డ్ డేట్ నాడు రికార్డ్స్ చెక్ చేసే కంపెనీ, ఆ రోజున ఎవరి డీమ్యాట్ అకౌంట్‌లో షేర్లు ఉంటే వాళ్లను డివిడెండ్‌కు అర్హులుగా నిర్ణయిస్తుంది. ఎక్స్ డేట్ నాడు లేదా ఆ తర్వాత షేర్లను కొన్నా డివిడెండ్‌కు అర్హులు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఎక్స్ డేట్ నాడు లేదా ఆ తర్వాత మీ దగ్గరున్న షేర్లను అమ్మేసినా, అప్పటికే కంపెనీ రికార్డ్స్‌లో మీ పేరు ఉంటుంది కాబట్టి మీకు డివిడెండ్ అందుతుంది.
అంతేకాదు, కంపెనీ ఒక్కో షేరుకు ఎంత మొత్తం డివిడెండ్ ప్రకటిస్తుందో, ఎక్స్ డివిడెండ్ డేట్ నాడు షేరు ధర అంత మేర తగ్గుతుందన్న విషయం కూడా గుర్తుంచుకోండి.
ఇవాళ (మంగళవారం, 31 జనవరి 2023) మధ్యాహ్నం 2.50 గంటల సమయానికి ఈ కంపెనీ షేర్ ధర NSEలో 1.27 శాతం తగ్గి రూ. 1,038 వద్ద ట్రేడవుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) ఈ స్క్రిప్ దాదాపు 4.16% పెరిగింది.
కంపెనీ ఫార్మా హోల్‌టైమ్ డైరెక్టర్ కళ్యాణ సుందరం సుబ్రమణియన్ పదవీ కాలం 2023 ఫిబ్రవరి 13తో ముగుస్తుందని, ఆ తేదీ నుంచి ఆయన పదవీ విరమణ చేస్తారని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సన్ ఫార్మా తెలియజేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.