Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్ రూల్స్ - అక్టోబర్ 01 నుంచే అమలు!
TDS Rate Hike: 2024 అక్టోబర్ 01 నుంచి అమలు చేయబోయే కొత్త టాక్స్ రూల్స్ గురించి, జులైలో 2024-25 బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.
Aadhar Rule Changes: వచ్చే నెల ప్రారంభం (01 అక్టోబర్ 2024) నుంచి సామాన్యులు, ఉద్యోగులు, సర్వీస్ ప్రొవైడర్లు, స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు, ఇంకా చాలా వర్గాల వాళ్లకు దబిడిదిబిడే. స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్‌పై (F&O ట్రేడింగ్) విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT), టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (TDS) రేటు, 'డైరెక్ట్ టాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024'లో (Direct Tax Vivad Se Vishwas Scheme 2024) చేసిన మార్పులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు కాబోతున్నాయి. వాటి గురించి మీరు ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డబ్బు నష్టపోతారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆదాయ పన్నుకు సంబంధించిన అనేక మార్పులను అక్టోబర్ 01, 2024 నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
అక్టోబర్ 01 నుంచి అమలయ్యే కొత్త టాక్స్ రూల్స్:
సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
బడ్జెట్ సందర్భంగా, షేర్ల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీల లావాదేవీల పన్నును (STT) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఆప్షన్స్ మీద STT ప్రస్తుతమున్న 0.0625 శాతం నుంచి 0.1 శాతానికి, ఫ్యూచర్స్ మీద ప్రస్తుతమున్న 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌పై పెట్టుబడిదార్లు అక్టోబర్ 01 నుంచి ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
షేర్ల బైబ్యాక్‌పై పన్ను
డివిడెండ్‌లపై పన్ను చెల్లించినట్లే, బైబ్యాక్‌లో షేర్లను సరెండర్ చేయడం వల్ల వచ్చే లాభాలపైనా షేర్‌హోల్డర్‌లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడిదార్లు షేర్లను కొనుగోలు చేయడం కోసం చేసిన ఖర్చును దృష్టిలో ఉంచుకుని మూలధన లాభం లేదా నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. లాభం వస్తే పెట్టుబడిదార్లపై పన్ను భారం పెరుగుతుంది.
ఫ్లోటింగ్ రేట్ బాండ్ టీడీఎస్
కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు లేదా ఫ్లోటింగ్ రేట్‌తో కూడిన బాండ్లపై 10 శాతం చొప్పున TDS కట్ అవుతుందని బడ్జెట్ 2024లో నిర్మలమ్మ ప్రకటించారు. ఈ మార్పు ప్రకారం, బాండ్లలో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే, TDS 10 శాతం చొప్పున చెల్లించాలి. అయితే రూ. 10,000 కంటే తక్కువ ఆదాయం ఉంటే టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు.
టీడీఎస్ రేట్లకు సంబంధించిన మార్పులు
పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లు ఆమోదంతో, అక్టోబర్ 01 నుంచి TDS రేట్లలో మార్పులకు ఆమోదం లభించింది. ఆదాయ పన్ను సెక్షన్ 19DA, 194H, 194-IB, 194M కింద, టీడీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. ఇ-కామర్స్ ఆపరేటర్లకు TDS రేటు 1 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. ఆదాయ పన్నుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం 'డైరెక్ట్ టాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' అక్టోబర్ 01 నుంచి అమలులోకి వస్తుందని CBDT కూడా ప్రకటించింది.
ఆధార్‌లో మార్పులు
పాన్ (PAN) దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, ఆదాయ పన్ను రిటర్న్ లేదా పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నంబర్ బదులుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఇవ్వాలన్న నిబంధన అక్టోబర్ 01 నుంచి వర్తించదు.
మరో ఆసక్తికర కథనం: రెడ్ జోన్‌లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ - పరువు కాపాడిన రిలయన్స్, టైటన్