Stocks to watch 28 October 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్‌లో Maruti Suzuki, SBI Cards
మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 28 October 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 49.5 పాయింట్లు లేదా 0.28 శాతం గ్రీన్ కలర్‌లో 17,852 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: మారుతి సుజుకి, వేదాంత, డా.రెడ్డీస్ లేబొరేటరీస్, టాటా పవర్ కంపెనీ, JSW ఎనర్జీ, బంధన్ బ్యాంక్, సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్, సుమిటోమో కెమికల్ ఇండియా, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్, MRPL, కార్బోరండమ్ యూనివర్సల్, వర్ధమాన్ టెక్స్‌టైల్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండస్ టవర్స్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 44 శాతం పడిపోయి రూ.872 కోట్లకు చేరింది. తన ప్రధాన కస్టమర్‌లలో ఒకరి (వొడాఫోన్ ఐడియా) నుంచి రావలసిన మొత్తాలు రాకపోవడం వల్ల లాభాలు తగ్గాయని ఈ టెలికాం మౌలిక సదుపాయాల కంపెనీ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ.7,967 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలం కంటే 16 శాతం వృద్ధి చెందింది.
SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 52 శాతం పెరిగి రూ.526 కోట్లుగా నమోదైంది. ఈ ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డ్ కంపెనీ Q2FY22లో రూ. 345 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC: సెప్టెంబర్ త్రైమాసికానికి పన్ను తర్వాతి లాభం (PAT) 11 శాతం పెరిగి రూ. 191.68 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 173.07 కోట్ల PAT నమోదు చేసింది.
టాటా కెమికల్స్: భారీ ఆదాయం కారణంగా, టాటా గ్రూప్ కెమికల్ కంపెనీ ఏకీకృత నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 628 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 221 కోట్లుగా ఉంది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్: ఇటీవలే లిస్ట్ అయిన ఈ లెండర్ FY23 జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి నికర లాభం 37 శాతం పెరిగి రూ.262 కోట్లకు చేరుకుంది. ఆదాయంలో వృద్ధి, మొండి బకాయిల తగ్గుదల కారణంగా లాభం పెరిగింది. క్రితం సంవత్సరం ఇదే కాలానికి బ్యాంక్ రూ.191 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
PNB హౌసింగ్ ఫైనాన్స్: నికర వడ్డీ ఆదాయం, డిస్‌బర్స్‌మెంట్లలో రెండంకెల వృద్ధితో సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభాన్ని దాదాపు 12 శాతం పెంచుకుంది, రూ. 262.63 కోట్లను చేరుకుంది. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ గత ఏడాది ఇదే కాలంలో రూ. 235.21 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
CE ఇన్ఫో సిస్టమ్స్ (MapmyIndia): FY23 రెండో త్రైమాసికంలో లాభ వృద్ధి సాధించలేకపోయింది. రెండో త్రైమాసికంలో లాభం రూ. 25.37 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో రూ. 25.39 కోట్లుగా ఉంది. తగ్గిన ఇతర ఆదాయాలు, బలహీనమైన నిర్వహణ కారణంగా ఇది ప్రభావితమైంది. ఈ త్రైమాసికంలో ఆదాయం 35 శాతం వృద్ధితో రూ. 76.31 కోట్లకు ఎగబాకింది.
వి గార్డ్ ఇండస్ట్రీస్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 26.5 శాతం క్షీణించి రూ. 43.66 కోట్లకు దిగి వచ్చింది. గత ఏడాది జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 59.40 కోట్ల నికర లాభాన్ని ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ కంపెనీ నమోదు చేసింది.
అనుపమ్ రసాయన్ ఇండియా: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆరోగ్యకరమైన టాప్‌లైన్, నిర్వహణ పనితీరు కారణంగా కంపెనీ లాభం 15 శాతం పెరిగి రూ.41.2 కోట్లకు చేరుకుంది. నిర్వహణ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.310.7 కోట్లకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.