Stock Market Update: మార్కెట్లలో ఫుల్.. కాదు కాదు 'బుల్ జోష్'! సెన్సెక్స్ 900+, నిఫ్టీ 270+
జీఎస్‌టీ రాబడి పెరగడంతో వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారన్న అంచనాలు, పలు ఆర్థిక పథకాల ఊహాగానాలు మార్కెట్లకు ఊపు తీసుకొచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+ లాభాల్లో కొనసాగుతున్నాయి.

బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్ కనిపిస్తోంది! కీలక సూచీలన్నీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా మొదలవ్వడం మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్ పెంచింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో బడ్జెట్ ప్రజాకర్షకంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
జీఎస్‌టీ రాబడి పెరగడంతో వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారన్న అంచనాలు, పలు ఆర్థిక పథకాలు ప్రకటిస్తారన్న ఊహాగానాలు మార్కెట్లకు ఊపు తీసుకొచ్చాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+ లాభాల్లో కొనసాగుతున్నాయి.
క్రితం రోజు 57,200 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,845 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. వెంటనే ఇంట్రాడే గరిష్ఠమైన 58,125ను తాకింది. మధ్యాహ్నం 920 పాయింట్ల లాభంతో 58,120 వద్ద కొనసాగుతోంది.
శుక్రవారం 17,101 వద్ద ముగిసిన ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,301 వద్ద గ్యాప్‌అప్‌తో ఆరంభమైంది. చూస్తుండగానే ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 17,380కి చేరుకుంది. ప్రస్తుతం 286 పాయింట్ల లాభంతో 17,387 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 38,091 వద్ద ఆరంభమైన సూచీ 38,217 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. గంటన్నరకే 37,647 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. మళ్లీ అక్కడ మద్దతు తీసుకొంది. ప్రస్తుతం 272 పాయింట్ల లాభంతో 37,961 వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీలో 47 కంపెనీలు లాభాల్లో 3 నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఇన్ఫీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. రియాలిటీ, హోటల్స్ షేర్లు దూసుకుపోతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

