Stock Market Update: ఒడుదొడుకుల్లో సూచీలు: సెన్సెక్స్ 143, నిఫ్టీ 43 డౌన్
స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, ఆసియా, ఐరోపా మార్కెట్లు బలహీనంగా ఆరంభమవ్వడం ఇందుకు దోహదం చేసింది.
భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటం, ఆసియా, ఐరోపా మార్కెట్లు బలహీనంగా ఆరంభమవ్వడం ఇందుకు దోహదం చేసింది. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియాలిటీ షేర్లను మదుపర్లు ఎక్కువగా విక్రయించారు. మదుపరిలో నెగెటివ్ సెంటిమెంటు కనిపించింది.
క్రితం రోజు 58,788 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,918 వద్ద మెరుగ్గా మొదలైంది. ప్రతికూల సెంటిమెంటుతో క్రమంగా 58,600కు పతనమైంది. అక్కడి నుంచి సూచీ ఒక రేంజ్‌లోనే కదలాడింది. 58,943 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 58,446 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 143 పాయింట్ల మోస్తరు నష్టంతో 58,644 వద్ద ముగిసింది.
Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!
గురువారం 17,560 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,590 వద్ద ఆరంభమైంది. క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. 17,617 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ 17,426 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 43 పాయింట్ల నష్టంతో 17,516 వద్ద ముగిసింది.
నిఫ్టీ బ్యాంక్ ఒడుదొడుకుల మధ్య కొనసాగింది. ఉదయం 39,128 వద్ద మొదలైన సూచీ 39,278 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. ఆపై నష్టాల బాట పట్టింది. 38,562 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 220 పాయింట్ల నష్టంతో 38,789 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 16 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. 34 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, ఆసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. హీరోమోటోకార్ప్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, ఎన్‌టీపీసీ, ఐచర్ మోటార్స్ నష్టపోయాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, రియాలిటీ సూచీలు 1-2 శాతం పతనమయ్యాయి. మెటల్ సూచీ ఒక శాతం వరకు మెరుగ్గా ముగిసింది.