Closing Bell Today: సాయంత్రం బేర్‌మన్న సూచీలు! సోమవారం లాభాలే అంటున్న విశ్లేషకులు
జీఎస్‌టీ మండలి సమావేశం నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించడం, మూడు రోజుల లాభాలను స్వీకరించేందుకు మదుపర్లు మొగ్గుచూపడంతో నష్టాల్లో ముగిశాయి. సోమవారం సూచీలు భారీ లాభాలతో ఆరంభమవుతాయని విశ్లేషకులు అంచనా ...
వరుసగా మూడు రోజులు సరికొత్త శిఖరాలను తాకిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ప్రి ఓపెన్లో దూకుడు ప్రదర్శించిన సూచీలు ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. జీఎస్‌టీ మండలి సమావేశం నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించడం, మూడు రోజుల లాభాలను స్వీకరించేందుకు మదుపర్లు మొగ్గుచూపడంతో నష్టాల్లో ముగిశాయి. సోమవారం సూచీలు భారీ లాభాలతో ఆరంభమవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గురువారం 59,141 వద్ద ముగిసిన సెనెక్స్ శుక్రవారం ప్రి ఓపెన్లో 269 పాయింట్లు లాభంతో మొదలైంది. 59,410 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. మరికాసేపటికే పుంజుకొని 338 పాయిట్లు పెరిగి 59,527 వద్ద కొనసాగించింది. ఉదయం 11 గంటల సమయంలో 59,721 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని అందుకొంది. అయితే మదుపర్లు లాభాలను స్వీకరించేందుకు మొగ్గు చూపడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. మొత్తంగా 125.27 పాయింట్లు నష్టపోయి 59,016 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం సెన్సెక్స్ బాటలోనే నడిచింది. గురువారం 17,630 వద్ద ముగిసిన సూచీ గురువారం ప్రి ఓపెన్లో 50 పాయింట్లు లాభపడి 17,700 వద్ద ఆరంభమైంది. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠమైన 17,787ను తాకింది. శుక్రవారం కావడం, వారంలో చివరి రోజు కావడం, జీఎస్‌టీ మండలి సమావేశం నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించడంతో చివరికి 44 పాయింట్ల నష్టంతో 17,585 వద్ద ముగిసింది.
మూడు రోజుల లాభాలకు విరామం వచ్చినా వచ్చే వారం నిఫ్టీ 18000 మైలురాయిని అందుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 17440-17295 మధ్య సూచీకి మద్దతు లభిస్తే 18వేల మార్కును దాటుతుందని అంటున్నారు. ఒకవేళ మద్దతు దొరక్కపోతే 16,920 వద్ద సూచీ దిద్దుబాటుకు గురవుతుందని పేర్కొంటున్నారు.
శుక్రవారం ప్రైవేటు బ్యాంకుల షేర్లు లాభాల బాట పట్టాయి. నిఫ్టీలో కొటక్ బ్యాంక్ 5.63, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.64 శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐచర్ మోటార్స్, మారుతీ ఒకటి నుంచి రెండు శాతం మధ్యన లాభాలు పొందాయి. ఇక టాటా స్టీల్, కోల్ ఇండియా 3-4 శాతం వరకు నష్టపోయాయి. ఎస్‌బీఐ, టీసీఎస్, హిందాల్కో 1-2 శాతం వరకు నష్టపోయాయి.
నోట్: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం అవసరం! ఏబీపీ అందిస్తోన్న మార్కెట్ల సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫలానా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ చెప్పడం లేదు.
Also Read: Nureca Stock Price: 7 నెలల్లో 300% పెరిగిన షేరు.. మదుపర్లకు మహాభాగ్యమే మరి!