Share Market Today: నెగెటివ్ సిగ్నల్స్‌ను దాటిన మార్కెట్ రైల్ - నష్టాల నుంచి లాభాల్లోకి సూచీలు
Share Market Open Today: గత వారంలో చివరి ట్రేడింగ్ రోజున దేశీయ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ రోజు భారత్‌లో మార్కెట్ ప్రారంభం కాకముందే ఆసియా స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత కనిపించింది.
Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (సోమవారం, 09 సెప్టెంబర్ 2024) ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత పుంజుకుంది. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే BSE సెన్సెక్స్ సూచీ 81,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది & గ్రీన్ జోన్‌కు చేరుకుంది.
ఉదయం 9.15 గంటలకు దాదాపు 200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ జర్నీ స్టార్ అయింది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. సుమారు అరగంట పాటు పరిమిత నష్టంతో ట్రేడింగ్ జరిగింది. ఆ తర్వాత మార్కెట్‌లో బలం కనిపించింది. ఉదయం 9:55 గంటలకు సెన్సెక్స్ దాదాపు 30 పాయింట్ల లాభంతో 81,200 పాయింట్లను దాటింది. ఇదే సమయంలో నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంతో 25,300 పాయింట్లను దాటింది.
ప్రి-ఓపెన్ సెషన్‌లోనూ నష్టాలు
ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెన్ సెషన్‌లోనూ నష్టాలను చవిచూసింది. ప్రి-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయి 81 వేల స్థాయికి దిగువన ఉండగా, నిఫ్టీ దాదాపు 30 పాయింట్లు పడిపోయి 24,825 పాయింట్ల దిగువకు వచ్చింది. ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందు, గిఫ్ట్ సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ దాదాపు 86 పాయింట్లు పడిపోయి 24,840 పాయింట్ల దగ్గర ట్రేడవుతున్నాయి. అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఇండెక్స్ 7 శాతానికి పైగా పెరిగింది.
శుక్రవారం కూడా భారీ నష్టాలు
గత వారంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు, సెన్సెక్స్ 1,017.23 పాయింట్లు (1.24 శాతం) పడిపోయి 81,183.93 పాయింట్ల వద్ద, నిఫ్టీ 292.95 పాయింట్లు (1.17 శాతం) నష్టపోయి 24,852.15 పాయింట్ల వద్ద ఆగాయి. ఆ వారం మొత్తంలో సెన్సెక్స్ 1,181.84 పాయింట్లు (1.43 శాతం), నిఫ్టీ 383.75 పాయింట్లు (1.52 శాతం) జారిపోయాయి.
ఆసియా మార్కెట్లలో బ్యాడ్ టర్న్
శుక్రవారం, అమెరికాలో జాబ్ డేటా, ఎకనమిక్ డేటా విడుదలైన తర్వాత, వాల్ స్ట్రీట్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1 శాతం కంటే ఎక్కువ పతనమైంది. S&P 500 సుమారు 1.75 శాతం దిగి వచ్చింది. నాస్‌డాక్ 2.5 శాతానికి పైగా పడిపోయింది. ఆ ప్రభావంతో ఈ రోజు ఆసియా మార్కెట్లలో భారీ నష్టాలు కనిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన నికాయ్ సూచీ 3 శాతానికి పైగా నష్టాల్లో ఉంది. టోపిక్స్ ఇండెక్స్ 2.67 శాతం నష్టాల్లో ఉంది. కొరియాకు చెందిన కోస్పి దాదాపు ఫ్లాట్‌గా ఉండగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.58 శాతం, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీ 1.15 శాతం క్షీణతను చూపుతోంది.
సెన్సెక్స్ షేర్ల అప్‌డేట్
ఈ రోజు ఉదయం 9.40 గంటలకు, సెన్సెక్స్30 ప్యాక్‌లోని 14 స్టాక్స్‌లో పతనంగా కనిపించగా, 14 స్టాక్స్ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐటీసీ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. NTPC, అదానీ, పవర్ గ్రిడ్. టాటా స్టీల్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్ షేర్లు టాప్ లూజర్స్‌గా మారాయి.
నిఫ్టీ షేర్ల అప్‌డేట్
మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత, నిఫ్టీలో దాదాపు సగం షేర్లు అటు, సగం షేర్లు ఇటు ఉన్నాయి. 24 స్టాక్‌లు పెరిగాయి, 26 షేర్లు తగ్గాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. ఎస్‌బీఐ లైఫ్ 1.01 శాతం లాభపడింది. బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కూడా టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు 3.08-1.34 శాతం క్షీణించాయి.
ఉదయం 10.50 గంటల సమయానికి, సెన్సెక్స్ 200.82 పాయింట్లు లేదా 0.25% పుంజుకుని 81,384.75 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి, నిఫ్టీ50 కూడా 48.40 పాయింట్లు లేదా 0.19% పెరిగి 24,900.55 స్థాయిలో ఉంది.
మధ్యాహ్నం 12.05 గంటల సమయానికి, సెన్సెక్స్ 133.52 పాయింట్లు లేదా 0.16% పుంజుకుని 81,317.45 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి, నిఫ్టీ 14.65 పాయింట్లు లేదా 0.05% పెరిగి 24,866.80 స్థాయిలో ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.