Stock Market Holiday: ఈ రోజు స్టాక్ మార్కెట్లకు మాత్రమే సెలవా, MCXలో ట్రేడింగ్ జరుగుతుందా?
Gandhi Jayanti 2024 Holiday: స్టాక్ మార్కెట్లు ముందుగా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం, ఈ సంవత్సరంలో మరో 3 హాలిడేస్ (శని, ఆదివారాలు కాకుండా) మిగిలివున్నాయి.
Stock Market Holidays List 2024: గాంధీ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కు ఈ రోజు (బుధవారం, 02 అక్టోబర్ 2024) సెలవు. కాబట్టి, ఇండియన్ షేర్ మార్కెట్లలో ఈ రోజు ట్రేడింగ్ జరగదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా క్లోజ్ అయింది. ఈ రోజు, అన్ని విభాగాల్లో ట్రేడింగ్ యాక్టివిటీలు నిలిచిపోతాయి.
ఈ రోజు ఈ విభాగాలు క్లోజ్:
ఈక్విటీ ట్రేడింగ్: షేర్లు & సెక్యూరిటీల్లో లావాదేవీలు జరగవు
డెరివేటివ్స్ ట్రేడింగ్: ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ జరగదు.
సెక్యూరిటీస్ లెండింగ్ & బారోయింగ్ మార్కెట్: అన్ని కార్యకలాపాలను ఈ రోజు నిలిపేస్తారు
సాధారణ రోజుల్లో రెండు సెషన్లలో (ఉదయం & సాయంత్రం) ట్రేడింగ్ నిర్వహించే MCXలోనూ ఈ రెండు సెషన్లను పూర్తిగా మూసేస్తారు
నిన్న మార్కెట్ల పనితీరు
సెలవుకు ముందు ట్రేడింగ్ రోజున, మంగళవారం నాడు (01అక్టోబర్ 2024) భారతీయ స్టాక్ మార్కెట్ డీలా పడింది. ఇంట్రాడేలో, BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ రెండూ స్థిరంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, స్వల్పంగా తగ్గి రోజును ముగించాయి. నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు తగ్గి 84,266.29 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు 14 పాయింట్లు తగ్గి 25,796.90 పాయింట్ల వద్ద ఆగింది. నిన్న ఉదయం సెన్సెక్స్ 84,257.17 దగ్గర, నిఫ్టీ 25,788.45 దగ్గర ప్రారంభమయ్యాయి. ఆయిల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల వల్ల మంగళవారం మార్కెట్లు ఊగిసలాడాయి. ఐటీ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగినప్పటికీ ప్రధాన సూచీలు రెండూ దిగువ స్థాయిలో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా పెద్ద నష్టం జరగలేదు.
గాంధీ జయంతి సెలవు తర్వాత, అక్టోబర్ 03 గురువారం రోజున NSE, BSE & MCX యథావిధిగా తెరుచుకుంటాయి, ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది. గురువారం సెషన్‌లో పాల్గొనే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు.. ఈ రోజు జరిగే దేశీయ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయాలి.
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ టైమ్
సాధారణంగా, భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పనిచేస్తాయి. దీంతోపాటు, వర్కింగ్ డేస్‌లో ప్రి-ఓపెన్ సెషన్ కూడా ఉంటుంది, ఉదయం 9:00 నుంచి 9:15 వరకు జరుగుతుంది. వారాంతాల్లో (శనివారం & ఆదివారం), అధికారిక సెలవు రోజుల్లో మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపేస్తారు.
ఈ ఏడాది మిగిలివున్న సెలవులు
1. దీపావళి: నవంబర్ 01, 2024 (శుక్రవారం)
2. గురునానక్ జయంతి: నవంబర్ 15, 2024 (శుక్రవారం)
3. క్రిస్మస్: డిసెంబర్ 25, 2024 (బుధవారం)
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) విషయంలో హాలిడేస్ షెడ్యూల్ కాస్త భిన్నంగా ఉంటుంది:
1. దీపావళి: - ఉదయం సెషన్‌కు మాత్రమే సెలవు
2. గురునానక్ జయంతి: ఉదయం సెషన్‌లో మాత్రమే ట్రేడింగ్ జరగదు
3. క్రిస్మస్: రోజంతా క్లోజ్. రెండు సెషన్లలోనూ ట్రేడింగ్ నిర్వహించరు
నవంబర్ 01న "ముహూరత్ ట్రేడింగ్"
దీపావళి సందర్భంగా, భారతీయ స్టాక్ మార్కెట్లలో సంప్రదాయంగా వస్తున్న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ - "ముహూరత్ ట్రేడింగ్". ఇది, దీపావళి & హిందూ నూతన సంవత్సరం 'సంవత్ 2081' ప్రారంభానికి గుర్తుగా నవంబర్ 01న జరుగుతుంది. సాధారణంగా, సాయంత్రం జరిగే ఈ ప్రత్యేక సెషన్‌ను శుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సెషన్‌లో చేసే ట్రేడింగ్ కొత్త సంవత్సరంలో అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
చైనా మార్కెట్లకు ఈ వారమంతా సెలవులు
చైనా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చైనా స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం గోల్డెన్ వీక్ పాటిస్తున్నాయి. ఆ దేశ స్టాక్ మార్కెట్లకు అక్టోబర్ 01 నుంచి అక్టోబర్ 07 వరకు, వారమంతా సెలవులు. ఈ వారం రోజుల్లో చైనా మార్కెట్లలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు జరగవు.
మరో ఆసక్తికర కథనం: భగ్గుమన్న చమురు రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి