Navratna Company: స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ ఒక సంచలనం, తాజాగా నవరత్న హోదా
షేర్ల దూకుడుతో 'ఇరెడా' (IREDA) తరచూ వార్తల్లో కనిపిస్తోంది. తాజాగా, కంపెనీకి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది.
IREDA Gets Navratna Status: 'ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ' (IREDA) షేర్లు శ్రీహరికోట రాకెట్లను మించిన వేగంతో దూసుకెళ్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ ఒక సంచలనం. ఈ కంపెనీ షేర్‌హోల్డర్లను ప్రపంచంలోనే పరమ లక్కీ పర్సన్స్‌గా చెప్పొచ్చు. ఇటీవలి నెలల్లో, తన పెట్టుబడిదార్ల సంపదను ఈ కంపెనీ విపరీతంగా పెంచింది.
శుక్రవారం (26 ఏప్రిల్ 2024), ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేర్లు రూ. 170.95 వద్ద ముగిశాయి. గత ఏడాది నవంబర్ ఇరెడా IPO ఓపెన్ అయింది. IPOలో ఒక్కో షేరును రూ. 30 - 32 ప్రైస్ బ్యాండ్‌లో కేటాయించారు. ఈ షేర్లు దాదాపు 90 శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. IPO ధర ప్రకారం చూస్తే... IREDA షేర్లు ఇప్పటి వరకు (5 నెలల్లో) 434 శాతం పెరిగాయి. 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 63 శాతానికి పైగా లాభపడ్డాయి.
షేర్ల దూకుడుతో 'ఇరెడా' (IREDA) తరచూ వార్తల్లో కనిపిస్తోంది. తాజాగా, కంపెనీకి సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. 'ఇరెడా'కు నవరత్న హోదా లభించింది.
ఇరెడా ఏం చేస్తుంది?
ఇరెడా ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలో పని చేస్తుందియ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ సంస్థ రుణాలు (ఫైనాన్సింగ్) ఇస్తుంది.
నవరత్న హోదా ఎవరికి వస్తుంది?
నవరత్న హోదా పొందాలంటే ఏదైనా ప్రభుత్వ సంస్థ ముందుగా మినీ రత్న కేటగిరీలో ఉండాలి. ఇటీవలి నెలల్లో ఇరెడా ఆర్థిక పనితీరు గణనీయంగా మెరుగుపడింది. 2024 మార్చి త్రైమాసికంలో (Q4 FY24) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఆ క్వార్టర్‌లో కంపెనీ లాభం 33 శాతం YoY పెరిగి రూ. 337 కోట్లకు చేరింది. అదే త్రైమాసికంలో AUM 26.8 శాతం పెరిగి రూ. 56,698 కోట్లకు చేరుకుంది.
భారత ప్రభుత్వం నవరత్న హోదాను కీలక ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తుంది. ఈ హోదా పొందిన సంస్థకు చాలా వెసులుబాట్లు, స్వేచ్ఛ అందుతాయి. నవరత్న కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం తమ నికర విలువలో 30 శాతాన్ని కేటాయించవచ్చు. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి, విదేశీ యూనిట్లను నెలకొల్పడానికి, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్ ఈక్విటీ ఫండ్స్ - వీటి ట్రాక్ రికార్డ్ కేక