Voice Cloning Scam: ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్- ఆ సంస్థ ఛైర్మన్ ఫోన్‌కాల్ చేసి డబ్బులు అడగొచ్చు
Sunil Bharti Mittal: భారతి ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిత్తల్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఏఐ దుర్వినియోగం వల్ల ప్రజలు ఎంత ప్రమాదం పడతారో పూసగుచ్చినట్లు వివరించారు.
Sunil Bharti Mittal Voice Cloned By AI Scammers: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సెస్ పెరిగిన ఈ రోజుల్లో మోసాలు, ముఖ్యంగా ఫైనాన్షియల్ స్కామ్‌లు పరమ సులభంగా మారాయి. సామాన్యులనే కాదు సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలను కూడా ట్రాప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ప్రసిద్ధ టెలికాం సర్వీస్‌ల ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel) కంపెనీకి ఛైర్మన్ అయిన సునీల్ భారతి మిత్తల్‌కు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. తన పేరిట డబ్బును దోచుకోవడానికి ఎంత తెలివిగా ప్లాన్ చేశారన్న విషయం తెలుసుకుని సునీల్ మిత్తల్ కంగుతిన్నారు.
సునీల్ భారతి మిత్తల్ వాయిస్ క్లోనింగ్
ఈ సంఘటన గురించి, స్వయంగా సునీల్ మిత్తల్ NDTV వరల్డ్ సమ్మిట్‌లో చెప్పారు. ఈ స్కామ్‌లో, మిత్తల్ గొంతును స్కామర్లు కృత్రిమ మేధ (Artificial Intelligence -AI) ద్వారా క్లోజ్ చేశారు. అంటే, మక్కీకిమక్కీ కాపీ చేశారు. మిత్తల్ మాట్లాడితే ఎలా ఉంటుందో, 100కు 100 శాతం దింపేశారు. అలా సైబర్ నేరగాళ్లు ఒక వాయిస్ మెసేజ్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాత, ఎయిర్‌టెల్ కంపెనీకి చెందిన ఒక అధికారికి ఫోన్ చేశారు. ఈ కాల్ దుబాయ్ నుంచి వచ్చింది. AI ద్వారా క్రియేట్ చేసిన వాయిస్‌ను ఆ ఫోన్‌కాల్‌లో వినిపించారు. తనకు అత్యవసరంగా డబ్బు అవసరమైందని, తాను చెబుతున్న వ్యక్తి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేయమని ఆ కాల్‌లో ఉంది. అది కూడా, చాలా భారీ మొత్తంలో డబ్బు బదిలీ గురించి వాయిస్‌లో ఉంది. ఆ అధికారి సునీల్ మిత్తల్ వాయిస్ విని ఆశ్చర్యపోయాడు. బాస్ ఆదేశానుసారం మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్నప్పటికీ, ఒక్క క్షణం ఆలోచించాడు. ఎందుకంటే, సునీల్ మిత్తల్ తన అధికారులకు ఎప్పుడూ ఇలాంటి సూచనలు ఇవ్వలేదు. దీంతో, మిత్తల్ గొంతును అనుకరిస్తూ తనకు వచ్చినది ఫేక్ కాల్ అని అర్ధం చేసుకున్నాడు. ఆ డబ్బును బదిలీ చేయలేదు. ఆ విధంగా పెద్ద స్కామ్ నుంచి తప్పించుకున్నాడు.
టెక్నాలజీ వాడకాన్ని చూసి ఆశ్చర్యపోయిన మిత్తల్
'వాయిస్ క్లోనింగ్ స్కామ్' గురించి తెలుసుకున్న సునీల్ మిత్తల్ ఆ ఫోన్ కాల్ రికార్డింగ్‌ను విన్నారట. తన గుంతుకను మరిపించేలా ఉన్న ఆ వాయిస్ విన్నానని, AI టెక్నాలజీ వాడకానికి చాలా ఆశ్చర్యపోయానని NDTV వరల్డ్ సమ్మిట్‌లో మిత్తల్ చెప్పారు. AI సాంకేతికత దుర్వినియోగం గురించి వార్తలను తాను విన్నానన్న సునీల్ మిత్తల్, ఈసారి తనను టార్గెట్‌గా చేసుకునే ప్రయత్నం జరిగిందని అన్నారు. AI టెక్నాలజీ దుర్వినియోగం జరిగితే చాలా ప్రమాదకరమని సునీల్ భారతి మిత్తల్ చెప్పారు.
మీకూ ఫోన్ కాల్ రావచ్చు!
వాయిస్ క్లోనింగ్ ద్వారా ఇప్పటికే చాలామందికి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎక్కువగా, వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను మోసగాళ్లు పంపుతున్నారు. మీకు కూడా ఇలాంటి ఫేక్ కాల్, ఫేక్ వాయిస్ మెసేజ్ రావచ్చు. ఇలాంటివన్నీ కొత్త నంబర్ నుంచి వస్తాయి. మీకు బాగా పరిచయమైన వ్యక్తి గొంతు ఆ వాయిస్ మెసేజ్‌లో మీకు వినిపిస్తుంది. తాను చాలా అత్యవసరంలో ఉన్నానని, తన ఫోన్ నుంచి కాల్/మెసేజ్ చేయడం కుదరలేదని, ఫలానా ఫోన్ నంబర్/అకౌంట్‌కు వెంటనే డబ్బులు పంపమని ఆ వాయిస్ ద్వారా మోసగాళ్లు మిమ్మల్ని అడుగుతారు. ఇలాంటి వాయిస్ కాల్/ మెసేజ్ మీకు వస్తే, ఏ వ్యక్తి గొంతు మీకు వినిపించిందో నేరుగా ఆ వ్యక్తికే ఫోన్ చేయండి. ఆ మెసేజ్ నిజమో, కాదో తేలిపోతుంది. ఇలా క్రాస్ చెక్ చేసుకోకుండా డబ్బులు పంపితే మాత్రం మోసపోవాల్సి వస్తుంది, జాగ్రత్త.
మరో ఆసక్తికర కథనం: వాలంటరీ రిటైర్మెంట్ రూల్స్‌లో మార్పు - ప్రభుత్వ ఉద్యోగులు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి