SBI Q4 Results: స్టేట్ బ్యాంక్ లాభంలో 83% జంప్, ఒక్కో షేరుకు 1130% శాతం డివిడెండ్
మార్చి త్రైమాసికానికి సంబంధించి స్ట్రాంగ్ రిపోర్ట్ కార్డ్‌ను ప్రకటించింది.
SBI Q4 Results: మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మార్చి త్రైమాసికానికి సంబంధించి స్ట్రాంగ్ రిపోర్ట్ కార్డ్‌ను ప్రకటించింది. జనవరి-మార్చి కాలంలో బ్యాంక్ స్వతంత్ర నికర లాభం 83% వృద్ధితో రూ. 16,695 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 9,113 కోట్లుగా ఉంది.
నాలుగో త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 40,393 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలోని రూ. 31,198 కోట్లతో పోలిస్తే 29% పెరిగింది.
అంచనాలు మించి రాణింపు
నికర లాభం, NII రెండూ ET Now పోల్ అంచనాలను మించాయి. దాదాపు రూ. 15,000 కోట్ల లాభం, రూ. 40,000 కోట్ల NII సంపాదిస్తుందని పోల్‌లో అంచనా వేశారు.
సమీక్ష కాల త్రైమాసికంలో కేటాయింపులు (Provisions) ఏకంగా 54% మెరుగుదలతో రూ. 3,316 కోట్లకు దిగి వచ్చాయి, ఇది చాలా మంచి పరిణామం. ఏడాది క్రితం ఇది రూ.7,237 కోట్లుగా ఉంది.
నిరర్థక ఆస్తుల (NPAs) కేటాయింపులను కూడా సగానికి పైగా తగ్గించి రూ.1,278 కోట్లకు చేర్చిందీ రుణదాత.
మెరుగుపడిన ఆస్తుల నాణ్యత
ఆస్తి నాణ్యత విషయానికి వస్తే... మార్చి త్రైమాసికంలో స్థూల NPA నిష్పత్తి 2.78%గా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలోని 3.14%, గత సంవత్సరం మార్చి త్రైమాసికంలోని 3.97% నుంచి బాగా మెరుగుపడింది. నికర NPA నిష్పత్తి కూడా 0.67% వద్దకు చేరింది. మూడో త్రైమాసికంలోని 0.77%, క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలోని 1.08% నుంచి ఇది మెరుగుపడింది.
మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన 25% పెరిగి రూ. 24,621 కోట్లకు చేరుకుంది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ (NIM) 44 బేసిస్ పాయింట్లతో (YoY) 3.84%కి పెరిగింది.
స్లిప్పేజ్ నిష్పత్తి 0.41% వద్ద ఉంది. మూలధన సమృద్ధి నిష్పత్తి (CAR) 14.68%గా ఉంది.
Q4FY23లో బ్యాంక్ క్రెడిట్ ఖర్చులు తగ్గి 0.16%గా ఉన్నాయి, YoYలో 33 bps మెరుగుపడ్డాయి. మార్చి 2023 నాటికి స్టేట్ బ్యాంక్ 16% క్రెడిట్ వృద్ధితో రూ. 32.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో కార్పొరేట్ రుణాలు 12%, రిటైల్ వ్యక్తిగత రుణాలు 18% పెరిగాయి. డిపాజిట్లు కూడా ఏడాది ప్రాతిపదికన 9% పెరిగి రూ. 44.23 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
పూర్తి ఆర్థిక సంవత్సరంలో (FY23) ఎస్‌బీఐ నికర లాభం రూ. 50,000 కోట్ల మార్క్ దాటింది, రూ. 50,232 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 58% వృద్ధిని ఇది చూపుతోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి NII 20% YoY పెరిగింది. FY23 నిర్వహణ లాభం 11% పెరిగి రూ. 83,713 కోట్లకు చేరుకుంది.
1130% శాతం డివిడెండ్
స్టేట్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఒక్కో ఈక్విటీ షేర్‌కు (1130%) రూ. 11.30 డివిడెండ్ ప్రకటించింది. చెల్లింపు తేదీని జూన్ 14గా నిర్ణయించింది. రికార్డ్ తేదీలోగా బ్యాంక్ షేర్లు ఉన్న, కొన్న అందరూ ఈ డివిడెండ్‌కు అర్హులే.
ఇవాళ (గురువారం, 18 మే 2023) మధ్యాహ్నం 3.20 గంటల సమయానికి ఎస్‌బీఐ షేరు 1.97% తగ్గి రూ. 574 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: మహిళలకు శుభవార్త, ఈ పథకంలో కటింగ్ లేకుండా మొత్తం డబ్బులిస్తారు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.