Retail Inflation: ఎన్నికల వేళ ఉపశమనం- ఏప్రిల్‌లో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
దశలవారీగా దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఏప్రిల్ మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు స్వల్పంగా తగ్గటం ఊరటను అందిస్తున్నాయి. ఇది ప్రజలకు, ప్రభుత్వానికి కలిసొచ్చే అంశంగా ఉంది.
April Inflation: ప్రస్తుతం దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ప్రజలపై ధరల భారం వీలైనంత తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాస్తవానికి ఏడాదికి పైగా కాలం నుంచి అంతర్జాతీయంగా పెరిగిన ఉద్రిక్తతలు దేశంలో వంటిగదిలోని వస్తువుల ధరలను ఆకాశానికి చేర్చిన సంగతి తెలిసిందే. అయితే అవి క్రమంగా తగ్గుతూ సామాన్యులకు ఊరటను కలిగిస్తున్నాయి.
నేడు దేశంలో నాలుగో విడత ఎన్నికలు పూర్తి కావటంతో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ దాదాపు సగం పూర్తయింది. అయితే ఈ క్రమంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలమైన ద్రవ్యోల్బణం డేటా శుభవార్తగా నిలిచింది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తాజా గణాంకాల ప్రకారం అనేక వంటగది వస్తువుల ధరలు తగ్గడంతో ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.83 శాతానికి తగ్గింది. దీనికి ముందు మార్చి నెలలో ఇది 4.85 శాతం వద్ద ఉంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాల ప్రకారం ఆహార వస్తువుల రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో స్వల్పంగా 8.70 శాతానికి పెరిగింది. నెల క్రితం మార్చి నెలలో ఇది 8.52 శాతంగా ఉంది.
ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతం తేడాతో నాలుగు శాతం వద్ద ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సెంట్రల్ బ్యాంక్ తన రెండు నెలలకోసారి నిర్వహించే మానిటరీ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను నిర్ణయించేటప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతూనే ఆహార పదార్థాల ధరలు కొనసాగుతాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో సాధించిన విజయాన్ని నిలకడగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. స్థిరమైన ప్రాతిపదికన ప్రధాన ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తగ్గించడానికి పని చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ ప్రారంభంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ(MPC) సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. ద్రరవ్యోల్బణంపై ఆందోళనల మధ్య రెపో రేటు ఫిబ్రవరి 2023 నుంచి ఈ స్థాయిలోనే కొనసాగిస్తోంది. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ సైతం గత కొన్ని సమావేశాల నుంచి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి పెంపులు ప్రకటించకుండా స్థిరంగా కొనసాగిస్తోంది. భారత సెంట్రల్ బ్యాంక్ సైతం అగ్రరాజ్యం సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ నిర్ణయాలను ఫాలో అవుతోంది. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ భవిష్యత్తులో ద్రవ్యోల్బణంపై పోరులో అవసరమైతే పెంచటానికి వెనుకాడబోమని సంకేతాలు ఇచ్చింది. కానీ చాలా మంది పెట్టుబడిదారులు, విశ్లేషకులు మాత్రం సెప్టెంబర్ నాటికి ఫెడ్ రేట్ల కోతలను ప్రకటించొచ్చని ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.