RBI On Inflation: EMIల భారం తగ్గొచ్చు, ఆశలు పుట్టిస్తున్న రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లోని 7.79 శాతం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ డిసెంబర్‌లో 5.72 శాతానికి దిగి వచ్చింది.
RBI On Inflation: 2022 ఏప్రిల్‌లో, భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.79 శాతం గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పట్నుంచి నిర్వహించిన 5 ద్రవ్య విధాన నిర్ణయ సమావేశాల (Monetary Policy Committee - MPC) ద్వారా, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి RBI రెపో రేటును పెంచింది. 2022లో, ఐదు దఫాల్లో పెంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. ఆ ఏడాది ఏప్రిల్‌లో 4 శాతంగా ఉన్న రెపో రేటును, ఆ ఏడాది ముగిసే సరికి ఏకంగా 6.25 శాతానికి పెంచింది. అంటే 7 నెలల కాలంలో 225 బేసిస్ పాయింట్లు లేదా 2.25 శాతం మేర వడ్డీ రేటు పెరిగింది.
టాలరెన్స్ బ్యాండ్‌లో చిల్లర ద్రవ్యోల్బణం
గత ఐదు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయాలు, కొన్ని వస్తువుల ఎగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల ఫలితంగా దేశంలో ధరలు మెత్తబడ్డాయి. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లోని 7.79 శాతం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ డిసెంబర్‌లో 5.72 శాతానికి దిగి వచ్చింది. నవంబర్‌లో 5.88 శాతంగా నమోదైంది. తత్ఫలితంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యిత శ్రేణి (Tolerance Band) అయిన 2-6% మధ్యలోనే ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా ఇది రెండో నెల.
వరుసగా రెండు నెలల పాటు (నవంబర్, డిసెంబర్) టాలరెన్స్ బ్యాండ్‌లోనే చిల్లర ద్రవ్యోల్బణం ఉండడంతో RBI (Reserve Bank of Indis) ఊపిరి పీల్చుకుంది. మానిటరీ పాలసీ కమిటీ తన మొదటి మైలురాయిని సాధించిందని తన నెలవారీ బులెటిన్‌లో రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడిందని 2023 జనవరి కాలానికి విడుదల చేసిన బులెటిన్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పుడు RBI లక్ష్యం 2023లో ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించడం, తద్వారా 2024 నాటికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడం. రిటైల్ ఇన్‌ఫ్లేషన్ రేటు RBI టాలరెన్స్ బ్యాండ్‌లోకి రావడంతో పాటు, కరెంట్ ఖాతా లోటు (Current Account Deficit) తగ్గవచ్చని బులెటిన్ గణాంకాలు చూపిస్తున్నాయి.
EMIల భారం తగ్గే అవకాశం
ఆర్‌బీఐ బులెటిన్‌లో పేర్కొన్న విషయాలను చూస్తే సామాన్యూలు ఊపిరి పీల్చుకోవచ్చు. 2023 ఫిబ్రవరి నెలలో RBI మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండు నెలలు టాలరెన్స్ బ్యాండ్‌లోనే ఉన్న నేపథ్యంలో, పాలసీ రేటును RBI పెంచకపోవచ్చని, యథాతథంగా కొనసాగించవచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది.
రెపో రేటును RBI పెంచకపోతే, బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచవు. ఫలితంగా నెలవారీ వాయిదాల చెల్లింపులు (EMI) మరింత భారంగా మారకుండా, ఇప్పుడు ఉన్న రేట్ల వద్దే ఉండిపోతాయి. ఇకపై కూడా ద్రవ్యోల్బణం తగ్గితే, రెపో రేటును తగ్గిస్తూ భవిష్యత్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే, భవిష్యత్తులో EMIల భారం తగ్గే అవకాశం కూడా ఉంది.
మరోవైపు, అమెరికాలోనూ చిల్లర ద్రవ్యోల్బణం దిగి వస్తోంది. ఈ నేపథ్యంలో, అగ్రరాజ్యంలోనూ వడ్డీ రేట్ల పెంపులో యూఎస్ ఫెడ్ (US FED Rates) దూకుడుగా వ్యవహరించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరి 1న యూఎస్ ఫెడ్ తదుపరి సమావేశం ఉంది. యూఎస్ ఫెడ్ దూకుడు తగ్గితే, అది మన దేశ వడ్డీ రేట్ల మీదా సానుకూల ప్రభావం చూపుతుంది.