Q3 GDP Data: మంగళవారమే విడుదల! జీడీపీ వృద్ధిరేటు మందగించిందా?
Q3 GDP Data: కేంద్ర ప్రభుత్వం మంగళవారం జీడీపీ గణాంకాలను (GDP Numbers) విడుదల చేయనుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వృద్ధిరేటు (GDP Growth Rate), ఇతర సమాచారాన్ని వెల్లడించనుంది.
Q3 GDP Data:
కేంద్ర ప్రభుత్వం మంగళవారం జీడీపీ గణాంకాలను (GDP Numbers) విడుదల చేయనుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం వృద్ధిరేటు (GDP Growth Rate), ఇతర సమాచారాన్ని వెల్లడించనుంది. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) రెపోరేట్లను పెంచుతుండటం, డిమాండ్ సన్నగిల్లడంతో వృద్ధిరేటు మూమెంటమ్ పరిమితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ద్రవ్యోల్బణం (Inflation) కారణంగా ఆర్బీఐ దూకుడుగా వడ్డీరేట్లను పెంచుతోంది. 2022 మే నుంచి ఇదే ఒరవడి కొనసాగిస్తోంది. విధాన వడ్డీరేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇప్పటికీ ద్రవ్యోల్బణం లక్షిత రేటు 6 శాతం కన్నా ఎక్కువగా ఉండటంతో మళ్లీ రెపోరేట్ల (Repo Rates) పెంపు తప్పకపోవచ్చు.
భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) వృద్ధిరేటు మూడో త్రైమాసికంలో స్వల్పంగా నెమ్మదించిందని రాయిటర్స్ నిర్వహించిన పోల్‌లో కొందరు ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. వడ్డీరేట్ల పెంపుతో మూమెంటమ్ మందగించిందని అంటున్నారు. ఎకానమీ ఐదు శాతం కన్నా తక్కువ వృద్ధిరేటుతో సాగుతోందని బార్క్‌లేస్ ఇండియా ఎకానమిస్ట్ రాహుల్ బజోరియా అభిప్రాయపడ్డారు.
'కఠిన ద్రవ్య విధానం, పెరిగిన ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక ఏడాది వృద్ధిరేటుపై ప్రభావం చూపుతుంది. వృద్ధిరేటు ఆరు శాతం వరకు ఉంటుందని భావిస్తున్నాం. ఆ మరుసటి ఏడాదికి జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేస్తున్నాం' అని రాహుల్ బజోరియా పీటీఐకి చెప్పారు.
ప్రస్తుత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 4.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 2023-24 మొత్తంగా చూస్తే 6 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ ఎకానమిస్టులు సైతం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 13.5 శాతం విస్తరించింది. కరోనా అడ్డంకులు తొలగిపోవడమే ఇందుకు కారణం. ఎకానమీలో స్థిరత్వం రావడంతో జులై - సెప్టెంబర్ క్వార్టర్లో 6.3 శాతానికి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని జాతీయ గణాంక కార్యాలయం పేర్కొన్న సంగతి తెలిసిందే. సవరించిన గణాంకాల ప్రకారం అత్యంత వేగంగా ఎకానమీ పుంజుకోవడం లేదు. 2022, మార్చి 31తో ముగిసిన ఏడాదిలో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదు చేసింది.
2023 ఆర్థిక ఏడాది ఆరంభంలో జీడీపీ వృద్ధిరేటును 7.8 శాతం నుంచి 7.2 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. 2022, సెప్టెంబర్ నాటికి 7 శాతానికి కుదించింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మందగమనంలో ఉండటం, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల గత నెల్లో దీనిని 6.8 శాతానికి తగ్గించింది. కాగా 2022-23లో వాస్తవ జీడీపీ 6.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసింది. ప్రభుత్వం మంగళవారం గణాంకాలు విడుదల చేశాక స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.
నేడు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే?
స్టాక్ మార్కెట్లు నేడు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం భారీగా పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం భయాలూ ఇందుకు తోడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు రికవరీ బాట పట్టాయి. నష్టాలను తగ్గించుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 73 పాయింట్లు తగ్గి 17,392 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 175 పాయింట్ల తగ్గి 59,288 వద్ద ముగిశాయి. ప్రధానంగా బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 82.84 వద్ద స్థిరపడింది.