Paytm: పేటీఎం నోడల్ ఖాతా యాక్సిస్ బ్యాంక్‌కు మార్పు - పేమెంట్లకు ఇబ్బంది ఉండదు!
పేటీఎం యాప్, మా ఇతర పరికరాలు పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్ పని చేస్తూనే ఉంటాయని కూడా మేము మా వినియోగదార్లకు హామీ ఇస్తున్నాం
Paytm Payment Bank Update: పేటీఎం క్యూఆర్ (Paytm QR), సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ యూజర్లకు, ముఖ్యంగా పేటీఎం భాగస్వామ్య వ్యాపారులకు ఊరట కలిగించే వార్త ఇది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (One97 Communications), నోడల్ ఖాతా (Nodal Account) సెటిల్‌మెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్‌తో (Axis Bank) ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు ఈ నోడల్ అకౌంట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆంక్షల నేపథ్యంలో దీనిని మార్చింది.
నోడల్ ఖాతా అంటే.. సెటిల్‌మెంట్ ఖాతాగా చెప్పుకోవచ్చు. సంస్థ ఖాతాదార్లు, వ్యాపారులు చేసే అన్ని లావాదేవీలను ఈ ఖాతా ద్వారా సెటిల్ చేస్తారు. తన పార్ట్‌నర్ మర్చంట్ పేమెంట్ సెటిల్మెంట్లు సజావుగా జరిగేలా ఒక ఎస్క్రో ఖాతాను తెరిచినట్లు ఈ కంపెనీ తెలిపింది.
"మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్, తన నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మార్చింది. బిజినెస్ పార్ట్‌నర్లందరి వద్దా పేటీఎం క్యూఆర్ (Paytm QR), సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి" అని, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేటీఎం పేటీఎం ప్రకటించింది.
2024 మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్లు పని చేస్తూనే ఉంటాయని RBI కూడా తెలిపింది.
"రెగ్యులేటరీ మార్గదర్శకాలు, నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, మా వ్యాపార భాగస్వాములకు ఇబ్బంది లేని సేవలను అందించడానికి మేము పూర్తి అంకితభావంతో ఉన్నాం. పేటీఎం యాప్, మా ఇతర పరికరాలు పేటీఎం క్యూఆర్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్ పని చేస్తూనే ఉంటాయని కూడా మేము మా వినియోగదార్లకు హామీ ఇస్తున్నాం" అని పేటీఎం ప్రతినిధి చెప్పారు.
దీనికి ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు పెద్ద ఉపశమనం ఇచ్చింది. 29 ఫిబ్రవరి 2024 నుంచి వర్తించేలా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన పరిమితుల తేదీని మార్చింది, 15 మార్చి 2024 వరకు పొడిగించింది. కస్టమర్లు, దుకాణదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి పేటీఎం పేమెంట్ బ్యాంక్‌కు మరికొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం కస్టమర్ల మనసుల్లో ఉన్న చాలా సందేహాలను క్లియర్ చేయడానికి, పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై FAQs (Frequently Asked Questions) కూడా RBI జారీ చేసింది.
పేటీఎంకు RBI ఉపశమనం ప్రకటించడంతో, శుక్రవారం (16 ఫిబ్రవరి 2024) ట్రేడింగ్ సెషన్‌లో, పేటీఎం స్టాక్ 5 శాతం పెరిగింది, రూ. 341.30 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే