Pakistan Gold Rate: పది గ్రాముల బంగారం రెండు లక్షలు- లీటర్ డీజిల్ రూ.280!
Pakistan Gold Rate: పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2.06 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరింది.
Pakistan Gold Rate: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ 31.5 శాతానికి చేరిందని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది. ఇక పది గ్రాముల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. 24 క్యారెట్ల పసిడి ధర 2.06 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. మరోవైపు పాక్ కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోతుంది. ద్రవ్యోల్బణ కారణాలను చూపుతూ గురువారం అక్కడి కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 300 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరగా.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ అప్పు కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి విధించిన షరతులకు ఇటీవలే తలొగ్గింది. బడ్జెట్ లోటును తగ్గించుకొని నికర పన్ను వసూళ్లను పెండుకోవడమే ల్యంగా మినీ బడ్జెట్ ను ఆవిష్కరించింది.
అలాగే ఫారెక్స్ నిల్వలు సరిపడా లేకపోవడంతో అత్యవసర ఔషధాలు, దేశంలో ఉత్పత్తి చేసే ఇతర మెడిసిన్ ముడి సరుకును సైతం దిగుమతి చేసుకోలేక పాక్ విలవిలలాడుతోంది. దీంతో స్థానిక ఔషధ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆస్పత్రుల్లోని రోగులు తీవ్ర అవస్థలు పడుతు్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మందులు, వైద్య పరికరాల కొరత కారమంగా వైద్యులు శస్త్ర చికిత్సల్ని నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నిత్యావసరాల కోసం ప్రజలు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి మరణాలు కూడా చోటు చేసుకున్నాయి.
దివాలా అంచున పాకిస్థాన్..
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఎన్నిడూ లేని విధంగా దివాలా అంచున నిలిచింది. రక్షించాలని ఐఎంఎఫ్‌కు విజ్ఞప్తి చేస్తోంది. కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఆకాశాన్ని అంటాయి. వరదలతో పంటలు నష్టపోవడం, విదేశీ మారక నిల్వలు అడుగంటడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ధరలు పెరగడం, ఇప్పటికే చెల్లించాల్సిన అప్పుల్ని చెల్లించకపోవడంతో ఏ ఆదేశమూ ఆదుకోవడం లేదు. ఇప్పటికే దాయాది ఎన్నోసార్లు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంది. రానురాను ఇవి మరింత ఘోరంగా ఉంటున్నాయి. పైగా ఈ ఏడాది రాజకీయ అనిశ్చితి నెలకొంది. 2025లోపు పాకిస్థాన్ 73 బిలియన్ డాలర్ల అప్పులు తీర్చాలి. అది జరిగే పని కాదు. ఐఎంఎఫ్ బెయిల్ ఔట్ చేసినా మళ్లీ రుణాలను పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. అయితే ఈజిప్టు, శ్రీలంకతో పోలిస్తే కాస్త సులభంగానే రీస్ట్రక్చర్ చేయొచ్చని నిపుణులు అంటున్నారు.
సర్జరీలు చేయకండి: పాక్ ప్రభుత్వం
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం అక్కడి హెల్త్‌కేర్ రంగాన్నీ దెబ్బ తీసింది. ఆసుపత్రుల్లో ఉన్న రోగులకు అత్యవసర మందులు అందించలేక ఇబ్బందులు పడుతోంది ప్రభుత్వం. ఫారెక్స్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఫలితంగా వేరే దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దేశీయంగా తయారు చేయాలన్నా Active Pharmaceutical Ingredients (API)కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతానికి దేశీయంగా మందులు తయారు చేస్తున్న కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం లేదు. సర్జరీలు చేయొద్దంటూ వైద్యులకు అల్టిమేటం జారీ చేసింది పాక్ సర్కార్. అత్యవసర సర్జరీలకు అవసరమైన అనస్తీషియా మరో రెండు వారాలకు సరిపడ మాత్రమే ఉంది. గుండె, కిడ్నీ జబ్బులతో పాటు క్యాన్సర్‌తో బాధ పడుతున్న రోగులకూ మందులు దొరకడం లేదు. ఈ సమస్యలకు తోడు ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది కూడా లేరు. చాలా మందికి జీతాలివ్వలేక తొలగించారు. ఫలితంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. అయితే...ఈ సమస్యకు ప్రభుత్వమే కారణమని డ్రగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకులు దిగుమతులకు అవసరమైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌లు జారీ చేయడం లేదని మండి పడుతున్నాయి. పాకిస్థాన్‌లో వైద్యం అంతా విదేశాల నుంచి వచ్చిన మందులతోనే నడుస్తోంది. దేశీయంగా పెద్దగా ఉత్పత్తి లేక మొత్తంగా వేరే దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. భారత్, చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.