ITR Filing: ఆదాయం పెరిగింది, ఐటీఆర్‌లు పెరిగాయ్ - టాక్స్‌పేయర్ల సంఖ్య తగ్గింది, ఇదేం విచిత్రం
Income Tax Return: 2019-20తో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించే వారి సంఖ్య దాదాపు 33 శాతం తగ్గింది. అయినప్పటికీ, సర్కారుకు వచ్చే ఆదాయం పెరిగింది.

Income Tax Return Filing: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశంలో 8 కోట్లకు పైగా ప్రజలు ఆదాయ పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసినప్పటికీ, గత 5 సంవత్సరాలలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 70 లక్షలు తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, ITR ఫైల్ వాళ్ల సంఖ్య పెరిగినప్పటికీ, వాస్తవంగా పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గింది. ఇది, 2019-20తో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 33 శాతం తగ్గింది. విచిత్రం ఏంటంటే, పన్ను చెల్లింపుదార్ల (Taxpayers) సంఖ్య తగ్గినప్పటికీ, ఆదాయ పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏటికేడు పెరుగుతూనే ఉంది.
లోక్‌సభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం
గత 5 సంవత్సరాలలో దేశంలో ఎంత మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసారు & గత 5 సంవత్సరాలలో ఈ సంఖ్య ఎంత అని ఆర్థిక మంత్రిత్వ శాఖను లోక్‌సభ (LokSabha)లో ఓ సభ్యుడు ప్రశ్నించారు. దీనితో పాటు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలో ఎంతమంది వాస్తవంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని కూడా అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో. ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 6,47,88,494 అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన సమాచారంలో పేర్కొంది. వీరిలో 2,90,36,234 మంది ఎటువంటి పన్ను చెల్లించలేదని వెల్లడించింది. అంటే, 2019-20 సంవత్సరంలో 3,57,52,260 మంది మాత్రమే ఇన్‌కమ్ టాక్స్ కట్టారు. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య దాదాపు 8 కోట్లకు చేరుకుంది.
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సమర్పించిన డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, 8,39,73,416 మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారు కానీ ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గింది. సమాచారం ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో 5,57,95,391 మంది ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదు. అంటే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్ల 81 లక్షల 78 వేల 025 మంది మాత్రమే పన్ను చెల్లించారు.
దేశ జనాభాలో టాక్స్‌పేయర్లు 2% మాత్రమే
ఒకవైపు, దేశంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది కానీ గత 5 సంవత్సరాలలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గింది. దీనికి ప్రధాన కారణాలు - కొత్త ఆదాయ పన్ను విధానం, పన్ను శ్లాబులలో వచ్చిన నిరంతర మార్పులు. ఉదాహరణకు, ప్రస్తుత బడ్జెట్‌లో, నిర్మల సీతారామన్ ప్రకటించిన రూ. 12 లక్షల పన్ను మినహాయింపు పరిమితి దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను 1 కోటి తగ్గిస్తుంది. దీని అర్థం వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరగవచ్చు, కానీ వాస్తవానికి పన్ను చెల్లింపుదారుల సంఖ్య మునుపటి కంటే తక్కువగా ఉండవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంటే, వారిలో కేవలం 2 శాతం మంది మాత్రమే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు.
టాక్స్ ఎక్స్‌పర్ట్ గోపాల్ కేడియా చెప్పిన ప్రకారం, "ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, పన్ను చెల్లింపుదారుల నుంచి ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్లకు పైగా అందుకుంది. మార్చి 31 నాటికి, మరో రూ. 3 లక్షల కోట్ల రూపాయల వరకు అదనంగా పొందవచ్చు. అంటే, ఒక వైపు ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఉపశమనం ఇస్తోంది, ఈ కారణంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు, ప్రభుత్వ ఆదాయం కూడా నిరంతరం పెరుగుతోంది.
ప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ఆదాయ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రూ.24 లక్షల కోట్లు దాటవచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉంది, డబ్బు ఉన్నవారిపై ఎక్కువ పన్ను విధించాలి. జీతం లేదా వ్యాపారం నుంచి వచ్చే రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించకపోయినా, మధ్య తరగతి ప్రజలందరినీ ITR దాఖలు చేసేలా చేయాలి. తక్కువ ఆదాయ వర్గాలకు రిటర్నులు దాఖలు చేయడం & పన్నులు చెల్లించడం నుంచి ఉపశమనం ఇవ్వాలి.
మరో ఆసక్తికర కథనం: సిప్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, రిస్క్ పెంచొచ్చు - ఆలోచించి అడుగేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

