Tesla: టెస్లా స్పెషలేమీ కాదు! ఎవరైనా మాకు ఒకటే అంటున్న మోదీ సర్కార్!
Tesla: ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు (Tesla) ప్రత్యేక రాయితీలేమీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
Tesla:
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు (Tesla) ప్రత్యేక రాయితీలేమీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి (PLS) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అత్యాధునిక రసాయన సెల్స్, ఆటో, ఆటో అనుబంధ రంగాలకు పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి గుర్తు చేస్తున్నారు. తమకు ఎవరైనా ఒకటేనని, ఏ ఒక్కరి కోసమో ప్రత్యేకంగా విధానాలు రూపొందించబోమన్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ భారత్‌కు రావాలని ఉవ్విళ్లూరుతోంది. స్థానికంగా అమ్మకాలు చేపట్టాలని భావిస్తోంది. మొదట విడి భాగాలు దిగుమతి చేసుకొని కార్లను అసెంబ్లింగ్ చేయాలని అనుకుంటోంది. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి తయారీ యూనిట్ నెలకొల్పాలన్నది వారి ఉద్దేశం. అయితే దిగుమతి చేసుకున్న కార్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని, పన్నులు, సుంకాలు తగ్గించాలని మస్క్ (Elon Musk) కోరుతున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ రాయితీలు ఇవ్వలేదని, ముందు పరిశ్రమ నెలకొల్పాలని మోదీ సర్కారు సూచిస్తోంది. ఈ మధ్య మోదీ (Narendra Modi) అమెరికాలో పర్యటించినప్పుడూ మస్క్ భారత్‌పై ఆసక్తి కనబర్చిన సంగతి తెలిసిందే.
ఎల్‌ఎఐ స్కీమ్ కింద అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్‌కు రూ.18,100 కోట్లు, ఆటో - ఆటో అనుబంధ, డ్రోన్ల తయారీ పరిశ్రమలకు రూ.26,058 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. 'ఇప్పటికే అందరి కోసం ప్రోత్సాహకాలు, విధానాలు ఉన్నాయి. పీఎల్‌ఐ కింద దరఖాస్తు చేసుకోవాలని మేం టెస్లాకు సూచించాం. సాధారణంగా అందరికీ ఒకే విధానం ఉంటుంది. ఒక్క కంపెనీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా విధానాలు రూపొందించదు. ఇప్పటికైతే టెస్లాకు ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ ఏమీ లేదు' అని ఆ అధికారి అన్నారు.
టెస్లాకు బ్యాటరీలు సరఫరా చేస్తున్న అతిపెద్ద కంపెనీ పానసోనిక్. ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని కలిశారు. 'వారిక్కడ బ్యాటరీలు తయారు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. మేం వారిని పీఎల్‌ఐ ఏసీసీ బ్యాటరీ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం' అని ఆ అధికారి వెల్లడించారు. అయితే పీఎల్‌ఐ ప్రోత్సాహాల కోసం ఈ మధ్యే 20GWh అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ బ్యాటరీ సెల్ తయారు చేస్తున్న కంపెనీలను రీబిడ్డింగ్‌కు ఆహ్వానించింది.
గత నెల్లో టెస్లా కంపెనీ ప్రతినిధులు భారత్‌ను సందర్శించారు. వాణిజ్య, ఆర్థిక, ఇతర మంత్రిత్వ శాఖలను సంప్రదించారు. ప్రస్తుతం విదేశాల్లో పూర్తిగా తయారైన కార్లకు 60 నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. ఇంజిన్ పరిమాణం, ధర, బీమా, రవాణా ఖర్చును బట్టి దీనిని నిర్ణయిస్తున్నారు.
Also Read: మీ డబ్బును పెంచే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్, ఆగస్టు 15 వరకే అవకాశం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial