Paytm: కొత్త ఫాస్టాగ్ తీసుకోకపోతే మీకు రోడ్డుపైనే జాగారం, ఇంకా ఒక్కరోజే గడువు
Paytm: ఇప్పటికీ పేటీఎం ఫాస్టాగ్ వినియోగిస్తుంటే ఇబ్బంది పడతారని NHAI ఇన్‌డైరెక్టుగా హెచ్చరించింది.
Paytm Payments Bank FASTag: కారు తీసుకుని హైవే ఎక్కితే, ఎంతో కొంత దూరంలో ఒక టోల్ ప్లాజా/ టోల్ గేట్ (Toll Plaza/ Toll Gate) తగులుతుంది. అక్కడ పన్ను కడితేనే బండి ముందుకు కదులుతుంది, లేదంటే అక్కడే ఆగిపోక తప్పదు. ఒకవేళ, పేటీఎం జారీ చేసిన ఫాస్టాగ్‌ను (Paytm FASTag) మీరు వినియోగిస్తుంటే, మీ కారు టోల్ ప్లాజా దగ్గర నిలిచిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లకు హెచ్చరిక
పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లు ఈనెల 15లోగా మరో బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సూచించింది. వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకుంటే, టోల్ ప్లాజాల దగ్గర జరిమానా లేదా రెట్టింపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సాఫీగా ముందుకు వెళ్లొచ్చని చెప్పింది. ఇప్పటికీ పేటీఎం ఫాస్టాగ్ వినియోగిస్తుంటే ఇబ్బంది పడతారని NHAI ఇన్‌డైరెక్టుగా హెచ్చరించింది.
పేటీఎమ్ ఫాస్టాగ్ వినియోగదార్లకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, తమ బ్యాంకులను సంప్రదించాలని NHAI సూచించింది. లేదంటే 'ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్' (IHMCL) వెబ్‌సైట్‌లోని FAQsను చూడాలని చెప్పింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) రిజర్వ్ బ్యాంక్ (RBI) విధించిన ఆంక్షల కారణంగా, పేటీఎం ఫాస్టాగ్ వినియోగదార్లు ఈ నెల 15 తర్వాత రీఛార్జ్ లేదా టాప్-అప్ చేయలేరు. అయితే, ఫాస్టాగ్‌లో ఇప్పటికే ఉన్న నిల్వను ఈ నెల 15 తర్వాత కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ప్రయాణం కొనసాగుతుంది. మార్చి 15 తర్వాత మీరు ఆ ఫాస్టాగ్‌ను రీఛార్జ్ లేదా టాప్-అప్ చేయలేరు. కాబట్టి, మీ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయే లోగా వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ కేర్‌తో మాట్లాడి రిఫండ్ అడగండి.
ఫాస్టాగ్‌ల లిస్ట్ నుంచి నుంచి పేటీఎం ఔట్
ఫాస్టాగ్ కొనుగోలు కోసం అనుమతించిన బ్యాంక్‌ల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను 'ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్' గతంలోనే తొలగించింది. హైవే మీద ఉన్న సమయంలో యూజర్లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే... పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మినహా మిగిలిన 32 బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని సూచించింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్లు ఉన్నారు. వీరిలో మేజర్ షేర్ పేటీఎందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన ఫాస్టాగ్ యూజర్ల వాటా, మొత్తం యూజర్లలో సుమారు 30%.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్'ను (NCMC) కూడా మార్చి 15 వరకే రీఛార్జ్ చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాత, అందులోని బ్యాలెన్స్ ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. మార్చి 15 తర్వాత ఆ కార్డ్‌ను రీఛార్జ్ చేయడం కుదరదు. ప్రయాణ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూదనుకుంటే, వేరే బ్యాంక్ నుంచి NCMC తీసుకోవాలి. NCMCలో ఉన్న బ్యాలెన్స్‌ను వేరే కార్డ్‌కు బదిలీ చేయడం కూడా కుదరదు. మీకు డబ్బులు వెనక్కు కావాలంటే, రిఫండ్ కోసం PPBLను సంప్రదించవచ్చు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదార్లతో పాటు వ్యాపారులు తమ బ్యాంకు ఖాతాలను మార్చి 15లోగా ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని కేంద్ర బ్యాంక్ గత నెలలో సూచించింది.
మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐతో చేతులు కలిపిన పేటీఎం, రేపటి కల్లా TPAP లైసెన్స్!