NFT Crypto: ఎన్‌ఎఫ్‌టీ, క్రిప్టో కరెన్సీ ఒకటేనా! లక్షలు పెట్టి ఎందుకు కొంటున్నారో తెలుసా!!
ఎన్‌ఎఫ్‌టీలను లక్షల డాలర్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ ఎన్‌ఎఫ్‌టీ అంటే ఏంటి? వీటినెలా తయారు చేస్తారు? ఎక్కడ విక్రయిస్తారు? ఇందులో పెట్టుబడి పడితే పెరుగుతుందా? ఉన్న డబ్బులు పోతాయా? వంటి వివరాలు మీ కోసం!
నాన్ ఫంగీబుల్ టోకెన్స్ (NFTs).. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట! కళాఖండాలు, వర్ణచిత్రాలు, టాయిలెట్ పేపర్లు, వీడియో ఫుటేజీ, ట్వీట్లు, ఎస్‌ఎంఎస్‌లు కాదేది ఎన్‌ఎఫ్‌టీకి అనర్హం.
విచిత్రంగా ఈ ఎన్‌ఎఫ్‌టీలను లక్షల డాలర్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇంతకీ ఎన్‌ఎఫ్‌టీ అంటే ఏంటి? వీటినెలా తయారు చేస్తారు? ఎక్కడ విక్రయిస్తారు? ఇందులో పెట్టుబడి పడితే పెరుగుతుందా? ఉన్న డబ్బులు పోతాయా? వంటి వివరాలు మీ కోసం!
NFTs అంటే?
NFTని సింపుల్‌గా ఒక డిజిటల్ అసెట్ అనుకోవచ్చు. వాస్తవ ప్రపంచంలోని కళాఖండాలు, చిత్రాలు, సంగీతం, వీడియో గేముల్లోని వస్తువులు, వీడియోలను ఈ డిజిటల్ అసెట్ ప్రతింబిస్తుంది. వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. క్రిప్టో కరెన్సీతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే వీటిని క్రిప్టో సాఫ్ట్‌వేర్లతోనే ఎన్‌కోడ్ చేస్తారు కాబట్టి. 2014 నుంచి ఎన్‌ఎఫ్‌టీలు ఉన్నప్పటికీ 2021లోనే ఎక్కువ ప్రాచుర్యం లభించింది. 2017 నుంచి ఇప్పటి వరకు 200 మిలియన్ డాలర్ల విలువైన ఎన్‌ఎఫ్‌టీలు అమ్ముడయ్యాయి.
యాజమాన్యం బదిలీ
ఈ ఎన్‌ఎఫ్‌టీల్లో సరఫరా కొరత ఉంటుంది. అందుకే డిమాండ్‌కు ఢోకా ఉండదు! ఇప్పటికే ఎన్నో ప్రత్యేకమైన వస్తువులు డిజిటల్ రూపంలో ఉన్నాయి. వాటిని సులువుగా కాపీ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఎన్‌ఎఫ్‌టీలో ప్రత్యేకత ఏంటన్న సందేహం రావొచ్చు. ఎందుకంటే ఈ ఎన్‌ఎఫ్‌టీలపై ఇదే ఒరిజినల్ అనే యాజమాన్య హక్కులు బదిలీ అవుతాయి. ఇన్‌బిల్ట్‌గా అథెంటికేషన్, సంతకాలు ఉంటాయి. అందుకే ఇంత క్రేజ్.
క్రిప్టో కరెన్సీ, ఎన్‌ఎఫ్‌టీ ఒకటేనా?
ఈ రెండింటికీ కాస్త అనుబంధం ఉంది. బిట్‌కాయిన్, ఎథిరియమ్ వంటి క్రిప్టో కరెన్సీకి ఉపయోగించే బ్లాక్‌చైన్ ప్రోగ్రామింగ్‌తోనే రూపొందిస్తారు. వాస్తవ నగదు, క్రిప్టో కరెన్సీని ఫంగీబుల్ అంటారు. అంటే ఒకదాన్ని ఉపయోగించి మరొకటి ట్రేడ్ చేయొచ్చు. ఉదాహరణకు ఒక డాలర్‌తో పోలిస్తే మరో డాలర్ విలువ సమానంగానే ఉంటుంది. ఒక బిట్‌కాయిన్‌తో మరో బిట్‌కాయిన్ సమానమే. ఎన్‌ఎఫ్‌టీలు అలా కాదు. ప్రతి దానిపై డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. దానిని బదిలీ చేసేందుకు వీలుండదు. అంటే ఒక ఎన్‌ఎఫ్‌టీ మరో ఎన్‌ఎఫ్‌టీకి సమానం కాదు. కాబట్టే నాన్ ఫంగీబుల్ అంటారు.
NFTs ఎలా పనిచేస్తాయి?
NFTs బ్లాక్‌చైన్‌లో ఉంటాయి. లావాదేవీలను భద్రపరిచే పబ్లిక్ లెడ్జర్ ద్వారా వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సాధారణంగా ఎన్ఎఫ్‌టీలు ఎథిరియమ్ బ్లాక్‌చైన్‌లో ఉంటాయి. మిగతా క్రిప్టో బ్లాక్‌చైన్లూ వీటికి మద్దతిస్తాయి. భౌతిక, డిజిటల్ ఇలా ఏ వస్తువునైనా ఎన్‌ఎఫ్‌టీగా మార్చొచ్చు. కళాఖండాలు, జిఫ్‌లు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్, సేకరించే వస్తువులు, వర్చువల్ అవతార్లు, వీడియో గేమ్ శరీరాలు, డిజైనర్ స్నీకర్లు, సంగీతం వంటివి అన్నమాట. జాక్ డోర్సీ చేసిన మొదటి ట్వీటు 2.9 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు.
డబ్బు వస్తుంది కానీ!
NFTs వల్ల డబ్బు సంపాదించొచ్చు. వేలంలో తక్కువ ధరకే సొంతం చేసుకొని బయట ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. దీనివల్ల కళాకారులకు ఉపయోగం ఎక్కువే. అమ్మిన ప్రతిసారీ రాయల్టీ కింద డబ్బు వస్తుంది. మన దేశంలో సన్నీ లియోన్, యువరాజ్ సింగ్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ఎన్‌ఎఫ్‌టీలు తయారు చేయించారు. ఎన్‌ఎఫ్‌టీలు కొనుగోలు చేయాలంటే డిజిటల్ వాలెట్, క్రిప్టో కరెన్సీ అవసరం. కాయిన్ బేస్, క్రాకెన్, ఈటొరో, పేపాల్ వంటి వేదికల్లో కొనుగోలు చేయొచ్చు. ఏదేమైనా క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టీ వ్యవహారం రిష్క్‌తో కూడుకున్నది. తెలియకుండా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు!!