Income Tax: అంచనాలను మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు, కేంద్ర ఖజానాకు కళ
బడ్జెట్ అంచనా కంటే 16.97 శాతం లేదా రూ. 2.41 లక్షల కోట్లు ఎక్కువ.
Direct Tax Collections: 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీ స్థాయిలో పెరిగాయి, ప్రభుత్వ అంచనాలను మించి ఖజానా నిండింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికరంగా 16.61 లక్షల కోట్ల రూపాయలు నికర ప్రత్యక్ష పన్నుల (Net Direct Tax collections) రూపంలో వసూలయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో ఈ లెక్క రూ. 14.12 లక్షల కోట్లుగా ఉంది. దీనితో పోలిస్తే, 2022-23లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.63 శాతం పెరిగాయి.
అంచనాల కన్నా 17 శాతం ఎక్కువ వసూళ్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాత్కాలిక డేటా ప్రకారం, ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 16.61 లక్షల కోట్లకు చేరాయని చెప్పుకున్నాం కదా. ఇది బడ్జెట్ అంచనా కంటే 16.97 శాతం లేదా రూ. 2.41 లక్షల కోట్లు ఎక్కువ. బడ్జెట్ అంచనాల్లో రూ. 14.20 లక్షల కోట్లను ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకోగా, అంచనాల సవరింపు తర్వాత ఈ టార్గెట్‌ను రూ. 16.50 లక్షల కోట్లకు పెంచారు. ప్రాథమిక అంచనాల కన్నా దాదాపు 17 శాతం (16.97 శాతం) ఎక్కువ మొత్తం వసూలైంది, సవరించిన అంచనా కంటే 0.69 శాతం ఎక్కువ మొత్తం దేశ ఖజానాలోకి చేరింది.
CBIT జారీ చేసిన రిఫండ్‌లను కూడా కలుపుకుంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Gross Direct Tax collections) రూ. 19.68 లక్షల కోట్లు. 2021-22లో వసూలైన రూ. 16.36 లక్షల కోట్ల కంటే ఇది 20.33 శాతం ఎక్కువ.
➡️Direct Tax collections(provisional) for FY2022-23 exceed the BE by ₹2.41 lakh crore i.e by 16.97% & RE by 0.69%
— Income Tax India (@IncomeTaxIndia) April 3, 2023
➡️Gross DT collections(provisional) at ₹19.68 lakh crore register a growth of 20.33%
➡️Net DT collections(provisional) at ₹16.61 lakh crore mark a growth of 17.63% pic.twitter.com/wa9VIJsYH8
కార్పొరేట్ పన్ను వసూళ్లు
2022-23లో కార్పొరేట్ పన్ను వసూళ్లు (Corporate Income Tax collection) 16.91 శాతం పెరిగి రూ. 10,04,118 కోట్లకు చేరుకోగా, 2021-22లో ఈ మొత్తం రూ. 8.58,849 కోట్లుగా ఉంది.
వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు
2022-23లో, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్‌ను (STT) కలుపుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను (Personal Income Tax collection) రూపంలో రూ. 9,60,764 కోట్లు వసూలు అయ్యాయి. 2021-22 కంటే ఇది 24.23 శాతం ఎక్కువ. 2021-22లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ. 7,73,389 కోట్లుగా ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), ఆదాయపు పన్ను శాఖ రూ. 3,07,352 కోట్లను వాపసు (Income Tax Refund) చేసింది. 2021-22లోని రూ. 2,23,658 కోట్లతో పోలిస్తే ఇది రూ. 37.42 కోట్లు ఎక్కువ.