Multibagger: మల్టీబ్యాగర్ రిటర్న్స్ అంటే ఇవి, ₹10 వేలు ₹10 లక్షలయ్యాయ్!
ఈ స్టాక్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసినవాళ్లు ఇప్పుడు రూ. 10 లక్షల రాబడిని కళ్లజూశారు.
Multibagger Stock: ఆటో సెక్టార్ స్టాక్ ఒకటి బంపర్ రిటర్న్స్ ఇచ్చింది, పెట్టుబడిదార్లను లక్షాధికారులుగా మార్చింది. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ స్టాక్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసినవాళ్లు ఇప్పుడు రూ. 10 లక్షల రాబడిని కళ్లజూశారు.
ET రిపోర్ట్ ప్రకారం, జేబీఎం ఆటో షేర్లు (JBM Auto Shares) గత 10 సంవత్సరాల కాలంలో 9962 శాతం లాభపడ్డాయి. అంటే, ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు దాని ఆ పెట్టుబడి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుంది.
మూడేళ్లలో మంచి రాబడి - ఆరు నెలల్లో రెట్టింపు
ఈ కంపెనీ షేర్లు గత ఐదేళ్లలో 643 శాతం రాబడిని ఇచ్చాయి. గత మూడేళ్ల కాలాన్ని మాత్రమే పరిశీలిస్తే.. ఈ షేరు 1192 శాతం ర్యాలీతో శ్రీహరికోట రాకెట్‌లా దూసుకెళ్లింది. దీని ఘనతలు ఇంకా అయిపోలేదు. కేవలం గత ఆరు నెలల్లోనే రెట్టింపు పైగా పెరిగింది. సరిగ్గా ఆరు నెలల క్రితం, అంటే, 2022 డిసెంబర్ 20న ఈ స్టాక్ ధర రూ. 477. ఇవాళ (సోమవారం, 10 జూన్ 2023) దీని ముగింపు ధర రూ. 1,005.95. ఈ లెక్కన, ఆరు నెలల క్రితం ఈ స్టాక్ కొన్నా, ఇప్పుడు ఆ పెట్టుబడి డబుల్ అయి ఉండేది.
ఇవాళ్టి క్లోజింగ్ ప్రైస్ అయిన రూ. 1,005.95 ఈ స్టాక్ జీవిత కాల గరిష్టం కూడా.
వ్యాపారం, మార్కెట్ క్యాప్
రూ. 11.90 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న JBM గ్రూప్‌నకు చెందిన స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. ఆటోమోటివ్ ప్రొడక్ట్స్, సబ్ సిస్టమ్స్‌ను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఇంకా, ఎయిర్ ట్యాంకులు, ఛాసిస్, సస్పెన్షన్ భాగాలు, క్రాస్ కార్ బీమ్స్, ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఆయిల్ ట్యాంకులు, హీట్ ట్యాంకులు, ఇతర ఉత్పత్తులను కూడా ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.
ఎవరి వాటా?
తాజా డేటా ప్రకారం, ఈ కంపెనీలో ప్రమోటర్లకు 67.52 శాతం స్టేక్ ఉంది. 32.48 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్ల చేతుల్లో ఉంది. పబ్లిక్ షేర్‌హోల్డర్లలో.. మ్యూచువల్ ఫండ్స్‌కు పెద్దగా వాటా లేదు. విదేశీ పెట్టుబడిదార్ల 1.67 శాతం షేర్లు కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర 9.36 శాతం వాటా ఉంది.
గత 10 ఏళ్లలో పురోగతి
FY13లో, జేబీఎం ఆటో అమ్మకాల ఆదాయం 1364 కోట్ల రూపాయలుగా ఉంటే.. FY23లో 3857 కోట్ల రూపాయలకు చేరింది. అదే కాలంలో నికర లాభం రూ. 57 కోట్ల నుంచి రూ. 124 కోట్లకు పెరిగింది. 2023 మార్చి త్రైమాసికంలో, కంపెనీ ఆదాయం 8 శాతం తగ్గి రూ. 964 కోట్లకు పరిమితమైంది. 2022 ఆర్థిక సంవత్సరంలోని అదే కాలంలో రూ. 1,055 కోట్లుగా ఉంది. అదే కాలానికి PAT రూ. 26.81 కోట్లుగా నమోదైంది.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్ చేతుల్లో ఉన్న మ్యాజిక్ స్టాక్స్, 3 నెలల్లో 30% ర్యాలీ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.