Mukesh Ambani: రిచెస్ట్ పార్టీలో రీఎంట్రీ కోసం అంబానీ అడుగులు, ఎక్కువ దూరం లేదు!
ముకేష్ అంబానీ 13వ ప్లేస్‌లో ఉన్నారు. టాప్-10 లిస్ట్‌లోకి రావడానికి కేవలం ముగ్గుర్ని దాటితే చాలు.
Mukesh Ambani Networth: భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ, ప్రపంచ టాప్-10 రిచ్ పర్సన్స్ పార్టీలోకి మరోసారి ఎంట్రీ టిక్కెట్ దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో (bloomberg billionaires index) ముకేష్ అంబానీ 13వ ప్లేస్‌లో ఉన్నారు. టాప్-10 లిస్ట్‌లోకి రావడానికి కేవలం ముగ్గుర్ని దాటితే చాలు. అంబానీ ఆస్తులకు, ఆ ముగ్గురు బిలియనీర్ల భోషాణాలకు మధ్య పెద్దగా తేడా లేదు. పైగా, ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ మధ్యకాలంలో విపరీతంగా ర్యాలీ చేస్తున్నాయి. ఇండెక్స్‌లతో పాటే అంబానీ నెట్‌వర్త్ కూడా పెరుగుతోంది, ఆ ముగ్గురితో ఉన్న గ్యాప్ అతి త్వరలోనే కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా, గత కొన్ని రోజులుగా ముకేష్ అంబానీ వేల కోట్ల రూపాయల లాభం ఆర్జించారు. దీంతో, అంబానీ నికర విలువ $90 బిలియన్ల మార్క్ దాటింది, $90.6 బిలియన్లకు చేరుకుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, ఈ బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ $3.46 బిలియన్ల లాభం ఆర్జించారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ డేటా
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న అంబానీ కంటే ముందు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మెయెర్స్, కార్లోస్ స్లిమ్, సెర్గెయ్ బ్రిన్ ఉన్నారు. టాప్-10 రిచెస్ట్ లిస్ట్‌లోకి రీఎంట్రీ తీసుకోవాలంటే ముకేష్ అంబానీ ఈ ముగ్గురిని ఓడించాలి. ప్రస్తుతం 92.6 బిలియన్ డాలర్ల సంపదతో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటాన్‌కోర్ట్ మెయెర్స్ 12వ ప్లేస్‌లో ఉన్నారు. 11వ స్థానంలో మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్ ఉన్నారు, ఆయన నెట్‌వర్త్ 97.2 బిలియన్ డాలర్లు. 10వ ర్యాంక్ తీసుకున్నది అమెరికాకు చెందిన సెర్గీ బ్రిన్. ఈయన వ్యక్తిగత సంపద విలువ 104 బిలియన్ డాలర్లు.
టాప్-20లో కూడా లేని గౌతమ్ అదానీ
ఒకప్పుడు ప్రపంచంలోనే మూడో అత్యంత ధనికుడిగా దడదడలాడించిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రస్తుతం టాప్-20 లిస్ట్‌లో కూడా లేరు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ఆయన ర్యాంక్ 21. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ ఆస్తుల విలువ (Gautam Adani net worth) $60.3 బిలియన్లు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు, అదానీ $60.2 బిలియన్ల సంపద నష్టపోయారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిలీజ్ చేసిన బ్లాస్టింగ్ రిపోర్ట్ కారణంగా ఈ సంవత్సరం అదానీ స్టాక్స్ అత్యంత భారీగా పడిపోయాయి. ఈ ఏడాది జనవరి 27న, అదానీ ఒక్క రోజులోనే 20.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. ఇదొక రికార్డ్. గతంలో ఏ బిలియనీర్ కూడా ఒక్క రోజులో ఇంత నష్టపోలేదు.
ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలాన్ మస్క్
టెస్లా CEO ఎలాన్ మస్క్, ప్రస్తుతం $247 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, మస్క్ $110 బిలియన్లు సంపాదించారు. ఫ్రెంచ్ బిజినెస్ టైకూన్ బెర్నార్డ్ అర్నాల్డ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Wilmar, Ujjivan, Marico
Join Us on Telegram: https://t.me/abpdesamofficial