TCS: ఫారిన్‌లో కార్డ్ పేమెంట్స్‌పై మరింత ఊరట - కొత్త ప్రకటన చేసిన కేంద్రం
ప్రస్తుత LRS పరిమితి 2,50,000 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాలను అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లిస్తున్నారని తేలిందని వెల్లడించింది.
RBI LRS Scheme: అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి విదేశాల్లో చేసే ఖర్చుపై విధించే 20 శాతం TCSపై (tax collection at source లేదా మూలం వద్ద పన్ను సేకరణ) ప్రజల్లో సంశయాలు, ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరొకమారు స్పష్టతనిచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే వ్యయాల్లో రూ. 7 లక్షల వరకు TCS వర్తించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జులై 1, 2023 తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో ఖర్చు చేసినా, రూ. 7 లక్షల లోపు వ్యయాలకు TCS నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
కొత్త ప్రకటన విడుదల చేసిన ఆర్థిక శాఖ
శుక్రవారం (మే 19, 2023) విడుదల చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ... "జులై 1, 2023 నుంచి, సరళీకృత చెల్లింపు పథకం (Liberalized Remittance Scheme/LRS) కింద చిన్న లావాదేవీలకు కూడా TCS వర్తిస్తుందేమోనన్న ఆందోళనలు ప్రజల్లో తలెత్తాయి. విధానపరమైన ఇలాంటి అస్పష్టతను తొలగిస్తున్నాం. ఒక వ్యక్తి తన అంతర్జాతీయ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల వరకు చేసే ఏ రకమైన చెల్లింపులకైనా ఎల్‌ఆర్‌ఎస్ పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది, ఆ వ్యయం TCSని ఆకర్షించదు" అని పేర్కొంది.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా విదేశాల్లో చేసే వ్యయాన్ని ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి తీసుకువస్తూ, మే 16న, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 'ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్' (ఫెమా/FEMA) కింద నిబంధనలు సవరించింది. 2023 జులై 1 నుంచి వర్తించేలా, ఒక వ్యక్తి భారతదేశం వెలుపల ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే అన్ని అంతర్జాతీయ లావాదేవీలను RBI LRS కిందకు తీసుకువచ్చారు.
RBI LRS కిందకు ఎందుకు తీసుకువచ్చారు?
క్రెడిట్ కార్డ్ లావాదేవీలను RBI LRS కిందకు ఎందుకు తీసుకురావలసి వచ్చింది అన్న విషయంపైనా కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. గతంలో, రూల్ 7 ప్రకారం అందుబాటులో ఉన్న మినహాయింపు కారణంగా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే ఖర్చులు LRS పరిమితిలోకి రాలేదని, దీనివల్ల కొంతమంది వ్యక్తులు LRS పరిమితులను దాటారని చెప్పింది. టాప్ రెమిటర్స్ లావాదేవీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, ప్రస్తుత LRS పరిమితి 2,50,000 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాలను అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లిస్తున్నారని తేలిందని వెల్లడించింది. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించి, ఏకరూపత తీసుకురావాల్సిన అవసరం ఉందని, విదేశీ మారక నిర్వహణలో సమర్థత తీసుకురావడం, ఎల్‌ఆర్‌ఎస్ పరిమితులను దాటకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
విద్య & వైద్య పరమైన చెల్లింపులకు మినహాయింపు
దీంతోపాటు, యూనియన్ బడ్జెట్ 2023లో, LRS కింద విదేశీ చెల్లింపులపై (foreign remittances) TCSని 5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఈ రూల్ జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. విద్య & వైద్య పరమైన చెల్లింపులకు మినహాయింపు ఇచ్చింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన ప్రకారం, అంతర్జాతీయ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల వరకు చేసే చెల్లింపులకు TCS వర్తించదు. విద్య, వైద్య ఖర్చుల కోసం చేసే చెల్లింపులకు ప్రస్తుతం ఉన్న TCS ప్రయోజనం కూడా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మైనర్ సహా భారతదేశ పౌరులంతా, అనుమతించిన కరెంట్ ఖాతా లేదా పెట్టుబడి ఖాతా (capital account) లావాదేవీ లేదా రెండింటి కలయిక ద్వారా చేసే విదేశీ చెల్లింపు లావాదేవీలు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కిందకు వస్తాయి. ఈ పథకం కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 వరకు ఆర్‌బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయవచ్చు. భారతదేశ పౌరులు FEM (CAT) రూల్స్-2000లోని షెడ్యూల్ IIIలోని పారా-1లో సూచించిన ప్రకారం, 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు మాత్రమే అనుమతి అక్కర్లేని విదేశీ మారకపు ప్రయోజనం పొందుతారు.
ఇది కూడా చదవండి: ₹2000 నోట్లు ఇప్పుడు చెల్లుతాయా, దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎంత?