Gas Cylinder Price Cut: రూ.45 తగ్గిన గ్యాస్ సిలిండర్ రేటు - మీ నగరంలో కొత్త ధరలు ఇవీ
LPG Cylinder Price News: ఇళ్లలో వినియోగించే LPG సిలిండర్ల ధరలను చివరిసారిగా 2024 మార్చిలో తగ్గించారు. గత 11 నెలలుగా ఈ రేటులో ఎటువంటి మార్పు రాలేదు.

LPG Cylinder Price Cut From 01 April 2025: శ్రీరామనవమి సందర్భంగా, చిరు వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా ఒక శుభవార్త చెప్పింది. వాణిజ్యం & వ్యాపార అవసరాలకు ఉపయోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేటును తగ్గించింది. దేశవ్యాప్తంగా, ఏప్రిల్ 01, 2025 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 45 వరకు దిగి వచ్చింది. అయితే, గృహోపయోగ గ్యాస్ సిలిండర్‌లో రేటులో ఎటువంటి మార్పు లేదు. గత నెలలో, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ. 6 పెరిగింది.
గృహ వినియోగానికి ఉపయోగించే LPG సిలిండర్ల ధరలను చివరిసారిగా ఏడాది క్రితం, అంటే మార్చి 2024లో తగ్గించారు. దీని తర్వాత, గత 11 నెలలుగా LPG ధర స్థిరంగా ఉంది & ఎటువంటి మార్పు చేయలేదు.
మెట్రో నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
దేశంలోని అతి పెద్ద పెట్రోలియం కంపెనీ 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (IOC) నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రోజు (01 ఏప్రిల్ 2025) నుంచి, దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1762 గా ఉంది, గత నెల కంటే రూ. 41 తగ్గింది. కోల్‌కతాలో రూ. 44.50 పైసలు తగ్గిన తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొత్త ధర రూ. 1868.50 గా మారింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ రూ. 42 తగ్గింది, ఈ రోజు నుంచి రూ. 1713.50 లకు లభిస్తోంది. చెన్నైలో కమర్షియల్ బండ రేటు రూ. 43.50 ఉపశమనంతో కొత్త ధర రూ. 1921.50 అయింది.
సాధరణ ప్రజలు ఇళ్లలో వంటకు ఉపయోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర (Domestic LPG Cylinder Price Today) తగ్గలేదు, పెరగలేదు. ప్రస్తుతం, 14.2 కిలోల బరువున్న సాధారణ LPG సిలిండర్ దిల్లీలో రూ. 803, ముంబైలో రూ. 802 50 పైసలు, కోల్‌కతాలో రూ. 829 & చెన్నైలో రూ. 818.50 పైసలకు అందుబాటులో ఉంది. చివరిసారిగా, 2024 మార్చి 9న, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ. 100 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ రేట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు దాదాపు రూ. 42 తగ్గింది. గృహ వినియోగ 14.2 కేజీల గ్యాస్ బండ రేటు హైదరాబాద్‌లో (14 KGs (Domestic Gas Cylinder Price In Hyderabad) 855 రూపాయలుగా ఉంది. విజయవాడలోనూ (14 KGs (Domestic Gas Cylinder Price In Vijayawada) ఇదే ధర చెల్లించాలి. స్థానిక రవాణా ఖర్చుల కారణంగా ఈ ధర అతి స్వల్పంగా మారే అవకాశం ఉంది.
గృహ & వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రతి నెల ప్రారంభంలో ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies - OMCs) సమీక్షిస్తాయి & అంతర్జాతీయ ధరల ఆధారంగా దేశీయ ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు & గ్యాస్ ధరలు తగ్గినప్పటికీ, లోగడ నష్టాలను భర్తీ చేసుకునే నెపంతో, ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటును చాలా కాలంగా తగ్గించడం లేదు. వాణిజ్య సిలిండర్ ధరలను మాత్రం ఎప్పటికప్పుడు సవరిస్తున్నాయి.
దేశీయ & వాణిజ్య LPG సిలిండర్‌ల రేట్లను ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ iocl.com నుంచి తీసుకోవడం జరిగింది.





















