(Source: Poll of Polls)
Reliance Lotus Chocolate: సినీ నటి శారద కంపెనీని రిలయన్స్ కొంటోంది తెలుసా, డీల్ వాల్యూ ఎంతంటే?
లోటస్ చాకోలేట్ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ కావడం వరుసగా ఇది 5వ రోజు.
Reliance Lotus Chocolate: రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనబోతోంది అన్న వార్తలతో లోటస్ చాకోలేట్ కంపెనీ లిమిటెడ్ (Lotus Chocolate Company Ltd) షేర్ ధర ఇవాళ (శుక్రవారం, 30 డిసెంబర్ 2022) కూడా అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. ఇవాళ 5 శాతం లేదా రూ. 5.85 పెరిగిన షేర్ ధర రూ. 122.95 వద్ద ఫ్రీజ్ అయింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail Ventures Ltd) యూనిట్, లోటస్ చాకోలేట్ మేకర్‌లో మెజారిటీ వాటాను కొనబోతోంది అన్న వార్తలతో ఈ కంపెనీ షేర్లకు డిమాండ్ పెరిగింది. రూ. 74 కోట్లకు ($8.94 మిలియన్) కొనుగోలు చేయడానికి రెండు సంస్థల మధ్య అంగీకారం కుదిరింది.
లోటస్ చాకోలేట్ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌లో లాక్ కావడం వరుసగా ఇది 5వ రోజు. ఈ వారం ప్రారంభం (సోమవారం) నుంచి ఇలా అప్పర్ సర్క్యూట్ కొడుతూనే ఉంది. రిలయన్స్-లోటస్ డీల్ గురించి అధికారికంగా నిన్న (గురువారం) ప్రకటించినా, కొన్ని మార్కెట్ శక్తులకు అంతకన్నా ముందే తెలుసని దీనిని బట్టి అర్ధం అవుతోంది. ఈ ఐదు రోజుల్లోనే ఒక్కో షేరు ధర రూ. 24.50 లేదా 24.89 శాతం పెరిగింది.
సినీ నటి శారద ఏర్పాటు చేసిన కంపెనీ
లోటస్ చాక్లెట్ కంపెనీని 1988లో సినీ నటి శారద, విజయ రాఘవన్ నంబియార్ కలిసి ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్‌లో ఈ యూనిట్ ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యకలాపాలు సాగిస్తోంది. చాకోలేట్స్‌తో పాటు, కొకోవా ప్రొడక్ట్స్ (Cocoa products), కొకోవా అనుబంధ ఉత్పత్తులను లోటస్ చాకోలేట్ కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం, సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న సన్‌షైన్ అలైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుబంధ సంస్థగా లోటస్ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది.
ఈ కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ల ఎంటిటీల నుంచి ఈ కంపెనీలో మెజారిటీ స్టేక్‌ను ( 51 శాతం వాటా) రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కొనబోతోంది. ఈ 51 శాతం వాటా లేదా దానికి సమానమైన 65 లక్షల 48 షేర్లను ఒక్కో షేరుకు సగటున రూ. 113 చెల్లించి కొంటోంది. ఇందుకోసం రూ. 74 కోట్ల పెట్టుబడి పెడుతోంది.
26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్
మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం, మరో 26 శాతం వాటా లేదా దానికి సమానమైన 33 లక్షల 38 వేల షేర్లను ఓపెన్ మార్కెట్ ద్వారా రిలయన్స్ కొంటుంది. ఇందుకోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటిస్తుంది.
2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, రూ. 87 కోట్ల ఆదాయాన్ని, రూ. 6 కోట్ల నికర లాభాన్ని లోటస్ చాకోలేట్ కంపెనీ ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.