LIC New Jeevan Shanti Policy: ఈ పాలసీలో ఒక్క ప్రీమియం కడితే చాలు, ప్రతి నెలా ఆదాయం!
మన దేశంలో ఎక్కువ మంది ప్రజల ఆదాయం వాళ్ల 60 ఏళ్లు దాటిన తర్వాత ఆగిపోతుంది. కుటుంబ ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.
LIC New Jeevan Shanti Policy: తెలివైన ప్రతి వ్యక్తి, డబ్బు సంపాదించే కాలం కోసం మాత్రమే కాక, సంపాదించలేని కాలం (రిటైర్‌మెంట్, వృద్ధాప్యం) కోసం కూడా ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తాడు. సాధారణంగా, మన దేశంలో ఎక్కువ మంది ప్రజల ఆదాయం వాళ్ల 60 ఏళ్లు దాటిన తర్వాత ఆగిపోతుంది. కుటుంబ ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ముందస్తు వ్యూహం లేకపోతే అటువంటి పరిస్థితిలో గడ్డు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ యవ్వన లేదా సంపాదన కాలంలోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, వృద్ధాప్యంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India- LIC) ప్రజల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల బీమా పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న బీమా పాలసీ పేరు LIC న్యూ జీవన్ శాంతి పాలసీ (New Jeevan Shanti Policy). ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా, జీవితాంతం నెలనెలా పింఛను పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇవి:
LIC న్యూ జీవన్ శాంతి పాలసీ
LIC తీసుకొచ్చిన న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీలో మీకు రెండు పెట్టుబడి ఎంపికలు లభిస్తాయి. మొదటిది ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్, రెండోది డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.
ఇంటర్మీడియట్ యాన్యుటీ ఆప్షన్‌లో... మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే పింఛను సౌకర్యం పొందుతారు.
డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్‌లో... పాలసీ తీసుకున్న తర్వాత, 1, 5, 10, 12 సంవత్సరాల తర్వాతి నుంచి మీకు పింఛను సౌకర్యం లభిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా... అర్ధ వార్షిక (6 నెలలకు ఒకసారి), త్రైమాసిక (3 నెలలకు ఒకసారి) లేదా నెలవారీ ప్రాతిపదికన పింఛను పొందే సౌకర్యం ఉంది. దీనిలో మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవచ్చు.
- ఈ ప్లాన్ కొనుగోలుకు కనీస మొత్తం - 1.50 లక్షలు
- ప్లాన్ కొనుగోలుకు గరిష్ట మొత్తం - పరిమితి లేదు
- ప్లాన్ కొనడానికి కనీస వయస్సు - 30 సంవత్సరాలు
- ప్లాన్ కొనడానికి గరిష్ట వయస్సు - 79 సంవత్సరాలు
- రూ.1.5 లక్షల పెట్టుబడికి ఏటా రూ. 1,000 పింఛను లభిస్తుంది.
- మీరు ఈ పాలసీని తీసుకున్న తర్వాత, మీకు అవసరం లేదనుకుంటే సరెండర్ చేయవచ్చు.
- ఈ పాలసీ మీద రుణ సౌకర్యం అందుబాటులో ఉంది.
- న్యూ జీవన్ శాంతి ప్లాన్‌లో సింగిల్ & జాయింట్ లైఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
ఈ పాలసీలో, సింగిల్ లైఫ్ & సెకండ్ జాయింట్ లైఫ్ రెండింటిలోనూ ఖాతాను తెరవవచ్చు. సాధారణంగా ఒక ప్లాన్ తీసుకున్న తర్వాత, ఆ పాలసీదారు మాత్రమే పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, డిపాజిట్ మొత్తాన్ని నామినీకి ఇస్తారు. న్యూ జీవన్ శాంతి పాలసీ సెకండ్ జాయింట్ లైఫ్ ఆప్షన్ తీసుకుంటే, దురదృష్టవశాత్తు మొదటి పాలసీదారు మరణిస్తే, రెండో వ్యక్తికి కూడా జీవితాంతం పింఛను ప్రయోజనం లభిస్తుంది. ఇద్దరూ చనిపోతే, డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఎల్‌ఐసీ అందిస్తుంది.