ఇండియాకి గుడ్ బై చెప్పేస్తున్న బిలియనీర్లు! ఎక్కడికి వెళుతున్నారంటే?
ఈ ఏడాది 4,300 మంది మిలియనీర్లు ఇండియా విడిచి వలస వెళ్లనున్నారని ప్రపంచంలోని ధనికుల వలసలను పర్యవేక్షించే ప్రైవేట్ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ 'ది హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ 2024' వెల్లడించింది.
Millionaires Migration: చాలా కాలంగా భారతదేశాన్ని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి అధిక సంపద కలిగిన వ్యక్తులు ఇతరదేశాలకు వలసవెళ్లిపోవటమే. ప్రతి ఏటా ఈ సంఖ్యకు సంబంధించిన వివరాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.
దీనికి సంబంధించి హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్- 2024 తాజా డేటాను వెలువరించింది. దీని ప్రకారం ఈ ఏడాది ఇండియా నుంచి దాదాపు 4300 మంది సంపన్నులు మైగ్రేట్ అవుతారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల వలసల విషయంలో భారత్ అగ్ర దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, సామాజిక అశాంతి కారణంగా వలసలు కొనసాగుతున్నాయని వెల్లడైంది. ఇక్కడ భారతీయ కోటీశ్వరులు ఎక్కువగా వలస వెళుతున్న ఫేవరెట్ డెస్టినేషన్ యూఏఈ కావటం గమనార్హం.
యూఏఈలో వ్యక్తులకు ఆదాయాపు పన్ను ఉండదు. దీనికి తోడు గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, విలాసవంతమైన జీవనశైలి, వ్యూహాత్మక స్థానం కారణంగా 2024లో UAE 6700 మంది సంపన్నులను ఆకర్షించొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. యూఏఈలో సంపద నిర్వహణ పర్యావరణ వ్యవస్థ వృద్ధి భారీగా ఉందని దుబాయ్‌లోని హౌరానీ భాగస్వామి సునీతా సింగ్ దలాల్ పేర్కొన్నారు. యూఏఈ సంపన్న వ్యక్తులకు వారి సంపదను రక్షించుకోవటానికి, సంరక్షితంగా ఉంచుకోవటానికి, వృద్ధి చేయడానికి అనేక వినూత్న ఆఫర్‌లను అందిస్తోందని పేర్కొన్నారు.
ఇక భారతీయ సంపన్నులు వలస వెళ్లేందుకు ఇష్టపడుతున్న దేశాల జాబితాను గమనిస్తే.. పోర్చుగల్ యొక్క గోల్డెన్ రెసిడెన్స్ పర్మిట్ ప్రోగ్రామ్, గ్రీస్ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్, స్పెయిన్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ వంటివి ప్రధానంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇక కరేబియన్ దేశాల్లో ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం, పెట్టుబడి కార్యక్రమాల ద్వారా సంపన్న భారతీయులను, వారి కుటుంబాలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇండియాతో పాటు.. చైనా, యూకే, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తైవాన్, వియత్నాం, నైజీరియా దేశాల నుంచి కూడా భారీ స్థాయిలో సంపన్నుల వలసలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని అడ్డుకోవటానికి ప్రధానంగా రాజకీయ, ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ గవర్నమెంట్ డైరెక్టర్, CEO డా.హన్నా వైట్ పేర్కొన్నారు.
సంపన్నులు ఒక దేశాన్ని వీడి మరో దేశానికి వెళుతున్నప్పుడు వారు తమ డబ్బును వెంట తీసుకెళ్లటం వల్ల విదేశీ మారక ద్రవ్య వనరులపై ప్రభావం పడుతుందని న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ హెడ్ ఆండ్రూ అమోయిల్స్ పేర్కొన్నారు. వీరు కొత్త ప్రాంతాల్లో ప్రారంభించే వ్యాపారాలు కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ జరుగుతుందని.. ఈ క్రమంలో అధిక నికర విలువ కలిగిన సంపన్న వ్యక్తులకు అనుకూలమైన విధానాలు, చట్టాలు కలిగి ఉన్న దేశాలు ఎక్కువ ప్రయోజనాన్ని పొందాయని నిపుణులు చెబుతున్నారు.
సంపన్న వ్యక్తులు విదేశాల్లో మంచి వ్యాపార అవకాశాల కోసం చూస్తున్నందున, UAE, USA, పోర్చుగల్ వంటి దేశాలు పెట్టుబడి వలస కార్యక్రమాల ద్వారా ఆకర్షణీయమైన ఎంపికలుగా మారుతున్నాయి. అయితే ఈ వలసలు భారతదేశాన్ని పెద్దగా ఆందోళనలకు గురిచేయటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశంలో వలసవెళుతున్న వారి కంటే కొత్త మిలియనీర్ల సంఖ్య పెరగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మిలియనీర్ల సంఖ్యలో ఇండియా ప్రపంచంలోనే 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇండియాలో స్టార్టప్ కల్చర్ కారణంగా వేగంగా ధనవంతులు పుడుతున్న సంగతి మనం రోజూ చూస్తూనే ఉన్నప్పటికే వలసలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.